PML-N alliance talks with PPP in Pakistan Elections 2024: పాకిస్థాన్ ప్రజలు ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోవడంతో.. అక్కడ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ, మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అండతో పీఎంఎల్-ఎన్ ప్రభుత్వ ఏర్పాటు దిశగా సాగుతోందని తెలుస్తోంది.
పీపీపీ ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ, అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీతో పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ ఆదివారం జరిపిన చర్చలు దాదాపుగా సఫలం అయ్యాయట. ఈ విషయాన్ని పీఎంఎల్-ఎన్ ఓ ప్రకటనలో తెలిపింది. రాజకీయ అనిశ్చితి నుంచి పాకిస్థాన్‌ను రక్షించేందుకు ఇరు పార్టీల మధ్య సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిందని పేర్కొంది. త్వరలో జరగబోయే సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పీపీపీ నాయకత్వం, వారి ప్రతిపాదనలను తమ ముందు ఉంచుతుందని తెలిపింది. ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు తమ పక్షానే ఉన్నారని చెప్పుకొచ్చింది. మరోవైపు పీఎంఎల్-ఎన్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించినట్లు పీపీపీ కూడా ధ్రువీకరించింది.
Also Read: Texas Megachurch: టెక్సాస్ మెగాచర్చిలో కాల్పులు.. మహిళను కాల్చి చంపిన పోలీసులు!
తుది ఫలితాలను ఆదివారం పాకిస్థాన్ ఎన్నికల సంఘం విడుదల చేసింది. 265 జాతీయ అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పీటీఐకి 101 స్థానాలు దక్కాయి. నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్‌కు 75 సీట్లు దక్కాయి. పీపీపీకి 54 సీట్లు, ఎంక్యూఎం-పీకు 17 సీట్లు వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 133 సీట్లు అవసరం. దాంతో పీఎంఎల్-ఎన్ అధికారంలోకి రావాలంటే పీపీపీ మద్దతు తప్పనిసరి. పీఎంఎల్-ఎన్, పీపీపీ పార్టీలు కలిస్తే 129 సీట్లు అవుతాయి. 17 సీట్లు నెగ్గిన ఎంక్యూఎం-పీతోనూ నవాజ్ షరీఫ్ చర్చలు జరుపుతున్నారు. ఈ మూడు పార్టీలు కలిస్తే అధికారం సొంతమవుతుంది. అయితే ఈ పొత్తుకు ఇంకా ఎంక్యూఎం-పీ పచ్చజెండా ఊపలేదు.