ఆ మాజీ మంత్రుల్లో అసహనం టన్నులు టన్నులుగా పేరుకుపోతోందా? తమకు ప్రాధాన్యం దక్కకపోవడం ఒక ఎత్తయితే… జూనియర్స్ తెగ పెత్తనాలు చేస్తున్నారంటూ రగిలిపోతున్నారా? ఇన్నాళ్ళు సిన్సియర్‌గా ఉన్న సీనియర్స్… ఇప్పుడు పార్టీ లక్ష్మణ రేఖ దాటుతున్నారా? ఎవరా సీనియర్స్? వాళ్ళ మనోభావాలు ఎక్కడెక్కడ దెబ్బతింటున్నాయి? తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఉత్తరాంధ్ర. కేడర్ నుంచి లీడర్స్ వరకు అందరిదీ… అధినాయకత్వం మీద వీరవిధేయతే తప్ప వ్యతిరేకత అన్న మాటే వినిపించదు. ఈ ప్రాంత నాయకత్వం పార్టీ క్రమశిక్షణ దాటి వ్యవహరించిన సందర్భాలు చాలా అరుదు. అలాంటి చోట ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైందట. నేతల ధోరణి మారుతోంది. ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పార్టీ సీనియర్లే రివర్స్ కావడం చర్చనీయాంశంగా మారుతోంది. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, దాడి వీరభద్రరావు, బండారు సత్యనారాయణ మూర్తి, కిమిడి కళా వెంకట్రావ్ వంటి వాళ్ళు ఈ కేటగిరీలో చేరడం కాస్త ఆందోళనకరమైన పరిణామమేనని అంటున్నాయి టీడీపీ వర్గాలు. గత ఐదేళ్ళలో తీవ్రమైన రాజకీయ ఉక్కపోతను ఎదుర్కొన్నా… ఫ్యాన్ కిందికి వెళ్ళేలేదు. అలాంటి వాళ్ళు ఇప్పుడు అధినాయకత్వ వైఖరిపై కారాలు, మిరియాలు నూరేస్తున్నారట. అవకాశం దొరకడమే ఆలస్యం… వేదిక ఏదైనా..చెలరేగిపోయి మాడ్లాడుతూ… అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీ ని ఇరుకునపెడుతున్నారన్న అభిప్రాయం పెరుగుతోంది. ఉన్నట్టుండి ఇలా ఎందుకు మారిపోయారని అంటే… వాళ్ళు ఆశించిన స్ధాయిలో ప్రయార్టీ దక్కకపోవడమేనని అంటున్నాయి టీడీపీ వర్గాలు. అసలే మం త్రి పదవులు రాక మంటమీద వుంటే…..ఇటీవల జరిగిన మహానాడు, అంతకుముందు జరిగిన ముఖ్య కార్యక్రమాలు సహా కీలక వేదికలపై కూడా తగ్గిపోవడం పెద్దల్లో అసహనం అదుపు తప్పేలా చేస్తోందట. వీటన్నిటికంటే జూనియర్లు మంత్రులుగా మారడం…..నియోజకవర్గ అవసరాల కోసం వాళ్ళకు చెప్పి పనులు చక్కబెట్టుకోవాల్సిరావడం ఇబ్బందిగా మారిందట. ఉమ్మడి జిల్లాల్లో శ్రీకాకుళానికి రెండు, విజయనగరానికి రెండు మంత్రి పదవులు దక్కగా… తొలిసారి విశాఖ ప్రాధాన్యత తగ్గిపోయింది. వీళ్ళలో ఒక్క అచ్చన్నాయుడు తప్ప మిగిలిన వాళ్ళంతా మంత్రివర్గానికి కొత్త. రాజకీయంగా వచ్చే ఎన్నికల నాటికి పోటీ చేస్తామా లేదా అనే అనుమానంతో వున్న సీనియర్లకు పదవులు దక్కకపోవడంతోనే…అంతర్గత కుంపట్లు అంటుకున్నట్టు తెలుస్తోంది. అలా.. ఫ్రస్టేషన్ పీక్స్ వెళ్ళడంతో ఛాన్స్ దొరకడమే పాపం సీనియర్లు సీమ టపాకాయిల్లా పేలుతున్నారన్న చర్చ జరుగుతోంది ఉత్తరాంధ్ర టీడీపీలో. ప్రతిపక్షంలో వున్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలంగా ఎదుర్కొన్న నేతల్లో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఒకరు.
