Off The Record: అది పేరుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు. కానీ… తీరు మాత్రం అసెంబ్లీ ఎన్నికల రేంజ్‌లో ఉందట. ఎప్పుడో వచ్చే మార్చిలో ఖాళీ అయ్యే సీటు కోసం ఇప్పట్నుంచే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ కసరత్తు మొదలు పెట్టాయంటేనే దాని రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇంతకీ ఏదా ఎమ్మెల్సీ?
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వచ్చే మార్చిలో ఖాళీ అవబోతోంది. దీంతో ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఆశావహులు అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టారు. మూడు ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పొలిటికల్ హీట్ ముందుగానే పెరిగిపోతోంది. అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రస్తుతం ఈ సీట్లో ప్రాతినిధ్య వహిస్తున్నారు. అయితే కాంగ్రెస్ సిట్టింగ్‌కే మరోసారి టిక్కెట్ ఇస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉండడం, ఈ గ్రాడ్యుయేట్ సెగ్మెంట్ పరిధిలో కాంగ్రెస్‌కు 25 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు పార్లమెంట్ సభ్యులండడం కలిసి వస్తుందని లెక్కలేసుకుంటున్నారట ఆశావహులు.అందుకే అధికార పార్టీ టికెట్‌కి పోటీ భారీగానే ఉందట. ప్రయివేటు విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఇప్పటికే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. తాను కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నట్టు ప్రకటించేశారు.. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెట్ గా అయినా బరిలో ఉండటం పక్కా అంటున్నారాయన.. అయితే కాంగ్రెస్ కొత్త వారికి అవకాశం ఇస్తుందా? లేక ఎమ్మెల్యేగా, ఎంపీ పోటీ చేసి ఓడిపోయిన జీవన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇస్తుందా..? అనేది హాట్ టాపిక్ అయింది.
ఇక మరో ప్రధాన పార్టీ బిజెపిలోనూ ఆశావాహుల లిస్ట్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గతంలో కంటే ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ స్థానం పరిధిలో… బీజేపీ బలం పుంజుకోవడంతో ఈసారి ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలన్న ప్లాన్‌లో ఉందట. కాషాయ పార్టీకి రాష్ట్రంలో 8మంది ఎంపీలు ఉంటే… అందులో నలుగురు, 8మంది ఎమ్మెల్యేలు ఉంటే… అందులో ఏడుగురు ఈ నాలుగు జిల్లాల పరిధిలోనే ఉన్నారు. అందుకే ఈ ఎమ్మెల్సీ సీటును ప్రతిష్టాత్మకంగా భావిస్తోందట బీజేపీ. ఆ లెక్కలతోనే ఆశావహుల సంఖ్య కూడా పెరుగుతోందని అంటున్నారు. అలాగే టికెట్ ఆశిస్తున్న నేతలు క్షేత్ర స్థాయిలో స్టాంగ్ గా ఉన్న ఆరెస్సెస్, ఏబీవీపీ నేతల చుట్టూ తిరుగుతున్నట్టు తెలిసింది. మరో వైపు పార్టీ లో మొదటి నుంచి పని చేసిన వారికే టికెట్ ఇవ్వాలంటూ చర్చ సైతం మొదలైందట. బీజేపీ నుంచి ప్రధానంగా నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, రాణి రుద్రమ, జగిత్యాల నాయకురాలు భోగా శ్రావణి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అందులో సీనియర్ కాబట్టి ఎండలకు, లేదంటే… బలమైన సామాజిక వర్గం, జగిత్యాల ఫైట్ తో క్రేజ్ సంపాదించిన భోగా శ్రావణిని పరిగణనలోకి తీసుకోవచ్చంటున్నారు. అటు సిరిసిల్లలో కేటీఆర్ పై పోటీ చేసి ఓడిపోయిన రాణి రుద్రమ కూడా ఓ బడా నేత ద్వారా లాబీయింగ్ చేస్తున్నట్టు ప్రచారం ఉంది. అయితే ఆమె ఇక్కడ నాన్ లోకల్ కావడం మైనస్ కావచ్చంటున్నారు.
ఇక ఇక్కడ నుంచి రెండు సార్లు ప్రాతినిధ్యం వహించిన బిఆర్ఎస్ లోనూ టికెట్ కోసం పోటీ గట్టిగానే ఉందట… గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ మినహా మిగతా రూరల్ ఏరియాలో కార్ పార్టీకి ఎదురు గాలి వీచినా… ఈ నాలుగు జిల్లాల పరిధిలో 15కు పైగా సీట్లు వచ్చాయి. వరుస ఓటములతో నిరాశలో ఉన్న క్యాడర్ కి జోష్ పెంచాలంటే… గ్రాడ్యుయేట్ ఎన్నికను ఉపయోగించుకోవాలన్న పట్టుదలగా ఉందట గులాబీ పార్టీ. అప్పుడే… గెలుపు గుర్రాల వేట మొదలుపెట్టారట బీఆర్‌ఎస్ పెద్దలు. అటు ఉద్యమ కారులకు టిక్కెట్ ఇచ్చి… వారికి సపోర్టుగా ముమ్మర ప్రచారం సాగించే ప్లాన్ సైతం ఉందంటున్నారు. సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ రవీందర్ సింగ్, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్లు బీఆర్‌ఎస్ తరపున ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఇప్పుడు ఓటర్ ఎన్‌రోల్‌మెంట్‌పై దృష్టి పెట్టాయి. విద్యా సంస్థల అధినేత అయితే… తమ సిబ్బందిని రంగంలోకి దింపి మరీ…నమోదు చేయిస్తున్నారట.ఈ క్యాంపెయిన్ ద్వారా ప్రధాన పార్టీల దృష్టిలో పడేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలిసింది. పేరుకు ఇవి ఎమ్మెల్సీ ఎన్నికలు అయినప్పటికీ.. మూడు పార్టీలకు…. అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడంతో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కాకమీదున్న పాలిటిక్స్… మరికొద్దిరోజులు గడిస్తే మరింత రంజుగా మారతాయంటున్నారు నాలుగు జిల్లాల పొలిటికల్ పండిట్స్.