NTV Telugu Site icon

Manipur Violence: సీఎం ఇంటిపై దాడి.. కర్ఫ్యూ, ఇంటర్నెట్ బంద్- మణిపూర్‌లో మరోసారి హింసకు కారణం?

Manipur Violence

Manipur Violence

మరోసారి మణిపూర్‌లో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్‌లతో పాటు బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్, కాంగ్‌పోక్పి, చురచంద్‌పూర్ జిల్లాల్లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ నిలిపేశారు. ఇంఫాల్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఆందోళనకారులు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ వ్యక్తిగత నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. పలువురు ఎమ్మెల్యేల నివాసాలపై దాడులు చేసిన ఆస్తుల్ని ధ్వంసం చేశారు. సపమ్ నిషికాంత్ సింగ్ ఇంటిపై కొందరు వ్యక్తులు దాడి చేసి గేటు ముందు నిర్మించిన బంకర్లను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా నిరసనకారులు రాష్ట్ర మంత్రులు సపమ్ రంజన్, ఎల్ సుసీంద్రో సింగ్, వై ఖేమ్‌చంద్ ఇళ్లను ముట్టడించారు. ముగ్గురు మంత్రులు, ఆరుగురి ఎమ్మెల్యేల ఇళ్లపై దాడిచేసి నిప్పుపెట్టారు. నిరసనకారులను చెదరగొట్టడానికి భద్రతా దళాలు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

ఎమ్మెల్యేలు-మంత్రుల ఇంటిపై దాడులు..
ఇంఫాల్‌లో దాడుల నేపథ్యంలో ఐదు జిల్లాలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. మణిపుర్‌లోని పలుచోట్ల ఇంటర్‌నెట్‌ సేవలను నిలివేసింది. జిరిబామ్ జిల్లాలో అనుమానస్పదంగా మృతి చెందిన ముగ్గురు వ్యక్తులకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన కారులు నిరసనలకు దిగారు. 24గంటల్లో హంతకులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోృ సీఎం బిరెన్‌ సింగ్‌ అల్లుడి ఇళ్లతో సహా ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు నిరసనకారులు ఆందోళన చేశారు. ఆ తర్వాత ఇళ్లకు నిప్పు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. భద్రత దళాలు ఆందోళనకారులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి చెదరగొట్టినట్లు వెల్లడించారు.

హింస చెలరేగడానికి కారణం…
నవంబర్ 11న భద్రతా దళాలు 10 మంది హ్మార్ పురుషులను చంపారు. ఆ ప్రదేశానికి సమీపంలోని నిర్వాసిత ప్రాంతం శిబిరం నుంచి ఆరుగురు మైతే జాతి వారు అదృశ్యమై చివరికి వారి మృతదేహాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పరిణామాలు మణిపూర్​లో తాజా హింసకు కారణమైయ్యాయి. హతమైన వారిని భద్రతా దళాలు మిలిటెంట్లుగా అభివర్ణించాయి. అయినప్పటికీ కుకీ-జో కమ్యూనిటీ వారు గ్రామ వాలంటీర్లు అని పేర్కొంది. కుకీ మిలిటెంట్లు అపహరించిన ఆరుగురు మైతే బాధితుల్లో 25 ఏళ్ల మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు, 31 ఏళ్ల మహిళ, ఆమె కుమార్తె, 60 ఏళ్ల మహిళ ఉన్నారు. జిరిబామ్ నుంచి గల్లంతైన ఆరుగురిలో ఒకరిగా భావిస్తున్న ముగ్గురి మృతదేహాలు జిరి నదిలో తేలియాడుతూ కనిపించాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అసోంలోని సిల్చార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. హింసాత్మక ప్రాంతాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ ఎస్ పీఏ)ని తిరిగి విధించడంతో ప్రజల నిరాశ మరింత పెరిగింది. ఘర్షణను తగ్గించడంలో, ఏఎఫ్​ఎస్​పీఏ తిరిగి రావడాన్ని వ్యతిరేకించడంలో మంత్రులు, శాసనసభ సభ్యులు విఫలమయ్యారని నిరసనకారులు విమర్శించారు.