ఆ టీడీపీ సీనియర్‌కి నిన్నటిదాకా పూల కిరీటం అనుకున్న పదవే ఇప్పుడు ముళ్ళ కిరీటంలా మారిపోయిందా? దాని ఎఫెక్ట్‌తో ఆయన కుర్చీలో కూడా సరిగా కూర్చోలేకపోతున్నారా? ఇంట గెలవడం ఆయనకు ఇప్పుడు అత్యవసరం అయిపోయిందా? తప్పించుకుందామనుకున్నా…. వదలకుండా వెంటబడ్డ వ్యవహారం ఆయన్ని పరేషాన్ చేస్తోందా? ఎవరా లీడర్? ఏంటాయన సీటు కిందికొచ్చిన కష్టం? పల్లా శ్రీనివాసరావు….ఏపీ టీడీపీ అధ్యక్షుడు. గాజువాక నుంచి 95వేల మెజారిటీతో గెలిచారాయన. బీసీ కార్డ్, విధేయత కలిసి మంత్రి అయిపోతారనే ప్రచారం జరిగినా….అంతకు మించిన గౌరవం ఇచ్చింది టీడీపీ హైకమాండ్. అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా… పల్లా ప్రొఫైల్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లిందని అంటారు. ఆయనకు స్పెషల్ సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ కారు వంటి సదుపాయాలను కల్పించింది సర్కార్. దాంతో… పూల కిరీటం అనుకున్న ప్రెసిడెంట్ పోస్టు ప్రస్తుత పరిణామాలతో ముళ్ళ కిరీటంలా మారుతోందట. ఒక రకంగా ఇప్పుడాయన అగ్ని పరీక్షే ఎదుర్కొంటున్నారని చెప్పుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. పల్లా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అయ్యాక… ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ పార్టీ వీడటంతో ఖాళీ అయిన ఈ సీటును దక్కించుకోవడానికి వైసీపీ, కూటమి పార్టీలు పోటీపడ్డాయి. ఇక్కడ వైసీపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ కూటమి ట్రయిల్ వేసింది. ఈ ఎత్తుకు పై ఎత్తుగా మాజీమంత్రి., ఉత్తరాంధ్ర కాపునేత బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించింది వైసీపీ. ఎలక్షన్ నిర్వహణపై విస్తృతమైన కసరత్తు చేసిన పల్లా టీమ్…..ఫ్యాన్ పార్టీ డెసిషన్తో డైలమాలో పడింది. పోటీ అంటూ జరిగితే ఓటమి తప్పదని వెళ్లిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా పోటీ నుంచి వైదొలగుతున్నట్టు లాస్ట్ మినిట్‌లో ప్రకటించింది కూటమి. రాష్ట్ర అధ్యక్షుడి సొంత జిల్లాలో సంఖ్యాబలం లేకుండా కూటమి చేసిన ప్రయత్నాలు, చివరికి అభ్యర్ధిని నిలబెట్టలేకపోవడం లాంటివి ఆయనకు కొంత మోదాన్ని …. మరికొంత ఖేదాన్ని మిగిల్చాయి. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో పక్కాగా వ్యూహం పన్ని…. స్థానిక సంస్థల ఉప ఎన్నికలో బొత్స వంటి సీనియర్ నేతను ఛాలెంజ్ చేసి ఉంటే…. ఆ లెక్కే వేరుగా ఉండేదన్న చర్చ జరిగింది. అదే సమయంలో సంఖ్యాబలం లేకుండా పోటీకి దిగితే పరువు పోయేదన్న ఆందోళన సైతం వ్యక్తం అయ్యింది. మొత్తంగా పోటీ నుంచి టీడీపీ తప్పుకోవడం ఏమోగానీ… అధ్యక్షుడిగా పల్లా నెత్తిన హైకమాండ్ పాలు పోసిందన్న టాక్ నడిచింది అప్పట్లో. ఇక సరిగ్గా నెల రోజుల క్రితం జరిగిన ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక రాష్ట్ర అధ్యక్షుడికి నిజంగానే పరీక్ష పెట్టింది.
