ఆ ఉమ్మడి జిల్లాలో పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి దక్కుతున్నాయా? మిగతా వాళ్ళంతా నారాజ్‌గా ఉన్నారా? ఏం… మేం పనికిరామా? మాకా అర్హతలు లేవా? అంటూ భగ్గుమంటున్నారా? కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఏ జిల్లాలో గుర్రుగా ఉన్నారు బీసీలు? ఎందుకు అలాంటి పరిస్థితులు వచ్చాయి? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పదవుల పందేరం విషయమై కుల సమీకరణల బ్యాలెన్స్ తప్పుతోందన్న టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అన్ని వర్గాలు కలిసి పనిచేసినా…. సర్కార్ ఏర్పాటయ్యాక కేవలం రెడ్లకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న అసంతృప్తి మిగతా వర్గాల్లో పెరుగుతోందట. మెజార్టీ నియోజక వర్గాల్లో బీసీ ఓటర్లదే సింహభాగం అయినా….. గెలుపు ఓటముల నిర్ణేతలు వారే అయినా పట్టించుకోవడం లేదంటూ…లెక్కలతో సహా తెరపైకి తెస్తూ….మాకేం తక్కువ అని ప్రశ్నిస్తున్నారట బీసీ నాయకులు. అలాగే ఇప్పటికంటే గత ప్రభుత్వంలో ఏయే వర్గాలకు ఎలాంటి ప్రాధాన్యం దక్కిందో గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డాక జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు పొందిన వారంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో…. ఏం… మాకేం పదవులు రావా ….. వాళ్ళకంటే మేమేం తక్కువ? బీసీలంటే అంత చిన్న చూపా అంటూ స్వరం పెంచుతున్నారట ఆయా నియోజకవర్గాల్లోని వెనుకబడిన తరగతుల నాయకులు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి వనపర్తి కి చెందిన మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డికి దక్కింది. స్పోర్ట్స్ అథారిటి చైర్మన్ పదవిని వనపర్తికే చెందిన శివసేనా రెడ్డికి కట్టబెట్టారు . ఇక కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డికి పోలీస్ హౌసింగ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పదవి దక్కింది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి ఢిల్లీలో ప్రభుత్వ సలహాదారు పదవి దక్కింది. వీటితో పాటు జిల్లా స్థాయిలో వివిధ కీలక నామినేటెడ్ పదవులను కూడా రెడ్డి వర్గానికే కట్టబెట్టి…. మిగతా వాళ్ళని మాత్రం కేవలం ఓట్ బ్యాంక్‌గానే వాడుకుంటున్నారంటూ మండిపడుతున్నాయి బీసీ సంఘాలు. ఇక ఇదే సమయంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజక వర్గాలుండగా ….. రెండు రిజర్వ్‌డ్.
మిగిలిన 12 సెగ్మెంట్స్‌లో బీసీలు ఇద్దరు మాత్రమే. 10 స్థానాల్లో ఓసీ ఎమ్మెల్యేలే కొనసాగుతున్నారని, కానీ… అక్కడ ఓటర్లు మాత్రం సింహభాగం బీసీలేనని గుర్తు చేస్తూ అదే విషయాన్ని చర్చకు పెడుతున్నారు నామినేటెడ్ పదవుల ఆశావహులు. ఇక లోక్‌సభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టిక్కెట్లు రెడ్లకే కేటాయించిన సంగతిని ప్రస్తావిస్తున్నారు. ఈ చర్చ ఇలా జరుగుతుండగానే… దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డికి మహిళా, శిశు సంక్షేమ కమిషన్ ఛైర్‌పర్సన్ పదవి ఇస్తారన్న ప్రచారం మొదలైంది. దీంతో ఆ పాయింట్‌ని కూడా ప్రస్తావిస్తున్నారు బీసీ నేతలు. పార్టీకోసం కష్టపడి పనిచేసిన బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఎంతో మంది ఉండగా …. కేవలం అగ్రవర్ణాల వారినే నామినేటెడ్ పదవులు వెతుక్కుంటూ రావడం ఏంటో అర్ధం కావడం లేదని సెటైరికల్‌గా అంటున్నారు కొందరు. మేం పల్లకి మోసేందుకు తప్ప, కూర్చునేందుకు అర్హులం కామా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనాభా శాతానికి తగ్గట్లు పదవుల్లో న్యాయమైన వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వివిధ వర్గాలకు దక్కిన ప్రాధాన్యతను గుర్తు చేస్తుండటం కాంగ్రెస్ పెద్దలకు ఇబ్బందిగా మారినట్టు తెలుస్తోంది. సరే… జరిగిందేదో జరిగిపోయింది… ఇప్పటికైనా గుర్తించి భర్తీ చేయబోయే పదవుల్లోనైనా బీసీలకు న్యాయం చేయమని కోరుతున్నారు పాలమూరు నేతలు. ఇదే సమయంలో ఇంకో మాట కూడా వినిపిస్తోంది. సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్ అన్నట్టుగా…. బీసీ కోటాలో జిల్లా నుంచి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరికి మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా పెదవి విరుస్తున్నారు బీసీ లీడర్స్. ఆయన ఒక్కడికి మంత్రి పదవి ఇస్తే… ఉమ్మడి జిల్లాలోని బీసీలందరికీ న్యాయం చేసినట్టేనా? ఆయనతో పాటు జిల్లా స్థాయి నామినేటెడ్ పదవుల్ని మిగతా నేతలకు ఇచ్చినప్పుడే న్యాయం జరుగుతుందని అంటున్నారు. సర్కార్ పెద్దలు ఏ మేరకు న్యాయం చేస్తారో చూడాలి.