One Ganesh statue in Keshavapuram Village For The Past 40 Years: ‘వినాయక చవితి’ వచ్చిందంటే.. ఎక్కడా చూసినా గణపతి విగ్రహాలే కనిపిస్తుంటాయి. నవరాత్రుల సందర్బంగా పట్టణాల్లో గల్లీకో వినాకుడి విగ్రహంను పెడుతారు. అదే ఊర్లో అయితే వాడకో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. చుట్టుపక్కన తమదే పెద్ద విగ్రహంగా ఉండాలని పోటీపడి మరీ భారీ లంబోదరుడిని కొనుగోలు చేస్తుంటారు. అయితే గల్లిగల్లీకి, వాడకో వినాకుడి విగ్రహంను పెడుతున్న ఈరోజుల్లో.. ఓ గ్రామంలో మాత్రం ఒక్కటే గణపతి విగ్రహం ఉంటుంది. కుల, మతాలకు అతీతంగా.. ఆ గ్రామస్తులు అందరూ ఆ గణపతికే పూజలు చేస్తారు. ఆ గ్రామం ఎక్కడో లేదు.. మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది.
నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం కేశవాపురం గ్రామంలో ఒక్క వినాయకుడి విగ్రహం మాత్రమే ఉంటుంది. గ్రామస్తులు ప్రతి ఏటా రామాలయం వద్ద గణపతి విగ్రహాన్ని పెట్టి.. నవరాత్రులు ఘనంగా పూజిస్తారు. ఈ పూజల్లో గ్రామంలోని అన్ని కులాలకు చెందిన భక్తులు పాల్గొంటారు. కేశవాపురంలో గత 40 ఏళ్లుగా ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది. రాజకీయ నేతలు, ప్రముఖులు విరాళాలు ఇస్తామంటూ ముందుకు వచ్చినా.. అందుకు గ్రామస్తులు ఒప్పుకోరు. నిర్వహణ కమిటీ తీర్మానం ప్రకారమే భక్తులు, గ్రామస్తులు అండుచుకుంటారు. ప్రతి ఏడాది వినాయక చవితికి ముందు కమిటీ సమావేశం అవుతుంది.
Also Read: Gold Rate Today: తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతో తెలుసా?
కేశవాపురం గ్రామంలో వినాయకుడి విగ్రహం వద్ద డీజేలు పెట్టడం, డాన్స్ ప్రోగ్రామ్‌లు నిర్వహించడం లాంటివి ఉండవు. నవరాత్రులు భజనలు చేయడం, కోలాటాలు ఆడడం ఈ గ్రామం ప్రత్యేకత. గ్రామంలో ఒకే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్ల డబ్బు వృథా కాదని, పర్యావరణ కాలుష్యాన్ని కూడా అరికట్టవచ్చని గ్రామస్తులు అంటున్నారు. ఎన్ని విగ్రహాలు పెడితే.. ప్రజల మధ్య దూరం అంత పెరుగుతుందని వారు భావిస్తున్నారు. కేశవాపురంలో కులమతాలకు అతీతంగా చవితి ఉత్సవాలను జరుపుకుంటున్నామని గ్రామ పూజారి దుర్గి శ్రీనివాస శర్మ చెప్పారు.