మహానాడు విషయం ఆ టీడీపీ నేతలకు పట్టడం లేదా? స్వయంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలు కూడా వాళ్ళని కదిలించలేకపోతున్నాయా? కడప టీడీపీ నేతలు ఎందుకు అంత తోలు మందంగా ఉన్నారు? ఇంతవరకు కనీసం స్థలాన్ని ఎంపిక చేయకపోవడం వెనక కారణాలేంటి? కడప టీడీపీ లీడర్స్ మనసులో అసలేముంది? తెలుగుదేశం పార్టీ స్థాపించాక మొట్టమొదటిసారి… ఊహించని రీతిలో గత ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించింది టీడీపీ. ఆ ఊపులోనే… ఈసారి మహానాడును కూడా అదే స్థాయిలో నిర్వహించాలని భావిస్తోందట పార్టీ అధిష్టానం. అందులోనూ… వైఎస్ ఫ్యామిలీ అడ్డా, వైసీపీ కంచుకోటగా చెప్పుకునే కడపలో పెట్టాలని డిసైడయ్యారు. జిల్లా పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేసి మహానాడును విజయవంతంగా నిర్వహించాలని ఇప్పటికే సూచించారు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు. అంతవరకు బాగానే ఉన్నా…. ఆచరణలోనే అసలు సమస్య వస్తోందట. మహానాడుకు ఇక సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. కానీ… ఇంత వరకు స్థలం ఎంపిక జరగలేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మంత్రుల బృందం కడపలోమూడు ప్రాంతాలను పరిశీలించి వెళ్ళింది. బస్… అంతే. మేటర్ అక్కడితో ఆగిపోయింది. ఆ మధ్య జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి… మహానాడు నిర్వహణపై కడప పార్లమెంట్ నియోజకవర్గం టిడిపి నేతలతో సమావేశమయ్యారు. ఇప్పటివరకు గుర్తించిన మూడు ప్రాంతాలపై ఆయన సమీక్షించి లిటిగేషన్స్ లేని స్థలాలను ఎంపిక చేయాలని సూచించినా… ఇంతవరకు అడుగు ముందుకు పడటంలేదంటున్నాయి జిల్లా పార్టీ వర్గాలు. మొదట్నుంచి పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు తప్ప… ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి వచ్చిన వారి స్థలాలను ఎట్టి పరిస్థితులలోనూ మహానాడు నిర్వహణకు ఎంపిక చేయవద్దని సూచించించారట చంద్రబాబు. పార్టీ బృందం పరిశీలించిన మూడు స్థలాలకు సంబంధించిన సమగ్ర నివేదిక తనకు పంపమని ఆయన ఆదేశించి వెళ్ళినట్టు సమాచారం. కానీ… ఇంత వరకు ఏ నివేదికకు దిక్కులేదట. స్థానిక ముఖ్య నాయకులు ఆ విషయాన్ని మర్చిపోయినట్టు కనిపిస్తోందని, సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడి ఆదేశాలకే దిక్కులేకుండా పోయిందని కేడర్ ఫ్రస్ట్రేట్ అవుతున్నట్టు తెలుస్తోంది. స్థలం ఎంపిక విషయంలో ఆయన అంత పర్టిక్యులర్‌గా, క్లారిటీగా ఉన్నా… జిల్లా నాయకులు మాత్రం పట్టనట్టుగా ఉండటం ఏంటో అర్ధం కావడంలేదంటోందట కేడర్. గడిచిన పాతికేళ్ళలో ఎన్నడూ లేనివిధంగా… ఉమ్మడి కడప జిల్లాలోఈసారి టీడీపీకి అత్యధిక సీట్లు దక్కాయి. అందుకే… ఆ ఊపును కొనసాగించేలా… ఈసారి మహానాడును ఇక్కడ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారట. అధిష్టానం ఆలోచనలు అలా ఉంటే… జిల్లా లీడర్స్‌లో మాత్రం నీరసం కనిపిస్తోందని గుస్సాగా ఉందట కేడర్.
స్వయంగా చంద్రబాబు దిశా నిర్దేశం చేశాక కూడా ఒక్క అడుగు ముందుకు పడలేదంటే… వాళ్ళ పనితీరు ఎంత మాత్రం ఉందో అర్ధం చేసుకోవచ్చంటున్నారు. జయరాజ్ గార్డెన్, విమానాశ్రయం సమీపంలోని శాటిలైట్ టౌన్‌షిప్, రాజంపేట రోడ్డులోని ఎన్జీవో ప్లాట్స్‌ను టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పరిశీలించారు. అయినాసరే… ఏ విషయంలోనూ క్లారిటీ రాలేదు. ఎందుకయ్యా మరీ… అలా అంటే… అది నీరసమో, నిర్లక్ష్యమో తెలీదుగానీ… కొన్ని కారణాలైతే కనిపిస్తున్నాయంటోంది కేడర్. మహానాడులోపు సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని డిసైడైంది టీడీపీ అధిష్టానం. అందులో భాగంగా కడప జిల్లా టిడిపి అధ్యక్ష పదవికి కూడా ఎన్నిక జరగాల్సి ఉంది. దాని కోసం పార్టీలో తీవ్రమైన పోటీ ఉంది. ఆ క్రమంలోనే… జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన నాయకుడే అన్నీ చూసుకుంటాడులే….. మనం ఇప్పుడే… ఓ… ఎగేసుకు తిరిగి గుడ్డలు చింపుకోవడం ఎందునట్టుగా ఉంటున్నారట కొందరు నాయకులు. ఆకారణంగానే… మహానాడు మా బిడ్డ కాదన్నట్టుగా ఉంటున్నట్టు చెప్పుకుంటున్నారు. వాళ్ల సంగతి సరే…. పోనీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినా… చొరవ తీసుకుంటున్నారా అంటే… అదీ లేదట. నాయకుల్ని సమన్వయపరిచి అడుగు ముందుకేయాల్సిన మంత్రి సవిత కూడా నాకెందుకులే అన్నట్టుగా ఉంటున్నారట. దీంతో ప్రతిపక్ష నేత అడ్డాలో… ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న మహానాడు పనుల్ని సొంత పార్టీ నేతలే నీరుగారుస్తున్నారన్న గుసగుసలు మొదలయ్యాయి జిల్లాలో. అధ్యక్ష ఎన్నిక తర్వాతే రంగంలోకి దిగాలన్న వైఖరే అన్ని సమస్యలకు మూలం అన్న మాటలు వినిపిస్తున్నాయి. సరే… ఎవరి ఆశలు, అంచనాలు వారికి ఉంటాయని అనుకున్నా… కనీసం స్వయంగా పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాటకైనా విలువ ఇవ్వాలి కదా అన్నది కార్యకర్తల మాట. మహానాడు విషయంలో జిల్లా పార్టీ నేతలు ఏవిధంగా ముందుకు వెళ్తారో చూడాలి మరి.