NTV Telugu Site icon

Off The Record: రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా వెనక ఆర్‌.కృష్ణయ్య వ్యూహం ఏంటి..?

Otr R Krishnaiah

Otr R Krishnaiah

Off The Record: బీసీ హక్కుల ఉద్యమ నేత ఆర్‌.కృష్ణయ్య పొలిటికల్‌ అడుగులు తడబడుతున్నాయా? లేక తడబాటును సరి చేసుకుంటున్నారా? రాజకీయ రంగుల కంటే ఉద్యమ పంథానే బెటరని అనుకుంటున్నారా? లేక కొత్త పార్టీ గడప తొక్కబోతున్నారా? రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా వెనక కృష్ణయ్య వ్యూహం ఏంటి? రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది?

దశాబ్దాల తరబడి బీసీ హక్కుల కోసం ఉద్యమాలు చేసిన నాయకుడు ఆర్‌.కృష్ణయ్య. అట్నుంచి పొలిటికల్‌ ప్రవేశం చేసి వివిధ పార్టీల మీదుగా రెండేళ్ళ క్రితం వైసీపీ తరపున రాజ్యసభకు వెళ్ళారాయన. ఇంకో నాలుగేళ్ళ పదవీకాలం ఉండగానే… తాజాగా ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. ఆయన అడుగులు మారుతున్నాయా? వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. బీసీ సంఘం నేతగా మొదలైన కృష్ణయ్య.. ఆ తర్వాత రాజకీయంగా వేసిన అడుగులు…అన్నీ ఇన్నీ కావు. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ప్రధాన పార్టీల వేదికలు ఎక్కిన వ్యక్తే. 2014లో టిడిపి అధినేత చంద్రబాబు… ఎల్ బి నగర్ అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. అక్కడి నుంచి.. ఎమ్మెల్యేగా గెలిచారు కృష్ణయ్య. అప్పట్లో తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే… కృష్ణయ్య ముఖ్యమంత్రి అభ్యర్థి అని కూడా చెప్పారు. కానీ…రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ ఉనికి ప్రశ్నార్ధకం కావడంతో…కృష్ణయ్య కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. తిరిగి.. 2018 ఎన్నికల నాటికి… కాంగ్రెస్ గూటికి చేరారు కృష్ణయ్య. నామినేషన్ వేసేందుకు ఆఖరి నిమిషంలో పిలిచి బీ ఫామ్‌ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు మిర్యాలగూడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారాయన.

ఆ ఓటమి తర్వాత కాంగ్రెస్‌లో ఎక్కడా యాక్టివ్‌గా కనిపించలేదు. కొన్నాళ్ళు తిరిగి బీసీల సమస్యలపై పోరాటం చేశారు. ఇంతలో ఏపీ నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం పిలిచి… రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. బీసీ లకు అవకాశాలు ఇచ్చే క్రమంలో వైసిపి రాజ్యసభ సభ్యుడు అయ్యారు కృష్ణయ్య. బీసీ హక్కుల సాధన కోసం పార్లమెంట్‌ను వేదికగా మలుచుకుంటానని నాడు చెప్పిన కృష్ణయ్య…. ప్రస్తుతం ఆ పదవికి కూడా రాజీనామా చేయడం చర్చనీయాంశం అయింది. ఈ పరిస్థితుల్లో తిరిగి ఆయన అడుగులు ఎటువైపు అన్నది ఆసక్తికరంగా మారింది. అటు బీజేపీ అగ్ర నాయకత్వం..కృష్ణయ్యకి టచ్ లోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలను క్యాష్ చేసుకునే పనిలో ఉన్న బీజేపీ.. ఆర్. కృష్ణయ్యని తనవైపు తిప్పుకుంటే తెలంగాణలో ప్లస్‌ అవుతుందన్న లెక్కలు వేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే తమ పార్టీలోకి తీసుకుని జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన అడుగులు కాషాయ పార్టీవైపేనన్న వాదన బలపడుతోంది. కానీ… అట్నుంచి మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అటు కాంగ్రెస్ నేతలు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి పార్టీలోకి ఆహ్వానించారు. ఐతే కృష్ణయ్య మాత్రం.. బీసీ జెండా, అజెండాతోనే నా అడుగులు అంటున్నారట. ఆ ప్రకారం చూస్తే… జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ పదవి ఇస్తే బీజేపీ వైపు వెళ్తారన్న వాదనకు బలం చేకూరుతోందంటున్నారు పరిశీలకులు.