Site icon NTV Telugu

Niranjan Reddy : పాలమూరు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది..

Singireddy Niranjan Reddy

Singireddy Niranjan Reddy

Niranjan Reddy : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరిని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డిపై ప్రత్యేకంగా మండిపడ్డారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఒక్క అడుగు ముందుకు వేయకపోవడం మాతృద్రోహం కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఏడాదిన్నర కాలంగా తట్టెడు మన్ను కూడా ఎత్తని ప్రభుత్వం ప్రాజెక్టుపై ప్రాధాన్యం లేకుండా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

AP Crime: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..! అన్నయ్య అంటూ పరిచయం చేసి..!

ప్యాకేజీ 3లో కేవలం 8 కిలోమీటర్ల కాలువ మాత్రమే మిగిలి ఉండగా, దానికి సంబంధించిన కాంట్రాక్ట్‌ను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ నేతకు అప్పగించడం అనుమానాస్పదమని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఆ కాంట్రాక్టును ప్రారంభించకపోవడానికి అక్కడి రాజకీయ నాయకుల ఒత్తిడి ఉందేమో అనిపిస్తోందని అన్నారు. ప్రాజెక్టు కోసం 27,000 ఎకరాల భూసేకరణ జరగగా, కేవలం 100 ఎకరాలు మాత్రమే మిగిలివున్నాయని తెలిపారు. ప్రజలకు పాలమూరు ప్రయోజనాలు త్వరగా అందకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పనులను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. డిండి పనులను హడావిడిగా ప్రారంభించడం అనవసరం. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టును నీటి పారుదల శాఖ మంత్రి ఎందుకు సమీక్షించడం లేదని నిలదీశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్‌ నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టాల్సిన సమయంలో, జూరాల నుంచి కొడంగల్ ఎత్తిపోతల చేపట్టడం అనేది కక్షసాధింపు చర్య అని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం జూరాలలో నీరు వదులుకోవడం వల్ల ప్రాజెక్టు డిజైన్ ప్రమాదంలో పడుతుందని, అల్మట్టిలో నీళ్లు నిలుపుకునే అవకాశం తక్కువ అని అన్నారు.

HYDRA Police Station : హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

ప్రాజెక్టుపై ఇప్పటివరకు రూ.32 వేల కోట్ల వ్యయం జరిగిందని, 90 శాతం పనులు పూర్తయ్యాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అంగీకరించారని గుర్తు చేశారు. జరిగిన పనులకు అభినందనలు చెప్పే ముందు, మిగిలిన వాటిని పూర్తిచేసి ప్రజలకు ఫలితాలు అందించాలంటూ డిమాండ్ చేశారు. సాగునీళ్లు ఇవ్వడం లేదు, పంటలు కొనడం లేదు. రైతులకు బోనస్ ఇవ్వలేదు. రుణమాఫీ సగం కూడా కాలేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రూ.లక్షా 70 వేల కోట్ల అప్పులు చేసిన ఈ ప్రభుత్వం ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడడం ఆక్షేపణీయమైనదని నిరంజన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. మూసీ ప్రాజెక్టు, హైడ్రా వంటి మంచి అవకాశాలను ధ్వంసం చేశారు. అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు అని ఆయన విమర్శలు గుప్పించారు.

Exit mobile version