NTV Telugu Site icon

Assam Floods: వరదలతో అస్సాం విలవిల.. 30 మందికి పైగా మృతి

Assam

Assam

Assam Floods: అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అస్సాంలో తీవ్రమైన వరదల కారణంగా ఇప్పటివరకు 30 మందికి పైగా మరణించారు. 15 జిల్లాల్లో 1.61 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. కరీంగంజ్ జిల్లాలోని బదర్‌పూర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఒక మహిళ, ఆమె ముగ్గురు కుమార్తెలు, అలాగే మూడేళ్ల బాలుడు సహా ఐదుగురు వ్యక్తులు మరణించారు. గైనచోర గ్రామంలో మంగళవారం రాత్రి కొండచరియలు విరిగిపడ్డాయి. అస్సాంలో మేలో రెమాల్ తుఫాను వల్ల కొండచరియలు విరిగిపడ పలువురు మరణించగా.. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 30కి చేరుకుంది.

Read Also: Canada: మరోసారి కవ్వింపు చర్యలు.. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ కు కెనడా పార్లమెంట్ నివాళి

“గత రాత్రి 12.45 గంటలకు, బదర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గైనచోరా (బెందర్‌గూల్) గ్రామ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడినట్లు సమాచారం అందింది. సమాచారం అందుకున్న బదర్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారి, సిబ్బంది, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మూడు గంటల తర్వాత రెస్క్యూ టీమ్ శిథిలాల నుంచి ఐదు మృతదేహాలను వెలికితీసింది” అని కరీంగంజ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పార్థ ప్రోతిమ్ దాస్ తెలిపారు. మృతులను రోయ్మున్ నెస్సా (55), ఆమె కుమార్తెలు సాహిదా ఖానం (18), జాహిదా ఖానం (16), హమిదా ఖానం (11)గా గుర్తించారు. మూడేళ్ల బాలుడిని మహిముద్దీన్ కుమారుడు మెహదీ హసన్‌గా గుర్తించారు.

అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ASDMA) ప్రకారం, కరీంగంజ్ అత్యంత ప్రభావితమైన జిల్లా. 1,52,133 మంది వరదనీటిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విపత్తు వల్ల 1,378.64 హెక్టార్ల మొత్తం పంట విస్తీర్ణం, 54,877 జంతువులను ప్రభావితం చేసింది. ప్రస్తుతం 24 రెవెన్యూ సర్కిళ్లలో 470 గ్రామాలు నీట మునిగాయి. 43 సహాయ శిబిరాల్లో 5,114 మంది ఆశ్రయం పొందడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏదేమైనప్పటికీ, కట్టలు, రోడ్లు, వంతెనలతో సహా మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లినందున సహాయం అందించడంతో ఇబ్బంది కలుగుతోంది. కంపూర్ వద్ద కోపిలి నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నందున మరింత ఉప్పొంగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రభావిత జిల్లాల్లో బిస్వనాథ్, లఖింపూర్, హోజాయ్, బొంగైగావ్, నల్బరీ, తముల్‌పూర్, ఉదల్‌గురి, దర్రాంగ్, ధేమాజీ, హైలాకండి, కరీంనగర్, గోల్‌పరా, నాగావ్, చిరాంగ్ మరియు కోక్రాఝర్ ఉన్నాయి.