తెలంగాణ కేబినెట్‌లో కొందరు మంత్రులు రెడ్ జోన్‌లో ఉన్నారా? వారికి వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయా? ఆ ఒక్కటి తేడా అయితే… కాంగ్రెస్ అధిష్టానం యాక్షన్ తీసుకునే ముప్పు ముంచుకొస్తోందా? ఆ రిజల్టే వాళ్ళ పనితీరుకు గీటురాయా? ఇంతకీ ఏంటా డేంజర్? తమను తాము నిరూపించుకుని సేఫ్‌జోన్‌లోకి వెళ్ళాల్సిన ఆ మంత్రులు ఎవరు? కాంగ్రెస్ సర్కార్‌కు ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు సవాల్ గా మారిపోయాయి. పార్టీ అధికారంలోకి వచ్చాక పెద్దల సభకు జరుగుతున్న ఎన్నికలు ఇవి. అందులోనూ… ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ సీటు. అధికారంలో ఉన్నారు గనుక దీన్ని తిరిగి నిలబెట్టుకోవడం పరువు ప్రతిష్టల సమస్యగా ఫీలవుతున్నారట పార్టీ రాష్ట్ర పెద్దలు. ప్రతిపక్షాల ఎత్తులు ఎలాఉన్నా… అధికార పక్షం తన సీటును తాను కాపాడుకోవాల్సిన అనివార్యమైన పరిస్థితి. అందుకే ముఖ్య నాయకులకు బాధ్యతలను అప్పగించింది పార్టీ. గెలుపు ఓటములకు ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులను బాధ్యుల్ని చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్సీ ఎన్నికలు సవాల్‌గా మారాయట. దీన్ని వాళ్ళ పనితీరుకు గీటురాయిగా మార్చిందట కాంగ్రెస్ అధినాయకత్వం. ఎమ్మెల్సీ ని గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలతో పాటు మంత్రులకు పూర్తిస్థాయిలో కట్టబెట్టింది కాంగ్రెస్. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం తోపాటు అన్ని వ్యవహారాలను స్థానిక నాయకులకు అప్పగించింది. దీంతో… ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు తేడాగా ఉంటే ఆయా జిల్లాల ఎమ్మెల్యేలతో పాటు మంత్రులకు కూడా గడ్డు రోజులు తప్పవన్న ఇండికేషన్ కూడా పంపినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీని ప్రయారిటీగా తీసుకుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఆ తరహా ఓటర్లే ఎక్కువ. అందుకే…. పార్టీని గెలిపించుకోవడం ప్రతిష్టాత్మకంగా మారిందని అంటున్నారు.
దీంతో ఫలితాలు ఎక్కడ తేడా వచ్చినా… స్థానిక ప్రజాప్రతినిధులకు పనిష్మెంట్ తప్పేలా కనిపించట్లేదన్నది కాంగ్రెస్ ఇన్నర్ వాయిస్. ఈ లెక్కన చూస్తే… ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాల్సిన అనివార్యత స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లాలకు చెందిన మంత్రులదేనని అంటున్నారు. ఈ లెక్కన చూసుకుంటే… ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. పక్కన ఉన్న నిజామాబాద్ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సొంత జిల్లా. ఆదిలాబాద్ జిల్లాకు ప్రస్తుతం అన్నీ తానై చూస్తున్నారు మరో మంత్రి సీతక్క. ఆమెకు కూడా ఇది పెద్ద సవాలేనని అంటున్నారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో కొండా సురేఖ, దామోదర రాజనర్సింహలకు బాధ్యతలను అప్పగించింది పార్టీ. అయితే రాజనర్సింహ తన నియోజకవర్గం వరకు వ్యవహారాన్ని చక్కబెట్టుకునే పనిలో ఉన్నట్టు సమాచారం. జిల్లా ఇన్చార్జి మంత్రి కొండ సురేఖ మిగిలిన నియోజకవర్గాలను పర్యవేక్షిస్తున్నారట. దీన్నిబట్టి పార్టీ అధిష్టానం కచ్చితంగా మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుకు ఎమ్మెల్సీ ఎన్నికల్నే గీటురాయిగా చూస్తుందనేది ఓపెన్ టాక్. ఒక సీనియర్ నేత ఇటీవలనే ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇదే అంశాన్ని కాస్త కటువుగానే చెప్పారట. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక కూడా… కొంతమంది నేతలు అంటీముట్టనట్టు వ్యవహరించినట్టు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చిందట. దీంతో ఎవరు ఎక్కడ పనిచేయలేదన్న క్లారిటీ ప్రభుత్వానికి వస్తుందట. వీటన్నిటి ఆధారంగా పార్టీ నాయకత్వం ఫలితాల తర్వాత కఠినంగానే వ్యవహరించాలని భావిస్తున్నట్టు తెలిసింది. రెడ్ జోన్‌లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికల్లో కష్టపడి పనిచేసి గ్రీన్ జోన్‌లోకి వెళ్తారా లేదా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.