అటువంటి నేతకు ఆఖరి నిముషం వరకు టిక్కెట్ పెండింగ్‌లో పెట్టడం….తప్పదన్నట్టు 21రోజుల ముందు సీట్ ఇచ్చి మాడుగుల నుంచి పోటీకి దించడం వంటివి ఆయన్ని హర్ట్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. గెలిచాక మంత్రి పదవి రాకపోగా… కనీస గౌరవం కూడా దక్కడం లేదని అసహనంగా ఉన్నారట ఆయన. దానికితోడు నియోజకవర్గ అభివృద్ధి నిధుల విషయంలో అన్యాయం జరుగుతోందంటూ మినీ మహానాడులో ఓపెనైపోయారు బండారు. అసలు ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచామా అనిపిస్తోందని ఆయన అన్న మాటలు కలకలం రేపాయి. వైసీపీని వీడి సొంత గూటికి చేరిన మరో సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఇటీవల అగ్గిరాజేస్తున్నారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కొటరీ మీద గురిపెట్టి చర్చకు తెరలేపిన బండారు….మినీ మహానాడు సాక్షిగా అధికారులలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని మాట్లాడి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేశారు. ఎటువంటి డిమాం డ్స్ లేకుండానే టీడీపీలో చేరిన వీరభద్రరావుకు పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత లభిస్తుందని టీడీపీ వర్గాలు అంచనా వేశాయి. కానీ, కొత్తగా చేరిన కొందరికి కీలక బాధ్యతలు అప్పగించినా….దాడి ఫ్యామిలీని మాత్రం పట్టించుకోలేదట టీడీపీ అధిష్టానం. ఇక, భీమిలి ఎమ్మెల్యే , మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుది డిఫరెంట్ స్టోరీ. మొన్నటి ఎన్నికల్లో మెజార్టీ పరంగా స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించినా… వివిధ కారణాలతో ప్రాధాన్యత లభించడం లేదట. తాను టీడీపీ ప్రొడక్ట్ నని బహిరంగ వేదికలపై చెప్పుకుంటున్నా….గంటాలోని లోపాలను వెతకడమే ఓ వర్గం పనిగా పెట్టుకుందనే చర్చ జరుగుతోంది. ఈ దిశగా మాజీమంత్రి లేవనెత్తిన అంశాలకు పబ్లిసిటీ లభిస్తున్నప్పటికీ….అంతర్గతంగా ఇబ్బందికరమైన పరిస్ధితులు ఎదురౌతున్నట్టు సమాచారం. ఆంధ్రా టూ ఆంధ్రా వయా తెలంగాణ అంటూఎక్స్‌లో ఆయన పోస్ట్ పెట్టాకే విశాఖ,,విజయవాడ విమాన సర్వీసులు ఉదయంపూట పునరుద్ధరించారు. అయినా… ఆయన బహిరంగ వేదిక మీద అలా స్పందించకుండా ఉంటే బాగుండేదన్న అభిప్రాయం పార్టీ ముఖ్య నేతలది. విజయనగరం మినీమహానాడులో కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు….మాజీ మంత్రి, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు మౌనం… సీనియర్లలో అసంతృప్తికి నిదర్శనం అనే భావన ఉంది పార్టీ సర్కిల్స్‌లో. వీళ్ళంతా బయటపడిన బ్యాచ్. ఇక, పార్టీనే నమ్ముకోవడం తప్ప గ్రూపులు కట్టడం, ధిక్కార స్వరం వినిపించడం అలవాటులేని చాలామంది సీనియర్లు అంతర్గత పరిణామాల పట్ల ఆవేదనతో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. తమను పక్కనపెట్టడం ఒక ఎత్తయితే… జూనియర్ నాయకులు పెత్తనాన్ని తట్టుకోలేకపోతున్నారట ఈ సీనియర్స్. మరి ఆవేదనలో వున్న మాజీ మంత్రులను బుజ్జగించి టీడీపీ అధిష్టానం తన దారికి తెచ్చుకుంటుందా….?లేక వాళ్ళ అభ్యంతరాలు న్యాయమైనవే కనుక పరిష్కారం చూపించి సహకరిస్తుందా…? అన్నది వేచిచూడాలి.