OTR: కర్నూలు జిల్లా టీడీపీ లీకులతో షేకవుతోందా? ఏకంగా జిల్లా పార్టీ అధ్యక్షురాలి కుర్చీకే ముప్పు ముంచుకొస్తోందా? ఆమె మీద సొంత ఎమ్మెల్యేలే ఫైరైపోతున్నారా? అసలేం జరిగింది కర్నూలు టీడీపీలో..? ఎమ్మెల్యేలకు, పార్టీ అధ్యక్షురాలికి మధ్య ఏం జరిగింది? కర్నూలు జిల్లా టీడీపీ నిత్యం వార్తల్లో ఉంటుంది. అది పాజిటివ్‌గా ఉంటే పార్టీకి లాభమే గానీ… ఆ ఒక్కటి తప్ప అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. ఎప్పుడూ ఏదో ఒక రచ్చ సర్వ సాధారణమైపోయిందని జిల్లా పార్టీ వర్గాలే అంటుంటాయి. దశాబ్దాలుగా ఇదే పరిస్థితి ఉండటంతో ప్రతి ఎన్నికలో అత్తెసరు సీట్లే వచ్చేవి. కానీ… 2024లో మాత్రం ఆ పరంపర ఆగిపోయిందా అన్నట్టు ఉమ్మడి జిల్లాలో11 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లలో పసుపు జెండా రెపరెపలాడింది. అయినాసరే… జిల్లా నేతల్లో మార్పు రాలేదట. వచ్చిన ఊపును నిలబెట్టుకునే ప్రయత్నం జరగడంలేదని అంటున్నారు. తాజాగా జిల్లా పార్టీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఎమ్మెల్యేల తీరుపై అధిష్టానానికి పంపినట్లుగా చెప్పుకుంటున్న నివేదిక లీకై ప్రకంపనలు రేపుతోంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి జిల్లా అధ్యక్షులు స్థానిక పరిస్థితులపై అధిష్టానానికి నివేదిక పంపడం కామన్.
కానీ… ఈసారి రిపోర్ట్‌లో ఉన్న అంశాలు లీకై జిల్లాలో సైకిల్ షేకవుతోందట. విభజిత కర్నూలు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 5చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు వున్నారు. అయితే… అందరి మీదా… జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ నెగెటివ్ రిపోర్ట్ ఇచ్చారని, అందులోని అంశాలు మొత్తం లీకవడమే తాజా సమస్యకు కారణం అని చెప్పుకుంటున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలైతే…ఈ నివేదికపై కృష్ణమ్మను డైరెక్ట్‌గానే ప్రశ్నించారట. తాను పంపలేదని ఆమె చెప్పినప్పటికీ… తేదీ, లేఖ నంబర్, ఇతర ఆధారాలు చూపించి మరీ నిలదీసినట్టు సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్‌ను అడ్రస్ చేస్తూ రిపోర్ట్ పంపారట కృష్ణమ్మ. స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇన్ఛార్జ్‌లు సొంత అజెండా అమలు చేస్తున్నారని, తమ వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తూ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలను పూర్తిగా విస్మరిస్తున్నారని రాసినట్టు తెలిసింది. మండల నాయకులతో సమన్వయం లేదని, పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా, పార్టీ మార్చిన వారికి పదవులు ఇప్పించుకుంటున్నారని రిపోర్ట్ చేశారని అంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలు పూర్తిగా వన్ సైడ్ ఉన్నారని, ఫలితంగా సీనియర్లు పార్టీకి దూరమయ్యారని, పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళను సైతం దగ్గరకు రానివ్వడం లేదని నివేదిక ఇచ్చినట్టు చెబుతున్నారు.
నేతల మధ్య గ్రూపు రాజకీయాలు పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని, కూటమి పార్టీలతో సమన్వయం లేదని కూడా తేల్చేశారట కృష్ణమ్మ. టీడీపీ ఎమ్మెల్యే లేని నియోజకవర్గంలో కేడర్‌కు ఏమాత్రం ప్రాధాన్యత లేకపోవడంతో నిరాశ నిస్పృహ లో ఉన్నారని పేర్కొన్నట్టు తెలిసింది. ఆ రకంగా ఆమె అధిష్టానానికి పంపిన నివేదిక చూస్తే… కర్నూలు జిల్లాలో టీడీపీ పరిస్థితి అంత దారుణంగా ఉందా అని పార్టీ పెద్దలే విస్తుపోయేలా ఉందని అంటున్నారు. ఓవరాల్ గా ఎమ్మెల్యేల తీరు వరస్ట్‌గా ఉందన్నది జిల్లా పార్టీ అధ్యక్షురాలు చెప్పకనే చెప్పేసిన మాట. ఆ నివేదిక లీక్ అయి కొందరిలో ఆగ్రహం కలిగిస్తే… మరికొందరు పార్టీ లీడర్స్ మాత్రం వాస్తమే కదా అని అంటున్నట్టు తెలిసింది. ఇందులో కొన్ని నిజాలు ఉన్నాయి కదా అని క్యాడర్ సైతం చర్చించుకుంటోందని అంటున్నారు. అయితే… పార్టీ అధిష్టానానికి ఇంటర్నల్‌గా పంపిన ఆ రిపోర్ట్ బయటికి ఎలా వచ్చిందన్నది ఇక్కడ బిగ్ క్వశ్చన్.
ఆ లీక్ తర్వాత సుమారు 40 ఏళ్ల నుంచి నమ్మకంగా ఉన్న కార్యాలయ ఉద్యోగి పక్కన పెట్టారు. కానీ… ఎంతో నమ్మకంగా పనిచేసే ఆ మేనేజర్ ట్రాక్ రికార్డు, నిజాయితీని గుర్తించి స్థానిక నేతలు, అధిష్టానం జోక్యంతో తిరిగి విధుల్లోకి తీసుకున్నారట. ఆఫీస్ ఉద్యోగి ప్రమేయం లేకుండానే ఆ నివేదికను ఫోటోలు తీసి బయటికి పంపారన్న ప్రధానంగా వస్తున్న అనుమానం. అయితే… జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ పై కోపంతో అలా చేశారా..? లేక ఎమ్మెల్యేలను గబ్బులేపాలని బయటపెట్టారా అంటూ పార్టీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మొత్తమ్మీద కర్నూలు జిల్లా టీడీపీలో కృష్ణమ్మ రిపోర్ట్ కాక రేపింది. అయితే… లీక్‌పై జిల్లా అధ్యక్షురాలు గానీ, ఎమ్మెల్యేలు గానీ పెదవి విప్పకపోవడంతో నివేదిక పంపింది నిజమేనని భావిస్తున్నారు అంతా. నివేదిక నిజమేగానీ… అందులో అంశాలు నిజమో కాదో మాకు తెలియదు… మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి రావుగారూ… అంటూ సెటైర్లు వేసుకుంటున్నారు కర్నూల్ తమ్ముళ్ళు.

