NTV Telugu Site icon

Off The Record : పడమరలో వైసీపీ సైడ్ ట్రాక్..కేడర్ ఉక్కిరిబిక్కిరి

Ysrcp

Ysrcp

2019 ఎన్నికల్లో పడమరలో ఫ్యాన్‌ ఫుల్ స్పీడులో తిరిగింది! ఇప్పుడు ఒకటో నంబర్‌లో పెట్టినట్టుగా ఉంది! రెక్కలుగా ఉన్నవాళ్లంతా సైడయ్యారు! గాలిరాక కేడర్‌ ఉక్కిరిబిక్కిరవుతోంది! గ్రంధి రందితో పక్క చూపులు చూస్తున్నారని నియోజకవర్గంలో టాక్. ఆచంట లీడర్ ఏచెంత ఉన్నారో తెలియక అయోమయం! ఆళ్ల కాళీ కృష్ణ వెళ్లిపోయాక ఆ ప్లేస్ ఇంకా ఖాళీగానే ఉంది.

రాష్ట్ర రాజకీయాల్లో నరసాపురం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు చాలా కీలకమైనవి. ఇక్కడి ఓటర్లు ఎప్పుడూ వన్ సైడ్‌గా గెలుపును డిక్లేర్ చేస్తూ ఉంటారు. 2019 ఎన్నికల తర్వాత ఈ పార్లమెంటు పరిధిలో గెలిచిన వైసీపీ నాయకులతో పాటు నామినేటెడ్ పదవులు పొందిన నేతల సంఖ్య మిగతా పార్లమెంటు స్థానాలతో పోల్చుకుంటే చాలా ఎక్కువ. అలాంటి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నేతలు ఇప్పుడు సైలెంటుగా ఉండటం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. మాజీ మంత్రులుగా ఉన్న ఆ నాయకులు వైసీపీలోనే కొనసాగుతారా లేక కండువా మార్చేస్తారా అనే చర్చ జరుగుతోందట. ఈ లిస్టులో భీమవరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రంధి శ్రీనివాస్ పేరు మొదటగా వినిపిస్తోందట. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై శ్రీనివాస్ సాధించిన విజయం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కాలం కలిసిరాక 2024 ఆయన ఓడిపోయారు. కార్యక్రమాలకు మెల్లిగా దూరం జరిగారు. ఇటీవల అధినేత జగన్‌తో జరిగిన సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. పైకి హెల్త్ బాలేదని చెబుతున్నా.. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే ఆయన జెండా ఎత్తేలా ఉన్నారనే చర్చ మొదలయింది. 2019లో జనసేన అధినేతను ఓడించినా గుర్తింపు రాలేదని.. ఇక భవిష్యత్తులో ఇంకెక్కడ వస్తుందనే భావనలో ఆయన ఉన్నారట. పడే కష్టమేదో మరోపార్టీలో పడితే ఫ్యూచర్ మీద ఆశలైనా ఉంటాయన్న ఫీలింగులో కార్యకర్తలున్నారట. ఈ క్రమంలో ఇటీవల గ్రంధి సోదరులు సీఎం చంద్రబాబును కలిసి విజయవాడ వరద బాధితుల సాయం కోసం కోటి రూపాయల చెక్కును అందించారు. ఈ ఎపిసోడ్ కూడా ఆయన పార్టీ మార్పు చర్చకు ఆజ్యం పోసింది. ప్రస్తుతం భీమవరంలో ఏ రకంగా చూసిన తెలుగుదేశం పార్టీకి సరైన నాయకత్వం లేదు. ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఉన్నప్పటికీ.. గ్రంధి శ్రీనివాస్ టీడీపీలో చేరినా ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికైతే మౌనం పాటిస్తున్న గ్రంధి.. భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఇక నరసాపురం పార్లమెంటు పరిధిలో వైసీపీ కార్యక్రమాలకు, అధినేత పెట్టే సమావేశాలకు దూరంగా ఉంటున్న మరో నేత చెరుకువాడ శ్రీరంగనాథ రాజు. ఆచంట నుంచి గెలిచిన ఈయన ఒకప్పుడు పార్టీలో కీలక నేత. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. పేదల కోసం సేకరించిన భూముల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో మంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చిందని చెబుతుంటారు. మినిస్టర్ పోస్టు పోవడంతో పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు అధినేత. కొంతకాలం తర్వాత ఆ పదవినుంచి కూడా ఆయన్ని తప్పించారు. అందుక్కారణం రాజుగారి వ్యవహార శైలే అంటారు లోకల్ జనం. నాయకులు ఎంతటిఎవరైనా తన దగ్గరికే రావాలనే యాటిట్యూడ్‌తో ఉంటారనే విమర్శలు రంగనాథరాజుపై ఉన్నాయి. ఆ గ్యాప్ అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ప్రస్తుతం మాజీమంత్రి ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారని టాక్ నడుస్తోంది. ఇదిలా వుంటే పార్టీకి వీరవిధేయుడిగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అటు పదవులకు, ఇటు పార్టీకి రిజైన్ చేశారు. దాంతో అక్కడా అయోమయంగానే ఉందట పరిస్థితి.

ఇలా అనేక కారణాలతో పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ నాయకుల తీరు తలోదారి అన్నట్టు తయారయింది. 2024 ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్కసీటు కూడా జిల్లాలో గెలవకపోవడం కార్యకర్తలు నారాజ్ అయ్యారు. గోడు వెళ్లబోసుకోవడానికి కూడా స్థానిక నాయకులు అందుబాటులో లేరట. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉండాల్సిన నేతలు కేడర్‌వైపు కన్నెత్తిచూడక పోవడంతో మెల్లిగా గ్రౌండ్‌ మారుతోందట. పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీకి మరింత నష్టం తప్పదనే అభిప్రాయం అక్కడి స్థానిక నేతల్లో వినిపిస్తోంది. మొత్తంగా రాజకీయంగా కీలకంగా నిలిచే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ కీలక నేతలు సైలెంట్ కావడంతో.. ఆ పార్టీ పెద్దలు ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటారో చూడాలి.

 

 

Show comments