NTV Telugu Site icon

No Confidence Motion: ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం.. ఆమోదించిన లోక్‌సభ స్పీకర్

Parliament

Parliament

No Confidence Motion: మణిపూర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరుతూ కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) బుధవారం నోటీసులు సమర్పించాయి. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. స్పీకర్ ఇప్పుడు చర్చ తేదీని త్వరలో ప్రకటిస్తారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ డిప్యూటీ లీడర్‌ గౌరవ్‌ గొగోయ్‌ లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ కార్యాలయానికి నోటీసు ఇచ్చారు. అవిశ్వాస తీర్మానం కోసం ప్రత్యేక నోటీసును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఫ్లోర్ లీడర్ నాగేశ్వర్ రావు స్పీకర్‌కు సమర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ ఉన్న సంగతి తెలిసిందే.

Also Read: Enforcement Directorate: ఈడీ చీఫ్ పదవిని పొడిగించాలి.. సుప్రీంను ఆశ్రయించిన కేంద్రం

అవిశ్వాస తీర్మానం సభా వేదికపై ప్రభుత్వ మెజారిటీని సవాలు చేయడానికి ప్రతిపక్షాన్ని అనుమతిస్తుంది. తీర్మానం ఆమోదించబడితే, ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. మణిపూర్‌లో జరిగిన హింసాకాండను ఉపయోగించి బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి మణిపూర్‌లో జరిగిన హింసాకాండపై ప్రధాని మోడీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమయ్యాయి. మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండపై ప్రధాని మోడీ సభలో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష నేతలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం మండిపడ్డారు. మణిపూర్! మణిపూర్ నినాదాల మధ్య అమిత్ షా మాట్లాడుతూ.. “ఇప్పుడు ఎవరు నినాదాలు చేస్తున్నా, వారికి ప్రభుత్వంపై లేదా సహకారంపై ఆసక్తి లేదు. వారికి దళితులపై లేదా మహిళల సంక్షేమంపై ఆసక్తి లేదు.. నేను పునరుద్ఘాటించాలనుకుంటున్నాను. ఏ రకమైన సుదీర్ఘ చర్చకైనా నేను సిద్ధంగా ఉన్నాను.” అని అమిత్ షా పేర్కొన్నారు.

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్‌గా మారిన నేపథ్యంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 20న ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ఒకరోజు ముందు అంటే జూలై 19న మే 4న వీడియో వైరల్‌గా మారింది.