NTV Telugu Site icon

Amit Shah Warning : ఆయుధాలు అప్పగించని వారికి అమిత్‌ షా సీరియస్‌ వార్నింగ్‌

Amit Shah

Amit Shah

Amit Shah Warning : మణిపూర్‌లో జరిగిన హింస సందర్భంగా భద్రతా దళాల నుంచి ఆయుధాలను ఎత్తుకెళ్లిన వారికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. హింస సందర్భంగా ఆయుధాలు తీసుకెళ్లి ఇప్పటి వరకు అప్పగించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి హెచ్చరించారు. అలాగే మణిపూర్‌లో జరిగిన జాతి హింసపై రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ప్యానెల్ దర్యాప్తు చేస్తుందని అమిత్ షా ప్రకటించారు. మణిపూర్‌లో జరిగిన ఘర్షణల నేపథ్యంలో రాష్ర్టంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడం కోసం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా స్వయంగా తానే రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. గత సోమవారం నుంచి హోం మంత్రి మణిపూర్‌ రాష్ట్రంలోనే పర్యటిస్తూ వివిధ సంఘాలతోపాటు.. స్థానిక ప్రజలతో కూడా కేంద్ర హోం మంత్రి సమావేశమయ్యారు. సోమవారం రాత్రి ఇంఫాల్‌కు చేరుకున్న తర్వాత అమిత్‌ షా వివిధ కుకీ మరియు మెయిటీ నాయకులు, ఉన్నత భద్రతా అధికారులు మరియు మణిపూర్ క్యాబినెట్‌తో జాతి హింసకు పరిష్కారం కోసం వరుస సమావేశాలను నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం మంగళవారం సాయంత్రం అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఘర్షణల మూలంగా మోరేన్‌ పట్టణం ఎక్కు్వగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో అమిత్‌ షా బుధవారం మోరేన్‌లో పర్యటించారు. అక్కడ కుకీ పౌర సమాజ నాయకులతో పాటు మెయిటీ నాయకులతోనూ హోం మంత్రి సమావేశం నిర్వహించారు.

మణిపూర్‌లో ఆయుధాలను అప్పగించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు హెచ్చరించారు. రాష్ట్రంలో సుస్థిరతను పునరుద్ధరించే ప్రణాళికలో భాగంగా హింసాకాండపై విచారణ, శాంతి కమిటీని కూడా ఆయన ప్రకటించారు. మణిపూర్‌లో జరిగిన జాతి హింసపై రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ప్యానెల్ దర్యాప్తు చేస్తుందని అమిత్ షా ఈశాన్య రాష్ట్రంలో తన నాలుగు రోజుల పర్యటన సందర్భంగా వరుస సమావేశాల తర్వాత విలేకరుల సమావేశంలో తెలిపారు. గవర్నర్ మరియు భద్రతా సలహాదారు కులదీప్ సింగ్ మరియు సివిల్ సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో శాంతి కమిటీని ఏర్పాటు చేశారు.

హింసకు సంబంధించిన ఆరు కేసులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లేదా సీబీఐ విచారించనుంది. దర్యాప్తు తటస్థంగా ఉంటుందని మరియు హింస వెనుక ఉన్న కారణాల మూలాల్లోకి వెళుతుందని అమిత్‌ షా తెలిపారు. భద్రతా సిబ్బంది నుంచి ఆయుధాలను దోచుకున్న ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి హెచ్చరించారు. ఆయుధాలను అప్పగించకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. హింసలో మరణించిన వారి కుటుంబాలకు మణిపూర్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలిపి రూ. 10 లక్షల పరిహారాన్ని అందజేస్తాయని షా చెప్పారు. నెల గడిచినా పరిస్థితిని అదుపు చేయలేక పోవడంతో ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కుకీ-హ్మార్-జోమీ-మిజో తెగల సభ్యులు బుధవారం నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.

Read Also: Uttarakhand : ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. చిక్కుకుపోయిన 300 మంది పర్యాటకులు

షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మైటేయి కమ్యూనిటీ డిమాండ్‌ను నిరసిస్తూ మే 3న కొండ జిల్లాల్లో ‘గిరిజన సంఘీభావ యాత్ర’ నిర్వహించబడిన తర్వాత జాతి హింస మొదట చెలరేగింది. రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ నుండి కుకి గ్రామస్తులను తొలగించడంపై ఉద్రిక్తతతో హింస ముందుకు సాగింది. అది కాస్త ఆందోళనలకు దారితీసింది. మణిపూర్ జనాభాలో మెయిటీలు దాదాపు 53 శాతం ఉండగా.. ఇంఫాల్ లోయలో ఎక్కువగా నివసిస్తున్నారు. గిరిజనులు, నాగాలు మరియు కుకీలు జనాభాలో మరో 40 శాతం ఉన్నారు మరియు కొండ జిల్లాలలో నివసిస్తున్నారు. మణిపూర్‌ హింసలో ఇప్పటివరకు 80 మందికి పైగా మరణించారని అధికారులు తెలిపారు.

Show comments