OTR: అక్కడ ఫ్యాన్ పార్టీకి వెన్నుపోట్లు గట్టిగా పడ్డాయా? ప్రతిష్టాత్మకంగా భావించిన మున్సిపల్ కార్పొరేషన్లో సొంతోళ్ళే దెబ్బేశారా? కార్పొరేటర్ అభ్యర్థుల నామినేషన్స్ ఉపసంహరణ వెనక భారీ ఎత్తున డబ్బు చేతులు మారిందా? కీలకమైన పదవిలో ఉన్న వైసీపీ నాయకుడే తెర వెనక డ్రామా నడిపి రాజకీయ ప్రత్యర్థులకు సహకరించారన్న ఆరోపణల్లో నిజమెంత? ఎక్కడ జరిగిందా వెన్నుపోటు వ్యవహారం? ఆరోపణలపై అధిష్టానం ఎందుకు మౌనంగా ఉంటోంది?
రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపిక నుంచి నామినేషన్ల ఉపసంహరణ వరకు చాలా నాటకీయ పరిణామాలు జరిగాయి. పార్టీ తరపున పోటీకి ఉత్సాహం చూపి బీ ఫామ్స్ తెచ్చుకోవడం, ప్రచారానికి సిద్ధమవుతున్న సమయంలో అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకోవడం లాంటి చర్యల వెనక భారీ ఎత్తున డబ్బు చేతులు మారిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
ప్రత్యేకించి 33వ డివిజన్లో టీడీపీ అభ్యర్థి నల్లం జ్యోతి స్వరూప ఏకగ్రీవానికి వైసీపీ నేతలు సహకరించారన్నది ప్రధాన ఆరోపణ. వైసీపీ అభ్యర్థి పది లక్షల రూపాయలు తీసుకుని నామినేషన్ ఉపసంహరించుకున్నారంటూ ఆ పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయట. 9వ డివిజన్ విషయంలోనూ ఈ తరహా ఆరోపణలే వినిపిస్తున్నాయి. ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడం, టీడీపీ అభ్యర్థి మజ్జి పద్మావతి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం లాంటి పరిణామాలు వివాదాస్పదం అవుతున్నాయి. 20 లక్షల రూపాయలు, ఇసుక ర్యాంపులో వాటా కోసం వైసీపీ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్నారని మొదట్లో చెప్పుకున్నారు. తర్వాత మరో అభ్యర్థికి పార్టీ బీ ఫారం ఇచ్చినా.. ఆ వ్యక్తి కూడా మూడున్నర లక్షల రూపాయలకు అమ్ముడుపోయారన్న ప్రచారం గుప్పుగుప్పుమంటోంది రాజమండ్రిలో. అయితే…ఈ ఆరోపణలు, ప్రచారాల్లో నిజమెంత? వెనకున్నది ఎవరన్నది తేలాల్సి ఉంది. వరుసగా రెండు డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడం, దాని వెనక ఫలానా కారణం ఉందన్న ప్రచారంపై పార్టీ శ్రేణులు మాత్రం తీవ్ప అసహనంగా ఉన్నాయట.
ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ రాజమహేంద్రవరం నగర మాజీ అధ్యక్షుడు నందేపు శ్రీనివాస్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. 33వ డివిజన్లో టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవానికి ఆయన సహకరించారన్న ఆరోపణలు పార్టీలో అంతర్గతంగా దుమారం రేపుతున్నాయి. కీలక బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి ప్రత్యర్థులకు సహకరించారన్న ప్రచారం కేడర్ని కూడా కలవరపెడుతోంది. కార్యకర్తలు, నాయకులు ఒకవైపు పార్టీని నిలబెట్టడానికి నానా తంటాలు పడుతుంటే… ముఖ్యమైన వాళ్ళే తెరవెనుక ఇలాంటి నమ్మక ద్రోహాలు చేస్తే… ఇక అర్ధం ఏముందని ఫైరయ్యేవాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది. శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న డిమాండ్ కూడా రాజమహేంద్రవరం వైసీపీలో పెరుగుతోంది. అయితే… సిటీ ఫ్యాన్ పార్టీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందన్న ప్రచారం చాలాకాలంగా ఉంది. ఒక వర్గం పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. మరో వర్గం టీడీపీ నేతలతో అంతర్గత అవగాహనతో పనిచేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ పరిస్థితుల్లో… అసలు పార్టీ అభ్యర్థుల ఎంపికలోనే ప్రత్యర్థులకు అనుకూలంగా ఉండే నిర్ణయాలు తీసుకున్నారా అన్న అనుమానాలు పెరుగుతున్నాయట. ఈ పరిణామాలపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినా… ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో స్పందన లేదన్న అసంతృప్తి కూడా మరో వర్గంలో వ్యక్తమవుతోంది. రాజమహేంద్రవరం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా వైసీపీ ఓడిపోయింది. తాజా పరిణామాలను, ఆ పరాజయాలను పోల్చి చూసుకుంటున్న వైసీపీ నేతలు కొందరు… పార్టీలోని ఓ వర్గం కనిపించకుండా చాలా గట్టి డ్యామేజ్ చేస్తోందని మాట్లాడుకుంటున్నారు. ఈ వ్యవహారాన్ని పార్టీ పెద్దలు ఎందుకు సమీక్షించడం లేదు? వెన్నుపోటుదారులపై చర్యలు తీసుకోకపోవడానికి కారణాలేంటంటూ ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వైసీపీకి జస్ట్ ఎలక్షన్ కాదు. నగరంలో పార్టీకి ఇంకా బలముందా? నాయకత్వంపై కార్యకర్తలకు నమ్మకం ఉందా? లాంటి చాలా ప్రశ్నలకు ఇందులో సమాధానాలు వెదుక్కుంటోంది. కానీ… ఇప్పుడీ అమ్ముడుపోవడాలు, వెన్నుపోట్ల లాంటి చర్యలతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయంటున్నారు హార్డ్‌కోర్ వైసీపీ లీడర్స్. ఎన్నికల తర్వాత అయినా వైసీపీ అధిష్ఠానం రాజమహేంద్రవరంలో పార్టీ పరిస్థితిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అంటున్నారు. ఈ డ్యామేజ్ ఇలాగే కొనసాగితే మాత్రం ఇక కోలుకోవడం కష్టమేనన్నది ఫ్యాన్ కేడర్ అభిప్రాయం.

