one man protest at Tennis Laver Match
లండన్‌లో జరిగిన టెన్నిస్ లావర్ కప్ మ్యాచ్ సందర్భంగా శుక్రవారం ఒక వ్యక్తి టెన్నిస్ కోర్టులో పరిగెత్తి తన చేతికి నిప్పంటించుకోవడంతో ఆట కొద్దిసేపు ఆగిపోయింది. బ్రిటన్‌లో ప్రైవేట్ జెట్ విమానాల వినియోగానికి వ్యతిరేకంగా ఆ వ్యక్తి నిరసన వ్యక్తం చేశాడని అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే.. ప్రేక్షకుల సీట్లలో కూర్చొని ఉన్న సదరు వ్యక్తి ఒక్కసారి టెన్నిస్ కోర్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాకుండా.. తన చేతికి నిప్పంటించుకున్నాడు. ఇది గమనించి ప్లేయర్లు అక్కడినుంచి పక్కకు వెళ్లిపోయారు.
వెంటనే సెక్యూరిటీ సిబ్బంది వచ్చి మంటలు అర్పి సదరు వ్యక్తిని టెన్నిస్ కోర్టు నుంచి బయటకు తీసుకెళ్లారు. లండన్‌లోని ఓ2 ఎరీనాలో స్టెఫానోస్ సిట్సిపాస్, డియెగో స్క్వార్ట్‌జ్‌మన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగిన ఈ ఘటనపై అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఆ వ్యక్తి ‘ఎండ్ యుకె ప్రైవేట్ జెట్‌లు’ అనే నినాదంతో కూడిన టీ-షర్టును ధరించాడు. అయితే కొద్దిసేపు ఆటను నిలిపివేశారు. సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.