Off The Record: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు జాతీయ స్థాయిలో కీలక పదవులు దక్కబోతున్నాయా? రాష్ట్రంలోని అసంతృప్క నేతలందర్నీ బుజ్జగించే ప్రోగ్రామ్ మొదలైందా? ఏఐసీసీ లిస్ట్‌లో ఉన్న రాష్ట్ర నాయకులు ఎవరెవరు? వాళ్ళకు దక్కబోయే పదవులేంటి?
తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్ పదవి ఆశించిన నాయకులను అధిష్టానం ఎలా బుజ్జగించబోతోంది? ఎలాంటి పదవులు ఇవ్వబోతోందన్న చర్చ జోరుగా జరుగుతోంది పార్టీ వర్గాల్లో. పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ.. పీసీసీ అధ్యక్ష పదవి కోసం ఆఖరు నిమిషం వరకు ప్రయత్నించారు. కానీ…కొన్ని ప్రత్యేక కారణాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్‌ను వరించింది ఆ పదవి. ఇక మహేష్ గౌడ్ బాధ్యతలు తీసుకున్నాక… ఇప్పటి వరకు ఇద్దరూ భేటీ అయిన సందర్భం లేదు. ఇన్నాళ్లు అమెరికాలో ఉన్న యాష్కి ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు. అమెరికాలో ఉన్నా, హైదరాబాద్ వచ్చినా…పీసీసీ పదవి రాలేదన్న అసంతృప్తి మాత్రం ఆయనలో ఉందని అంటున్నారు సన్నిహితులు. అయితే ఇదే సమయంలో మరో చర్చా జరుగుతోంది. త్వరలో ఏఐసీసీ పదవుల భర్తీ జరుగుతుందని అంటున్నారు. రాష్ట్ర కోటాలో ఆ పోస్ట్‌లు ఎవరికి దక్కే అవకాశం ఉందని కూడా మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు.
మాజీ ఎమ్మెల్యే సంపత్‌ను ఇప్పటికే ఏఐసిసి కార్యదర్శి హోదాలో చత్తీస్‌గఢ్‌కు పంపింది అధిష్టానం. అలాగే మధు యాష్కికి కూడా కీలక బాధ్యతలు అప్పగించవచ్చంటున్నారు. ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయనకు ఒడిశా కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. యాష్కితో పాటు మరి కొంతమంది నేతలు కూడా ఏఐసీసీలో పదవుస కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కమ్మ సామాజిక వర్గం నుంచి జెట్టి కుసుమ కుమార్‌కు ఏఐసీసీ కార్యదర్శి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే సీనియర్ నేత వి.హనుమంతరావుని కూడా జాతీయ రాజకీయాల్లోకి తీసుకునే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన్ని ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడిని చేయవచ్చంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా వీహెచ్‌కు ఈ మేరకు హామీ ఇచ్చినట్టు సమాచారం. గడిచిన కొన్నేళ్ల నుంచి ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనతో హనుమంతరావు ఉన్నారుగానీ… ఆయనకి టికెట్ ఇచ్చే విషయంలో మాత్రం పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అందుకే ఆయనకు ఎలాగైనా జాతీయ పదవి ఇప్పించాలన్న ఆలోచనతో ఉన్నారట సీఎం.
ఓవైపు రాహుల్ గాంధీ కూడా బీసీల కుల గణన, బీసీల రిజర్వేషన్ లాంటి అంశాలను ప్రస్తావిస్తున్న క్రమంలో ఓబీసీ సెల్ అధ్యక్షుడిగా ఉండటం కూడా గౌరవప్రదమనే ఆలోచనతో వీహెచ్ ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. రాష్ట్ర పార్టీలో గాని, ప్రభుత్వంలో గాని పదవులు ఆశించి, దక్కని సీనియర్స్‌కు జాతీయ పార్టీలో అవకాశాలు కల్పించి సంతృప్తి పరచాలన్న ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే పిసిసి పదవి రేసులో ఉన్న సంపత్ ను ఏఐసిసి కార్యదర్శిగా చత్తీస్‌గఢ్‌కు పంపారట. ఈ క్రమంలో ఇప్పుడు మధుయాష్కిని కూడా అనుకుంటున్నట్టుగా ఒడిశా ఇన్ఛార్జ్‌గా పంపుతారా? లేక మరో కీలక పదవి ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూస్తే… రాష్ట్రంలో అసంతృప్త నేతలందరికీ…జాతీయ స్థాయిలో ఏదో ఒక పదవి ఇచ్చి సంతృప్తి పరిచే ప్రయత్నంలో ఉన్నారట కాంగ్రెస్ పెద్దలు.