రాజకీయాలకు సంబంధం లేని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్లో APTF అభ్యర్ధిని కూటమి బలపరిచింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మకు సెకండ్ టైం ఛాన్స్ ఇవ్వాలని నేరుగా ఉపాధ్యాయులను అభ్యర్థించింది టీడీపీ. ఇందు కోసం రాష్ట్ర అధ్యక్షుడి నేతృత్వంలో పలు భేటీలు….నియోజక వర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు., పరిచయ వేదికలు పెట్టి హడావిడి చేసింది టీడీపీ. అధ్యక్షుడిగా పల్లా ఎదుర్కొన్న సెకండ్ టెస్ట్ లో టీచర్ల ఆలోచన విధానం., వైఎస్సార్ సీపీ అంతర్గత మద్దతు గట్టిగా పనిచేశాయి. ఫలితంగా… PRTU నుంచి గాదె శ్రీనివాసులు నాయుడికి పట్టం కట్టింది ఉపాధ్యాయ వర్గం. ఎమ్మెల్సీగా ఎవరు గెలిచినా కూటమిదే క్రెడిట్ అని టీడీపీ క్లెయిమ్ చేసుకున్నా…..ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ వర్గాల్లో ఎదురైన ప్రతికూలత టీడీపీ ఏపీ అధ్యక్షుడి పనితీరుకు బెంచ్ మార్క్ గా మారిందనే చర్చ నడిచింది. రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీది ట్రయిల్ & ఎర్రర్ గేమ్ అనేది విస్పష్టం. కా నీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా బాధ్యత వహించాల్సిన పరిస్థితి మాత్రం తప్పలేదు. ఈ అంశాన్ని చేస్ చేసుకుని ప్రతిపక్షం వైసీపీ అధికార పక్షాన్ని దులిపేసింది. ఇలాంటి పరిస్థితుల్లో…. తాజాగా కూటమి చేపట్టిన ఆపరేషన్ వైజాగ్ మేయర్…. పల్లా శ్రీనివాస్‌ను మరింత పరేషాన్ చేస్తోందట. ఇక్కడ రాజకీయ ఎత్తుగడలకు, కులానికి లింకు పడటంతో ఇంటా బయట సతమతం అవుతున్నారట టీడీపీ స్టేట్ ప్రెసిడెంట్. 98 డివిజన్స్ ఉన్న జీవిఎంసీలో 22 మంది యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్లు వున్నారు. ఎక్స్ అఫీషియా సభ్యులుగా ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, వంశీకృష్ణ యాదవ్ ఇద్దరు ఓటర్లు. ప్రస్తుత మేయర్ హరి వెంకట కుమారిది యాదవ సామాజిక వర్గమే. నాలుగేళ్ల వైసీపీ పాలనలో వున్న మేయర్ పీఠంపై ఇప్పుడు టీడీపీ అవిశ్వాసం నోటీసులు ఇచ్చింది. దీంతో వ్యవహారం క్యాస్ట్ వైపు మళ్ళగా… యాదవ సంఘాలు రోడ్డెక్కేశాయి. రాష్ట్ర అధ్యక్షుడు., ఇద్దరు ఎమ్మెల్యేలు వున్న చోట బీసీ మహిళకు అన్యాయం జరిగితే సహించబోమంటూ నిరసనలు మొదలయ్యాయి. పార్టీ విధానం ప్రకారం హరి వెంకట కుమారిని దించేయడం తప్పనిసరి అయితే… మళ్లీ యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను ఎంపిక చేయడం లేదా ప్రస్తుత మేయర్‌నే కొనసాగించేలా పల్లానే బాధ్యత తీసుకోవాలన్నది యాదవ సంఘాల డిమాండ్. వాస్తవంగా అవిశ్వాసంపై మొదటి నుంచి పల్లా పెద్దగా ఆసక్తిగా లేరని, ఏడాది కోసం వ్యతిరేకత మూటగట్టుకోవడం అనవసరమన్న భావనలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. సహచర ఎమ్మెల్యేల ఒత్తిళ్లతో రంగంలోకి దిగినప్పటికీ సంఖ్యాబలం సాధించడం కోసం కిందామీదా పడాల్సి వస్తోందట. సొంత సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత రావడంతో ఇప్పుడు పల్లా ఎలా డీల్ చేస్తారనేది ఆసక్తి కరంగా మారింది. ఒకవైపు వైసీపీ ఎత్తులు….మరోవైపు వరుస ఒత్తిళ్లతో టీడీపీ రాష్ట పార్టీ అధ్యకుడికి సొంత గడ్డ మీదే అగ్ని పరీక్షలు తప్పడం లేదంటున్నారు పరిశీలకులు.