NTV Telugu Site icon

MS Dhoni Retirement: ఎంత పని చేసావ్ ధోనీ భాయ్.. భారత క్రికెట్ ఫాన్స్ ఎప్పటికీ మర్చిపోని రోజు!

Ms Dhoni Retirement

Ms Dhoni Retirement

MS Dhoni announced his retirement on August 15: ప్రతి ఏడాది ఆగస్టు 15న భారతదేశం అంతా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నా.. క్రికెట్ అభిమానులు మాత్రం ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. అందుకు కారణం భారత్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్ ‘ఎంఎస్ ధోనీ’. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ, ప్రపంచ క్రికెట్‌లో టీమిండియాను నెంబర్‌ 1 స్థానం, విదేశీ గడ్డపై సిరీస్ విజయాలు.. ఇలా భారత క్రికెట్‌కు ఎంతో సేవ చేసిన కెప్టెన్ కూల్ ధోనీ మూడేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

2019 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో న్యూజిల్యాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఆ బాధ నుంచి భారత క్రికెట్ అభిమానులు నెమ్మదిగా కోలుకుంటున్న సమయంలో ఎంఎస్ ధోనీ ఓ బాంబ్ పేల్చాడు. చడీచప్పుడు లేకుండా టెస్టు క్రికెట్‌కు దూరమైన ధోనీ.. పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి కూడా ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండానే తప్పుకున్నాడు. కనీసం అభిమానులకు ఫేర్ వెల్ మ్యాచ్ చూసే అవకాశం కూడా ఇవ్వకుండా తనదైన స్టైల్లో రిటైర్మెంట్ ఇచ్చాడు. ధోనీతో పాటు టీమిండియా వెటరన్ బ్యాటర్ సురేష్ రైనా కూడా ఆగస్టు 15నే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఇద్దరూ ఒకేరోజు రిటైర్మెంట్ ఇవ్వడంతో భారత క్రికెట్ ఫ్యాన్స్ అంతా షాకయ్యారు. ముఖ్యంగా మహీ విషయంలో పడ్డారు.

2004లో డిసెంబర్‌ 23న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో ఎంఎస్ ధోనీ వన్డేల్లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో పరుగులేమీ చేయకుండా రనౌట్‌ అయ్యాడు. 2005లో శ్రీలంకపై తొలి టెస్టు ఆడిన మహీ.. 2006లో తొలిసారి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఆడాడు. ఇక చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2019 జులై 19న ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై ఆడాడు. 2007లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ జట్టుకు తొలిసారి ధోనీ నాయకత్వం వహించాడు. అదే ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌కు తొలిసారి కెప్టెన్‌ అయ్యాడు. 2008లో అనిల్‌ కుంబ్లే గాయపడటంతో వైస్‌ కెప్టెన్‌గా ఉన్న ధోనీ పూర్తిస్థాయి టెస్ట్‌ జట్టు‌కు కెప్టెన్ అయ్యాడు.

Also Read: 2023 World Cup Tickets: నేడే ప్రపంచకప్ 2023 టిక్కెట్ల రిజిస్ట్రేషన్.. ఎప్పుడు, ఎక్కడంటే?

అంతర్జాతీయ కెరీర్‌లో ఎంఎస్ ధోనీ 90 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 4876 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్‌ల్లో 10773 రన్స్‌ బాదాడు. వీటిల్లో 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 98 టీ20 మ్యాచ్‌లలో 1600 పరుగుల చేశాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో ధోనీ కొట్టిన విన్నింగ్‌ షాట్‌ ప్రపంచ క్రికెట్‌ అభిమానుల మనసులో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ధోనీ ఎందరో యువకులకు స్ఫూర్తిగా నిలిచాడు.