Site icon NTV Telugu

Khyber Pakhtunkhwa: పాక్ చేతుల్లొంచి జారిపోతున్న ఖైబర్ పఖ్తుంఖ్వా ? .. దాయాది దేశంలో ఏం జరుగుతుంది!

Terrorism In Pakistan

Terrorism In Pakistan

Khyber Pakhtunkhwa: ప్రపంచంపై ఉగ్రవాదాన్ని ఎగదోసిన పాపం ఇప్పుడు పాకిస్థాన్‌ను పట్టిపీడుస్తుంది. ఇటీవల కాలంలో దాయాది దేశంలోనే అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముందుగా పాక్-భారత్ ఘర్షణలు, తర్వాత దాయాది దేశంలో పర్యావరణ ప్రకోపం, ఆ తర్వాత ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్‌తో సంఘర్షణలు. ఇవన్నీ పాకిస్థాన్ చేసుకున్న స్వయంకృత పాపాలే. తాజాగా పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాపై దాయాది దేశం పట్టుకోల్పోతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంతకీ పాకిస్థాన్‌లో ఏం జరుగుతుంది..

READ ALSO: DYCM Pawan Kalyan: అటవీశాఖ అధికారులను వేధిస్తే తీవ్రమైన పరిణామాలు తప్పవు

టీటీపీ ఆధీనంలోకి ఖైబర్ పఖ్తుంఖ్వా ..
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా (KPK) ప్రాంతంపై క్రమంగా దాయాది పట్టు కోల్పోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న ఖైబర్ పఖ్తున్ఖ్వా (KPK) ప్రాంతంలోని అనేక జిల్లాల్లో తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP), దాని అనుబంధ ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు బలమైన పట్టును ఏర్పరచుకున్నాయి. వాస్తవానికి ఇప్పుడు ఈ ప్రాంతంలో టీటీపీ చర్యలను అడ్డుకోవడం పాకిస్థాన్ సైన్యానికి అసాధ్యంగా మారింది. నిఘా వర్గాల కథనం ప్రకారం TTP డ్యూరాండ్ రేఖ వెంబడి పెద్ద ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది.

ఖైబర్, కుర్రం, ఉత్తర, దక్షిణ వజీరిస్తాన్, బజౌర్ వంటి ప్రాంతాలు ప్రస్తుతం పాకిస్థాన్ సైన్యానికి నిషేధిత ప్రాంతాలుగా మారాయి. ఈ ప్రాంతాలలో TTP బహిరంగంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిందని, ఈ ప్రాంతాల్లో టీటీపీ యోధులు వాహనాలను తనిఖీ చేస్తున్నారని, ప్రజల గుర్తింపు కార్డులను ధృవీకరిస్తున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. పెషావర్-ఖైబర్ రోడ్, హంగూర్-ఖుర్రం కారిడార్, బన్ను-దేరా ఇస్మాయిల్ ఖాన్ వంటి మార్గాల్లో, వీళ్లు జిహాద్ పేరుతో డబ్బును కూడా వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. వీళ్లు ఆయుధాలు, వీధుల్లో గస్తీ తిరుగుతున్నట్లు చూపించే వీడియోలను స్వయంగా ఉగ్రవాదులు విడుదల చేశారు.

2021లో ఆఫ్ఘనిస్థాన్ ఇలా ఉండేది..
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో పరిస్థితి 2021కి ముందు ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు చేసినట్లే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అచ్చం ఇదేవిధంగా TTP గ్రామీణ ప్రాంతాలను ఆక్రమించుకుని క్రమంగా పట్టణ ప్రాంతాలకు విస్తరిస్తోందని అంటున్నారు. ఈ ప్రాంతాల్లో సంభవిస్తున్న మరణాల సంఖ్య, పెరుగుతున్న గిరిజన జనాభా క్రమంగా TTP వైపు మొగ్గు చూపడం వల్ల పాకిస్థాన్ సైనిక సిబ్బంది ఇప్పుడు ఈ జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో కార్యకలాపాలు నిర్వహించడానికి వెనుకాడుతున్నారని పలు వర్గాలు సూచిస్తున్నాయి. పంజాబీ మూలాలకు చెందిన చాలా మంది సైనికులు ఈ సున్నితమైన ప్రాంతాలలో గస్తీ కాయడానికి నిరాకరించారని, దీనితో సైన్యం రక్షణాత్మక వైఖరిని అవలంబించాల్సి వచ్చిందని పలు నివేదికలు స్పష్టం చేశాయి.

దాయాదికి బహిరంగ సవాల్
TTP తీసుకున్న ఈ చర్య పాకిస్థాన్ ప్రభుత్వానికి, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు బహిరంగ సవాలు లాంటిదని నిపుణులు చెబుతున్నారు. TTP ఇప్పుడు దాని సాంప్రదాయ పర్వత, గ్రామీణ ప్రాంతాల నుంచి పెషావర్ శివార్లకు తన స్థావరాన్ని విస్తరిస్తోందని నిఘా సంస్థలు హెచ్చరించాయి. బడాబెర్, మట్టాని, బారా రోడ్ ప్రాంతాలలో TTP నెట్‌వర్క్‌లు చురుకుగా ఉన్నాయని పలు నివేదికలు వెల్లడించాయి. ఇక్కడి నుంచి, వీళ్లు నిధులను సేకరించడం, ఆయుధాలను నిల్వ చేయడం, కొత్త నియామక డ్రైవ్‌లను చేపట్టడం వంటివి చేస్తున్నారు. ఈ పరిస్థితి పాకిస్థాన్ పట్టణ భద్రతా వ్యవస్థకు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తుందని ఆ దేశ భద్రతా సంస్థలు చెబుతున్నాయి. పోలీసు చెక్‌పోస్టుల తొలగింపు ఖైబర్-మహమ్మద్ బెల్ట్‌లో TTP సమాంతర పరిపాలనా నిర్మాణాన్ని ఏర్పాటు చేయడానికి కలిసి వచ్చిందని అంటున్నారు.

పలు నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. ఇటీవల కాలంలో పాకిస్థాన్ అత్యంత తీవ్రమైన అంతర్గత భద్రతా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఉగ్రవాదులు బహిరంగంగా ఆయుధాలు ప్రదర్శిస్తూ, నృత్యాలు చేస్తూ, వీధుల్లో నిధుల సేకరణ చేస్తూ దాయాది దేశం తన భూభాగంలోని వాయువ్య ప్రాంతంపై నియంత్రణ కోల్పోతుందనే కఠినమైన వాస్తవాన్ని బహిర్గతం చేస్తున్నారని వెల్లడించారు.

READ ALSO: Palestine President: పాలస్తీనా అధ్యక్షుడి విషయంలో కొత్త బాంబ్ పేల్చిన డోనాల్డ్ ట్రంప్.. పాపం అబ్బాస్‌!

Exit mobile version