NTV Telugu Site icon

ENG vs PAK: మూడో టెస్టులో ఇంగ్లండ్‌ పై పాకిస్థాన్ విజయం.. సిరీస్ కైవసం

Pak Vs Eng

Pak Vs Eng

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో.. షాన్ మసూద్ సారథ్యంలో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ టెస్ట్ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలుపొందగా.. ఆ తర్వాత వరుసగా రెండు టెస్టు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ విజయం సాధించింది.

ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్ట్ తర్వాత.. పాకిస్తాన్ జట్టులో భారీ మార్పులు చేసింది. ఈ క్రమంలో.. రెండు, మూడో టెస్టుల్లో జట్టులో చేరిన సాజిద్ ఖాన్, నోమన్ అలీ, కమ్రాన్ గులాం అద్భుతమైన ప్రదర్శన చేశారు. మూడో టెస్ట్ మ్యాచ్‌లో నోమన్, సాజిద్ ఇద్దరూ మంచి ప్రదర్శన కనబరిచారు. సాజిద్ మూడో మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ టెస్ట్ సిరీస్‌లో పాకిస్థాన్ విజయానికి హీరోగా నిలిచాడు. దీంతో.. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.

Read Also: Satish Kumar Reddy: చెల్లి కోసం జగన్ సొంత ఆస్తుల్లో కూడా వాటా ఇచ్చారు..

ఇంగ్లండ్‌పై నోమన్ అలీ 2 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీయగా.. సాజిద్ ఖాన్ కూడా 2 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టాడు.. అంతేకాకుండా, జట్టు తరఫున పరుగులు కూడా చేశాడు. దీంతో అతను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో బాబర్ అజామ్ స్థానంలో వచ్చిన కమ్రాన్ గులామ్ కూడా ఆకట్టుకున్నాడు. రెండవ టెస్ట్‌లో జట్టుకు అద్భుత సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. షాన్ మసూద్ కెప్టెన్సీలో ఈ ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా మూడేళ్ల తర్వాత స్వదేశంలో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది.

ఈ టెస్టు సిరీస్‌లో పూర్తిగా స్పిన్నర్ల ప్రదర్శన కనపడింది. ఈ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇరు జట్ల స్పిన్నర్లు కలిసి మొత్తం 73 వికెట్లు తీశారు. పాకిస్థాన్‌లో ఒకే టెస్టు సిరీస్‌లో స్పిన్నర్లు తీసిన అత్యధిక వికెట్లు ఇదే. గతంలో 1969-70లో పాకిస్థాన్-న్యూజిలాండ్ మ్యాచ్‌లో స్పిన్నర్లు మొత్తం 71 వికెట్లు పడగొట్టగా, ఈసారి స్పిన్నర్లు 73 వికెట్లు తీశారు.