Telangana: పంచాయతీరాజ్ శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపులు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బిల్లుల క్లియరెన్స్ ప్రక్రియ దశలవారీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో గురువారం తొలి దశలో ఆర్థిక శాఖ ద్వారా రూ.446 కోట్లను విడుదల చేశారు. ఈ మొత్తంలో నుంచి ఉపాధి హామీ పథకానికి సంబంధించిన బిల్లులకు రూ.300 కోట్లను, పారిశుద్ధ్య కార్మికుల వేతనాల కోసం రూ.146 కోట్లను విడుదల చేశారు.
ఉపాధి హామీ పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు ప్రారంభమవడంతో గ్రామీణ ప్రాంతాల్లో నూతన ఉత్సాహం నెలకొంది. గ్రామాల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల నవంబర్ నెల వేతనాలు ఈ నిధులతో పూర్తిగా చెల్లించబడతాయని ప్రభుత్వం వెల్లడించింది. డిసెంబర్ నెల వేతనాలకు సంబంధించి కూడా త్వరలోనే నిధులను విడుదల చేయనున్నట్లు సమాచారం. అందుబాటులో ఉన్న కుబేర్ సిస్టమ్ ద్వారా కార్మికుల వేతనాలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
గ్రామ పంచాయతీలకు బిల్లుల చెల్లింపులతో పారిశుద్ధ్య కార్మికుల వేతనాల విషయంలో ఉత్కంఠ తొలగిపోనుందని భావిస్తున్నారు. దీంతో సుమారు 95,000 మంది కార్మికుల వేతనాలు త్వరితగతిన జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి రెండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో, ప్రభుత్వ బడ్జెట్ పూర్తిస్థాయిలో వినియోగించేందుకు చర్యలు వేగవంతం చేశారు. బిల్లుల చెల్లింపులు త్వరితగతిన ప్రారంభం కావడంతో సర్పంచ్‌లు, పారిశుద్ధ్య కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వారి ఇబ్బందులను అర్థం చేసుకుని తీసుకున్న ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతమైన పాలనకు మరో అంకురం వేస్తుందని పంచాయతీరాజ్ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 17 మంది మావోల హతం