Pakistan Security Crisis: ఈ ఏడాది పాకిస్థాన్ మూడు వైపుల నుంచి దాడులను ఎదుర్కొంటోంది. వాస్తవానికి పాకిస్థాన్ తన స్వయం కృత చర్యల కారణంగా మూడు వైపుల నుంచి యుద్ధం పరిస్థితులను సృష్టించుకుందని నిపుణులు చెబుతున్నారు. పాకిస్థాన్ తూర్పు వైపులో భారతదేశంతో ఉద్రిక్తతలను ఎదుర్కొంటోంది. అదే సమయంలో పశ్చిమ సరిహద్దులో ఆఫ్ఘన్ తాలిబన్లతో తీవ్ర ఘర్షణ చెలరేగుతోంది. ఇప్పటికే తాలిబన్లు డజన్ల కొద్దీ పాకిస్థాన్ సైనికులను చంపి, అనేక పోస్టులను స్వాధీనం చేసుకున్నారు. ఇంకో వైపున నైరుతిలోని బలూచిస్థాన్‌లో తిరుగుబాటుదారులను అణిచివేయడానికి దాయాది సైన్యం నానా అవస్థలు పడాల్సి వస్తుంది. అసలు పాకిస్థాన్‌లో ఏం జరుగుతుంది..
గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో రెండవ స్థానంలో పాక్..
పాకిస్థాన్ ఇన్స్టి ట్యూట్ ఫర్ కాన్స్టిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ (PICSS) ప్రకారం.. 2025 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన హింసాత్మక సంఘటనల సంఖ్య 2024 మొత్తం ఏడాదిలో జరిగిన వాటితో సమానం అని వెల్లడించాయి. కేవలం జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలోనే పాక్‌లో 500 కంటే ఎక్కువ దాడులు జరిగాయని, వీటిలో వందలాది మరణాలు నమోదయ్యాయని నివేదికలు పేర్కొన్నాయి. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో పాకిస్థాన్ రెండవ స్థానానికి చేరుకుంది. పాకిస్థాన్ ప్రస్తుతం ముక్కోణపు ఘర్షణలో చిక్కుకుందని, ఇది దాయాది భద్రతా విధానాన్ని కుదిపేయడమే కాకుండా, ఆ దేశ అంతర్గత రాజకీయ సమతుల్యతను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోందని చెబుతున్నారు.
పాక్‌కు తాలిబన్లతో వైరం..
ఆగస్టు 2021లో ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాకిస్థాన్ తన “వ్యూహాత్మక లోతు” సిద్ధాంతాన్ని బలోపేతం చేయాలని ఆశించింది. ఆఫ్ఘన్లో తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నప్పుడు దాయాది దేశం తాలిబన్ల రాకను కూడా స్వాగతించింది. ఆ సమయంలో ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అధికారాన్ని స్థాపించడానికి తమ దేశం సహాయం చేసిన ముజాహిదీన్ ఇప్పుడు అక్కడ అధికారంలో ఉందని పాక్ భావించింది. కానీ ప్రస్తుత పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది. పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దును గుర్తించే డ్యూరాండ్ లైన్‌ను కూడా తాలిబన్లు గుర్తించడం లేదు. అమెరికాలో 2021లో పాకిస్థాన్ మాజీ రాయబారి హుస్సేన్ హక్కానీ మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఆశించినది సాధించిందని, కానీ తరువాత దానికి చింతిస్తుందని అన్నారు. ఆఫ్ఘన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడం వల్ల పాకిస్థాన్‌లో అంతర్గత హింస మరింత పెరుగుతుందని ఆయన అప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు నిజమైనట్లు కనిపిస్తున్నాయి. ఇటీవల రోజుల్లో తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్‌కు ఒక ముల్లుగా మారిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
“ఆఫ్ఘనిస్థాన్‌తో యుద్ధం పాక్ ప్రజలకు ప్రయోజనం కలిగించదు. యుద్ధం ఎప్పటికీ ప్రయోజనం కాదు. ఆఫ్ఘన్లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి రావడాన్ని ప్రోత్సహించడం తప్పు, ఇప్పుడు వారితో పూర్తిగా యుద్ధానికి వెళ్లడం పెద్ద తప్పు” అని హుస్సేన్ హక్కానీ చెబుతున్నారు. భద్రతా నిపుణుడు, దక్షిణాసియా రాజకీయ పరిశీలకుడు మైఖేల్ కుగెల్మాన్ మాట్లాడుతూ.. ఆఫ్ఘన్ -పాక్ సరిహద్దు సంక్షోభం, సంవత్సరాలలో అత్యంత దారుణమైనదిగా పేర్కొన్నారు. ఇది రెండు ప్రాథమిక సత్యాల ఫలితమని ఆయన చెప్పారు.
