Bribery Case: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం రాజ్‌కోట్‌లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్‌టి) డైరెక్టర్ జవరిమల్ బిష్ణోయ్ ను సిబిఐ అరెస్టు చేసింది. ఐదు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. అయితే సీబీఐ అధికారులను షాక్‌కు గురిచేస్తూ.. భవనంలోని నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాంతో అక్కడ కలకలం రేగింది. శనివారం అతడి ఆఫీస్, ఇంటిపై సీబీఐ అధికారులు దాడి చేశారు. తన ఇంటికి వచ్చిన సీబీఐ అధికారులను చూసిన బిష్ణోయ్ నాలుగో అంతస్తు కిటికీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో అతడి భార్య చేసిన పని తాజాగా వెలుగులోకి వచ్చింది.
Read Also: Private Doctors: రోడ్డెక్కిన ప్రైవేట్ డాక్టర్లు.. ఆరోగ్య హక్కు బిల్లుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ
సీబీఐ బృందం బిష్ణోయ్ ఇంటికి చేరుకోగానే ఆయన భార్య ఇంటికి తాళం వేసింది. వెంటనే ఆమె ఇంటి పైకప్పు నుండి డబ్బుతో కూడిన బ్యాగ్‌ను పార్కింగ్ స్థలంలోకి విసిరింది. ఈ బ్యాగ్ ఆమె మేనల్లుడు ఎత్తుకెళ్లాడు. ఇదే తరహాలో మరో బ్యాగ్ నిండా నగదును అతని భార్య పక్క ఇంటికి పంపింది. సీసీటీవీ ఫుటేజీలో ఉన్న బ్యాగులను పైకప్పుపై నుంచి విసిరేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రెండు బ్యాగుల నుంచి దాదాపు కోటి రూపాయలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో సీబీఐ విచారణ ప్రారంభించింది.
Read Also: CM Jagan Mohan Reddy: వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల బృందంతో సీఎం జగన్ భేటీ
పైకప్పుపై నుంచి దూకి బిష్ణోయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన బిష్ణోయ్‌ను వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందాడు. 5 లక్షలు లంచం తీసుకున్నారనే అభియోగంపై జవరిమల్‌ని అరెస్టు చేసినట్లు డీసీపీ సుధీర్ దేశాయ్ తెలిపారు. కాగా, ఈ ఘటనపై సమాచారం అందుకున్న బిష్ణోయ్ వర్గం ఆసుపత్రి వెలుపల తీవ్ర నిరసన చేపట్టారు. జవరిమల్ సోదరుడు సంజయ్ గిలా పరిపాలనను ప్రశ్నించారు. జవరిమల్ మృతదేహానికి పోస్టుమార్టం చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రద్యుమాన్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత సీబీఐ డీఐజీ సుప్రియా పాటిల్ రాజ్‌కోట్ చేరుకున్నారు. అధికారులతో చర్చించి ఘటనపై సమాచారం తెలుసుకున్నారు. ఈ మేరకు రాజస్థాన్ ఎమ్మెల్యే బిహారీలాల్ బిష్ణోయ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు కూడా లేఖ రాశారు. ఈ కేసు సీబీఐ అధికారుల ఎదుటే జరిగినందున సీబీఐ అధికారులే బాధ్యులని, వారిపై చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో డిమాండ్ చేశారు.