Site icon NTV Telugu

Operation Sindhur: భారత్ దెబ్బకు వణికిపోయిన ఉగ్రవాదులు.. ఇప్పటికీ అజ్ఞాతంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌లు మసూద్ అజార్, హఫీజ్ సయీద్!

Operation Sindhur

Operation Sindhur

Operation Sindhur: సరిగ్గా ఏడాది క్రితం పహల్గామ్‌లో జరిగిన రక్తపాతానికి భారత్ తీర్చుకున్న ప్రతీకారం ‘ఆపరేషన్ సింధూర్’ ఉగ్రవాదుల గుండెల్లో నేటికీ రైళ్లు పరుగెత్తిస్తోంది. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణమైన చర్యకు ధీటుగా సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్న భారత సైన్యం, మే 7న పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది.

READ ALSO: Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’కు బ్రేక్ ..కారణం ఏంటంటే?

ఉగ్రవాద కోటలు బద్ధలు..
‘ఆపరేషన్ సింధూర్’లో భాగంగా భారత సైన్యం వ్యూహాత్మకంగా తొమ్మిది ప్రధాన ఉగ్రవాద కేంద్రాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో ప్రధానంగా లష్కర్-ఎ-తైబా (LeT), జైష్-ఎ-మహ్మద్ (JeM), హిజ్బుల్ ముజాహిదీన్ గ్రూపుల ఉనికిని భారత్ దెబ్బతీసింది. లాహోర్ సమీపంలోని 200 ఎకరాల్లో విస్తరించి ఉన్న లష్కర్-ఎ-తైబా ప్రధాన కార్యాలయం మురిద్కేపై భారత్ విరుచుకుపడింది. ఇది ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే అతిపెద్ద కేంద్రం. అలాగే జైష్-ఎ-మహ్మద్‌కు కంచుకోట లాంటి బహవల్పూర్‌లోని జామియా మసీద్ సుభాన్ అల్లా ప్రాంగణంపై క్షిపణి దాడులు జరిగాయి. మసూద్ అజహర్‌కు చెందిన ఒక మదర్సా కూడా ఈ దాడుల్లో నేలమట్టమైంది. PoKలోని ముజఫరాబాద్, కోట్లి రహస్య స్థావరాలను కూడా భారత సైన్యం వదల్లేదు. ఈ ఆపరేషన్‌లో తన కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు మరణించారని మసూద్ అజహర్ స్వయంగా అంగీకరించడం గమనార్హం.

ప్రాణభయంతో మసూద్ అజార్ పలాయనం
ఆపరేషన్ సింధూర్ తర్వాత మసూద్ అజార్ ప్రాణభయంతో అల్లాడిపోతున్నాడు. మొదట బహవల్పూర్‌లో తలదాచుకున్న అతడిని, ఐఎస్ఐ హుటాహుటిన 1,200 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిల్గిత్-బాల్టిస్థాన్‌కు తరలించింది. 2025 జూలైలో స్కార్డూలోని వివిధ మసీదులు, మదర్సాలు, ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లలో అతను దాక్కున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అజార్ ఆఫ్ఘనిస్థాన్ పారిపోయాడని పాక్ మాజీ మంత్రి బిలవాల్ భుట్టో బుకాయించినప్పటికీ, అతడు పాక్ రక్షణలోనే ఉన్నాడని నిఘా వర్గాలు ధృవీకరించాయి.

హఫీజ్ సయీద్ పరిస్థితి ఇదే..
మరో ఉగ్రవాద నేత హఫీజ్ సయీద్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. 46 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నట్లు పాక్ ప్రపంచాన్ని నమ్మిస్తున్నా, అతను లాహోర్‌లోని జోహర్ టౌన్‌లో విలాసవంతమైన గృహ నిర్బంధంలో ఉన్నట్లు తెలిసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత అతను ఇస్లామాబాద్‌కు మకాం మార్చాడు. భారత్‌కు అప్పగించే విషయంలో పాక్ అడపాదడపా ప్రకటనలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం అతడికి పూర్తి రక్షణ కల్పిస్తోంది. ప్రస్తుతం ఈ ఇద్దరు ఉగ్రవాదులను ఐఎస్ఐ నిరంతరం ఒక నగరం నుంచి మరో నగరానికి (రావల్పిండి, కరాచీ, లాహోర్) మారుస్తూ రక్షిస్తోంది. అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ పాకిస్థాన్ మాత్రం తన వక్రబుద్ధిని వీడటం లేదు. అయితే భారత్ దెబ్బకు భయపడి ఈ ఉగ్ర నేతలు బహిరంగంగా కనిపించడానికి కూడా సాహసించడం లేదు. భారత భద్రతా సంస్థలు వీరి ప్రతి కదలికపై నిశిత నిఘా ఉంచాయి.

READ ALSO: KL Rahul Trolls: రాహుల్.. ఎక్కడ ఆ దూకుడు, వికెట్ కీపింగ్! ఇక జట్టులో చోటు కష్టమే

Exit mobile version