DK Aruna : ఉమ్మడి పాలమూరు జిల్లాలో విద్యార్థుల వరుస మరణాలు చోటుచేసుకుంటున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె మాట్లాడుతూ, ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయనే విషయంలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రెండు రోజుల కితం షాద్‌నగర్‌లో నీరజ్ అనే విద్యార్థి పాఠశాలపై నుంచి దూకి మృతి చెందగా, తాజాగా బాలానగర్ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఆరాధ్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనలపై స్పందించిన ఎంపీ డీకే అరుణ, సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలను ఆరా తీశారు. ప్రభుత్వ వసతి గృహాల్లో జరుగుతున్న పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అక్కడ విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లు, సమస్యలు వెలుగులోకి రావాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యల వెనుక ఉన్న అసలు కారణాలను నిగ్గు తేల్చేలా సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ ఘటనలపై మరింత ఘాటుగా స్పందించిన డీకే అరుణ, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తోందని మండిపడ్డారు. విద్యా వ్యవస్థలో పర్యవేక్షణ లేకపోవడం, వసతి గృహాల్లో అనేక సమస్యలు ఉండటం, మానసిక ఒత్తిళ్లకు విద్యార్థులు గురవడం వంటి అంశాలను ప్రస్తావించారు. విద్యార్థుల మరణాలకు ప్రభుత్వం నేరుగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఈ ఆత్మహత్యలపై సమగ్ర దర్యాప్తు జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు సరైన మానసిక మద్దతు అందించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని, వసతి గృహాల్లో పర్యవేక్షణను మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల భద్రతను మెరుగుపరిచేందుకు తక్షణమే సమగ్ర ప్రణాళిక అమలు చేయాలని డీకే అరుణ స్పష్టం చేశారు.
ఈ వరుస ఘటనలతో తల్లిదండ్రుల్లో తీవ్ర భయం నెలకొన్నా ప్రభుత్వం ఇంకా గాఢ నిద్రలోనే ఉందని విమర్శించారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని దారుణ ఘటనలు జరిగే ప్రమాదముందని హెచ్చరించారు. పాలమూరు జిల్లాలో విద్యార్థుల ఆత్మహత్యలను నిర్లక్ష్యం చేయకుండా, బాధ్యులను శిక్షించేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని ఎంపీ డీకే అరుణ హెచ్చరించారు.
Komatireddy Venkat Reddy : దేశంలో మొట్ట మొదటి సారి కుల గణన చేసి దేశానికే ఆదర్శంగా నిలిచాం