Site icon NTV Telugu

Eknath Shinde: మమ్మల్ని ఈ ఎన్నికల్లో ఏడిపించింది ఉల్లిపాయలే..

Shinde

Shinde

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో వ్యవసాయ సంక్షోభం అధికార మహాయుతి కూటమికి తీవ్ర నష్టం కలిగించిందని పేర్కొన్నారు. ముంబైలో మంగళవారం జరిగిన వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశమై మద్దతు ధరను నిర్ణయించే అంశాన్ని లేవనెత్తుతానని వెల్లడించారు. ఉత్తర మహారాష్ట్రలో ప్రధాన ఉత్పత్తి ఉల్లి.. వీటి కారణంగానే తాము సమస్యలను ఎదుర్కొన్నామన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఈ అంశమే మమ్మల్ని బాగా ఏడిపించిందని సీఎం షిండే కామెంట్స్ చేశారు.

Read Also: AP Cabinet: ఏపీలో 24 మందితో మంత్రుల జాబితా విడుదల.

ఇక, వ్యవసాయ సంబంధిత సమస్యల గురించి తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఇప్పటికే మాట్లాడినట్లు ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తెలిపారు. అలాగే.. ఉల్లి, సోయాబీన్‌, పత్తికి కనీస మద్దతు ధర నిర్ణయించడంపై కేంద్ర వ్యవసాయ మంత్రితోనూ చర్చిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కాగా, చిల్లర ధరలను నియంత్రించేందుకు గతేడాది డిసెంబర్‌లో ఉల్లిపాయల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో ముఖ్యంగా నాసిక్ బెల్ట్‌లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. దీంతో మే ప్రారంభంలో దీనిపై ఉన్న బ్యాన్ ఎత్తేశారు. దీని ప్రభావం లోక్ సభ ఎన్నికల్లో మాపై పడింది. శివసేన(షిండే), దాని మిత్రపక్షం బీజేపీ నాసిక్, దిండోరి లోక్‌సభ స్థానాలను కోల్పోయాయని చెప్పుకొచ్చారు. మరఠ్వాడాలో ఒక సీటును, విదర్భలో కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకున్నామని సీఎం ఏక్ నాథ్ షిండే వెల్లడించారు.

Exit mobile version