Salman khan Security: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇటీవల బెదిరింపులు ఎదుర్కొంటున్న నటుడు సల్మాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు ‘వై ప్లస్’ గ్రేడ్ భద్రతను అందించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులకు మహారాష్ట్ర సర్కారు భద్రతను పెంచినట్టు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్ తదితరులు ఇందులో ఉన్నారు. వీరిలో సల్మాన్ ఖాన్.. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్రూపు నుంచి లోగడ బెదిరింపులు ఎదుర్కొన్నారు. సల్మాన్ ఖాన్‌తో పాటు ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌కు ఈ ఏడాది జూన్‌లో బెదిరింపు లేఖ రావడం కలకలం సృష్టించింది. నటులు అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్‌లకు ‘ఎక్స్’ కేటగిరీ భద్రత కల్పించారు.
పంజాబీ యువ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు పాల్పడింది బిష్ణోయ్ ముఠానే కావడం గమనార్హం. అనంతరం ముంబై పోలీసులు లారెన్స్ బిష్ణోయ్ ముఠాలోని పలువురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ తమ లక్ష్యమని అని వారు విచారణలో పోలీసులకు వెల్లడించినట్టు సమాచారం. దీంతో సల్మాన్ ఖాన్‌కు ప్రస్తుతమున్న భద్రతను పెంచి, వై ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలని మహారాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఇప్పటి వరకు ఆయనకు సాధారణ పోలీసు రక్షణ మాత్రమే ఉంది. వై ప్లస్ కేటగిరీలో ఆయుధాలు ధరించిన నలుగురు ఎప్పుడూ సల్మాన్‌ను కాచుకుని ఉంటారు. అలాగే, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్ లకు ఎక్స్ కేటగిరీ భద్రత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఎక్స్ కేటగిరీ రక్షణలో ముగ్గురు సాయుధ పోలీసులు ఎప్పుడూ రక్షణగా ఉంటారు.
సల్మాన్, ఆయన తండ్రిని బెదిరిస్తూ ఇటీవల ఆయన నివాసానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఓ లేఖ వచ్చిన విషయం తెలిసిందే. రోజూ జాగింగ్ అయ్యాక సల్మాన్ కూర్చునే బెంచిపై ఈ లేఖ లభించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ‘‘త్వరలో సిద్ధూ మూసేవాలా లాంటి పరిస్థితే మీకు ఎదురవుతుంది’’ అంటూ దుండగులు ఆ లేఖలో బెదిరించారు. లేఖపై జి.బి, ఎల్.బి అనే అక్షరాలు ఉన్నాయి. దీంతో ఆ అక్షరాలను గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్ పేర్లకు షార్ట్‌కట్‌గా పోలీసులు అనుమానించారు. అయితే ఈ లేఖను బిష్ణోయ్ ముఠానే పంపించిందా లేదా ఎవరైనా అతడి పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టి.. లారెన్స్ బిష్ణోయ్ ఈ లేఖను పంపినట్లు తెలుసుకున్నారు. ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్యకు ప్రధాన సూత్రధారి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అని ఢిల్లీ పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. పంజాబ్‌లో గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన షూటర్‌కు అత్యంత సన్నిహితుడు సిద్ధేష్ హిరామన్ కమ్లేను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
Arvind Kejriwal: ప్రతి ఇంటి గుమ్మం దగ్గర గిన్నెతో అడుక్కునేందుకు కూడా సిద్ధం..
కాగా గతంలోనూ బాలీవుడ్ హీరో సల్మాన్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. కృష్ణ జింకను దైవంగా భావించే లారెన్స్ బిష్ణోయ్.. కృష్ణజింకల వేట కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్‌ను చంపేస్తామని కోర్టు ఆవరణలోనే సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు అతడి ముఠా సల్మాన్ హత్యకు పథకం పన్నగా పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన ఏక్‌నాథ్ షిండే-బీజేపీ ప్రభుత్వం సల్మాన్ ఖాన్‌కు ‘వై ప్లస్’ ఇవ్వాలని రాష్ట్ర హోం శాఖ నిర్ణయం తీసుకుందని తెలిపింది. సల్మాన్ ఖాన్ కొన్నేళ్లుగా ప్రైవేట్ సెక్యూరిటీని కూడా కలిగి ఉన్నాడు. అతని ప్రధాన గార్డు గుర్మీత్ సింగ్ అలియాస్ షేరా అతనికి నీడగా ఉన్నాడు.