Asim Iftikhar Ahmed: ఉగ్రవాదంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో పాకిస్థాన్ శాశ్వత ప్రతినిధి అసిం ఇఫ్తికార్ అహ్మద్ చేసిన ప్రకటన అంతర్జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో ఒక్క ముస్లిమేతర వ్యక్తి పేరు కూడా లేకపోవడం పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుందని ఆయన అన్నారు. ముస్లింలను ఏకపక్షంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని, ప్రపంచవ్యాప్తంగా ముస్లిమేతర తీవ్రవాదులు ఉగ్రవాదం, మౌలికవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని అన్నారు. కానీ వారిని ఉగ్రవాదులుగా గుర్తించడాన్ని విస్మరిస్తున్నారని సంచలన వ్యాక్యలు చేశారు. ఇది నిజమైన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని బలహీనపరుస్తుందని అన్నారు.
READ ALSO: Kukatpally Sahasra Case : కూకట్ పల్లి బాలిక సహస్ర హత్య కేసును ఛేదించిన పోలీసులు
తీవ్రవాదం వైపు యువత ఆకర్షితులవుతున్నారు..
ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో చురుగ్గా మారాయని అసిం ఇఫ్తికార్ అహ్మద్ హెచ్చరించారు. అంతర్జాతీయ చట్టం, మానవ హక్కుల సూత్రాలకు అనుగుణంగా ఉగ్రవాద వ్యతిరేక విధానాలు ఉండాలని, తద్వారా అవి సానుకూల ప్రభావాలను చూపుతాయని అన్నారు. సోషల్ మీడియా, ఆధునిక సాంకేతికత ద్వారా యువత తీవ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. ప్రస్తుతం పాకిస్థాన్ తీవ్రమైన ముప్పులను ఎదుర్కొంటోందని చెప్పారు. టిటిపి, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, మజీద్ బ్రిగేడ్ ఆఫ్ఘనిస్థాన్ నుంచి మద్దతు పొందుతున్నాయని అన్నారు. ఈ ఉగ్రసంస్థలు పాకిస్థాన్ జాతీయ భద్రత, ప్రాంతీయ శాంతికి ప్రత్యక్ష సవాలుగా మారాయన్నారు. ఐసిస్ ఖొరాసాన్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ సంస్థ ఇప్పటికీ ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్థాన్‌లలో వేలాది మంది యోధులతో చురుకుగా పనిచేస్తుందని తెలిపారు.
భారత్‌కు వ్యతిరేకంగా ప్రకటన..
ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ రాయబారి భారతదేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం మానుకోలేదు. భారతదేశం పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే కాకుండా ప్రపంచంలో పాకిస్థాన్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. ఉగ్రవాదంపై పోరాటం న్యాయంతో జరిగినప్పుడే ప్రపంచంలో శాంతి నెలకొంటుందని ఆయన అన్నారు.
READ ALSO: Maoists kill villager: మావోల ఘాతుకం.. జాతీయ జెండాను ఎగురవేసినందుకేనా..