NTV Telugu Site icon

Off The Record : రసవత్తరంగా మారిన హిందూపురం రాజకీయాలు.. వైసీపీ పీఠాన్ని కదిలించే దిశగా టీడీపీ అడుగులు

Tdp Otr

Tdp Otr

డైలీ సీరియల్లో సస్పెన్స్ సీన్ లను తలపించేలా అక్కడి రాజకీయాలు జరుగుతున్నాయి. నిన్నటి వరకు వైసిపి కోర్టులో ఉన్న బాల్.. టిడిపి వైపు వెళ్ళింది. ఆ తర్వాత అదే బాల్ మళ్ళీ వైసిపి కోర్టులోకి వచ్చింది. ఇప్పుడు ఎత్తులకు పైఎత్తు వేస్తూ…టిడిపి వేసిన వ్యూహంలో వైసిపి చిక్కుకుందా…? పొలిటికల్ టూర్లను తలపించే విధంగా క్యాంపు రాజకీయాలు జరుగుతున్నాయా ? ఎన్నికలు లేని సమయంలో క్యాంప్ రాజకీయాలు ఏంటి ? ఎన్నికలు లేవు. ఓటింగ్ అసలే లేదు. అయినా హిందూపురం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. హ్యాట్రిక్ విజయాలతో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మంచి జోష్‌లో ఉన్నారు. మూడోసారి విజయం సాధించిన తర్వాత…వైసీపీని పూర్తి స్థాయిలో ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారట. ఇందులో భాగంగానే ప్రస్తుతం హిందూపురంలో రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో పూర్తిస్థాయి ఆధిక్యంతో ఉన్న వైసిపి పీఠాన్ని కదిలించే దిశగా టిడిపి అడుగులు వేస్తోంది. ఇప్పటికే అనేకసార్లు వైసీపీ నుంచి టిడిపిలోకి…ఆ తర్వాత మళ్లీ సొంతగూటికి వచ్చి పొలిటికల్ హీట్ పెంచారు ఇక్కడి కౌన్సిలర్లు. ప్రస్తుతం మున్సిపల్ పీఠం చుట్టూ చదరంగం సాగుతోంది. అసలు హిందూపురం మున్సిపాల్టీలో ఎవరి బలం ఎంతన్న దానిపై చర్చ మొదలైంది. 2021 మున్సిపల్ ఎన్నికల్లో 38 కౌన్సిల్‌ స్థానాల్లో 30 మంది వైసీపీ, ఆరుగురు టీడీపీ, బీజేపీ తరపున గెలుపొందారు. 19వ వార్డు నుంచి గెలుపొందిన ఇంద్రజను చైర్ పర్సన్ ఎన్నుకున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు వైసీపీ హిందూపురం నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ఇక్బాల్‌ను తప్పించి, దీపికకు బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి మున్సిపల్ చైర్‌పర్సన్‌, ఇన్‌చార్జ్‌ వర్గాల మధ్య దూరం పెరిగింది. ఇంద్రజ.. ఇక్బాల్ వర్గంలో ఉండటంతో…దీపిక వర్గం ఆమెకు ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చింది. ఇంతలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో…చైర్ పర్సన్ ఇంద్రజతో పాటు 9 మంది కౌన్సిలర్లను ఆగష్టు 15న ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో టిడిపిలోకి చేర్చుకున్నారు. అప్పటికే టిడిపికి సొంతంగా 6 మంది కౌన్సిలర్లతో పాటు బిజెపి, ఎంఐఎంకు చెందిన ఇద్దరి మద్దతు ఉంది. వీరితో పాటు వైసిపికి చెందిన 10 మంది కౌన్సిలర్లు, స్వతంత్రంగా గెలిచిన కౌన్సిలర్‌తో కలిపి 19 మందికి బలం పెరిగింది. కౌన్సిలర్లు కాకుండా ఎంపీ, ఎమ్మెల్యేల ఓట్లతో కలుపుకుంటే టిడిపికి 21మందితో ఛైర్మన్ గిరి సొంతం చేసుకునేందుకు సంపూర్ణ మెజార్టీ లభించింది. సంఖ్యాపరంగా టిడిపికి బలం ఉండడంతో హిందూపురం ఛైర్మన్ గిరి టిడిపి ఖాతాలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకున్నారు.

నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దీపికతో పాటు జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్‌…సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. పూర్తి స్థాయి మెజార్టీ ఉన్న మున్సిపాల్టీని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదని పావులు కదిపారు. వైసిపిని వీడి టిడిపిలో చేరిన నలుగురు కౌన్సిలర్లు మళ్లీ సొంతగూటికి వచ్చేలా చేశారు. ప్రస్తుతం ఛైర్ పర్సన్ ఇంద్రజ రాజీనామా ఆమోదించారు. ఇప్పుడు కొత్త ఛైర్మన్ ఎన్నికకు వైసీపీ సన్నాహాలు కథ మరో మలుపు తిరిగింది. ఎలాగైనా చైర్మన్ స్థానాన్ని దక్కించుకోవాలని ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యూహాలు రచిస్తున్నారట. ఎప్పటికప్పుడు ఎత్తుకు పైఎత్తులేస్తూ…వైసీపీ నాయకుల ప్లాన్‌ను పసిగడుతూ…టీడీపీ నేతలు ప్రతి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. దీపిక, ఉషశ్రీ చరణ్‌…కౌన్సిలర్లతో క్యాంపు రాజకీయాలు చేసినా ఫలితం లేకుండా పోయిందట. మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుందన్న సమాచారంతో క్యాంపు రాజకీయాలు షురూ అయ్యాయి. తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో ఉన్న అభ్యర్థికు ఓటేస్తామని కొందరు కౌన్సిలర్లు ముందుకొచ్చారట. దీంతో టీడీపీ బలం…22కి చేరింది. కౌన్సిలర్లు హైదరాబాద్ విహార యాత్రకు వెళ్లారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారన్నది తెలియాల్సి ఉంది. వీరంతా వచ్చే శుక్రవారం హిందూపురానికి రానున్నట్లు సమాచారం. చైర్మన్ ఎన్నికకు సంబంధించి నేడో రేపు నోటిఫికేషన్ వెలువడనున్నట్లు చెబుతున్నారు. ఇలా ఒక డైలీ సీరియల్‌లా ట్విస్టుల మీద ట్విస్టులు హిందూపురం రాజకీయాల్లో జరుగుతున్నాయి. మున్ముందో ఏం జరుగుతుందో చూడాలి.

 

Show comments