‘రోహిత్ శర్మ’ పేరు చెప్పగానే ప్రతి క్రికెట్ అభిమానికి అతడి భారీ హిట్టింగే గుర్తుకొస్తుంది. భారీ సిక్సులు బాదే రోహిత్‌కు ‘హిట్‌మ్యాన్’ అనే ట్యాగ్ ఉంది. రోహిత్ తన దూకుడైన బ్యాటింగ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తన పేరిట లికించుకున్నాడు. ముఖ్యంగా వన్డే క్రికెట్‌లో అసాధారణమైన రికార్డులను తన పేరిట నమోదు చేశాడు. ఓ అరుదైన రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. అదే అత్యధిక వ్యక్తిగత స్కోరు.
ఒకప్పుడు వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేయడం ఎవరి వల్ల కాలేదు. సయీద్ అన్వర్, చార్లెస్ కోవెంట్రీలు 194 రన్స్ వద్ద ఆగిపోయారు. 2010లో క్రికెట్ దిద్దజం సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 2011లో వీరేంద్ర సెహ్వాగ్ డబుల్ కొట్టాడు. 2013లో ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ మొదటి ద్విశతకం (209) చేశాడు. 2014లో శ్రీలంకపై 264 పరుగులను సాధించాడు. శ్రీలంకపైనే 2017లో 208 పరుగులతో అజేయంగా నిలిచి.. మూడో ద్విశతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికీ వన్డేల్లో రోహిత్ పేరిటే అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు ఉంది. కివీస్ మాజీ ఆటగాడు మార్టిన్ గప్తిల్ 2015లో వెస్టిండీస్ జట్టుపై 234 పరుగులు చేసినా.. రోహిత్ రికార్డును మాత్రం అందుకోలేకపోయాడు. వన్డేల్లో ఇప్పటివరకు 12 డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. ఇందులో ఐదుగురు భారత బ్యాటర్లు ఉండడం విశేషం.
Also Read: IND vs AUS: నీకు అవసరమా?.. పాంటింగ్‌పై ఫైరైన ఆసీస్ మాజీ క్రికెటర్!
2014లో భారత పర్యటనకు శ్రీలంక వచ్చింది. ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ 5-0 తేడాతో గెలిచింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో రోహిత్ శర్మ చెలరేగాడు. 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్స్‌లతో ఏకంగా 264 రన్స్ చేశాడు. ఓపెనర్‌గా వచ్చిన హిట్‌మ్యాన్.. చివరి బంతికి ఔటై పెవిలియన్‌కు చేరాడు. రోహిత్ బాదుడుతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 404 పరుగులు చేసింది. ఛేదనలో శ్రీలంక 251 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు రోహిత్‌ను వరించింది. హిట్‌మ్యాన్‌కు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ రూ.2,64,000 చెక్ అందించింది.