పాక్‌ను కలవరపాటుకు గురిచేసిన తాలిబన్లు..
పాకిస్థాన్.. ఆఫ్ఘన్ యుద్ధం ముగిసినప్పటి నుంచి తాలిబన్లపై ప్రభావాన్ని కోల్పోయింది. వాస్తవానికి తాలిబన్లకు కూడా ఇకపై పాక్ మద్దతు అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. పాకిస్థాన్ ప్రభుత్వంపై తాలిబన్ల ఆరోపణ ఏమిటంటే.. పాక్ ఆఫ్ఘనిస్థాన్ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అంగీకరించడం లేదని చెబుతున్నారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. తాజాగా ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి, తాలిబన్ నాయకుడు అమీర్ ఖాన్ ముత్తాకి భారతదేశాన్ని సందర్శించారు. ఈ పరిణామం తాలిబన్ల విషయంలో పాకిస్థాన్‌ను మరింత కలవర పెట్టిందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పాక్ – ఆఫ్ఘన్ సైన్యాల మధ్య రక్తపాత ఘర్షణ చెలరేగింది. అక్టోబర్ 9న ప్రారంభమైన ఈ ఘర్షణలో పాక్ వైమానిక దళం కాబూల్‌పై వైమానిక దాడులు ప్రారంభించిందని, దీనితో తాలిబన్లు డ్యూరాండ్ లైన్‌పై కాల్పులు జరిపారని నివేదికలు పేర్కొన్నాయి. అక్టోబర్ 11, 12 తేదీలలో అంగూర్ అడ్డా, బజౌర్, కుర్రం, దిర్, చిత్రాల్ (ఖైబర్ పుంఖ్వా), బారంచా ( బలూచిస్థాన్ )లలో భారీ ఘర్షణలు చెలరేగాయి. ఈ దాడిలో సుమారు 200 మంది తాలిబన్లు మరణించారని పాక్ చెబుతుండగా, 58 మంది పాకిస్థాన్ సైనికులను చంపినట్లు తాలిబన్లు చెబుతున్నారు. కానీ పాక్ సైన్యం చనిపోయిన వారి సైనికుల సంఖ్యను 23గా చెబుతోంది.
పాక్‌ను ముల్లులా పొడుస్తున్న బలూచ్ తిరుగుబాటుదారులు..
నైరుతి పాకిస్థాన్‌లో దాయాది ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు బలూచ్ తిరుగుబాటుదారులు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) వంటి గ్రూపులు బలూచిస్థాన్ విలువైన ఖనిజ వనరులను దుర్వినియోగం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బలూచిస్థాన్‌లోని అరుదైన మట్టి పదార్థాలను అమెరికాకు విక్రయించడానికి పాకిస్థాన్ ప్రభుత్వం తాజాగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బలూచ్ తిరుగుబాటుదారులు తరచుగా పాకిస్తాన్ సైన్యంపై దాడి చేస్తున్నారు. ఫిబ్రవరి 2025లో గ్వాదర్ పోర్ట్ సమీపంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో నలుగురు చైనా ఇంజినీర్లు మరణించారు. ఇది CPEC (చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్) పై జరిగిన ప్రత్యక్ష దాడి. సెప్టెంబర్ 2025లో క్వెట్టాలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 10 మంది మరణించారు. మార్చి 2025లో BLA జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలును హైజాక్ చేసింది.
ఇటీవల ఆపరేషన్ సింధూర్‌లో భారతదేశం తొమ్మిది జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా (LeT) లక్ష్యాలపై క్షిపణి దాడులు చేసింది. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ వైమానిక, డ్రోన్, సైబర్ యుద్ధంలో భారతదేశం పదికి పైగా పాకిస్థానీ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. అలాగే అనేక పాకిస్థానీ విమానాలను కూల్చివేసింది. ఇదే సమయంలో భారతదేశం-పాక్‌తో సిమ్లా ఒప్పందాన్ని కూడా రద్దు చేసి, సింధు జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టింది. ఇకపై ఏ ఉగ్రవాద చర్యనైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని, దానికి తగిన విధంగా ప్రతిస్పందిస్తుందని పాక్‌కు భారత్ స్పష్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ మూగిసిన వెంటనే ఈ రెండు యుద్ధాలు పాక్ నెత్తిన పిడులా పడ్డాయి. ప్రస్తుతం పాకిస్థాన్ దిక్కుతోచని స్థితిలో ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
READ ALSO: World Cup 2027: రోహిత్, విరాట్ మాత్రమే కాదు.. మరో ముగ్గురు కూడా ప్రపంచకప్‌లో ఆడడం డౌటే?