NTV Telugu Site icon

Off The Record : టీడీపీ లీడర్స్ ఆ వైసీపీ నేతకు లోలోపల థాంక్స్ చెప్పుకుంటున్నారా.?

Otr Over Jogi Ramesh

Otr Over Jogi Ramesh

ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఆ టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి వైసీపీ మాజీ మంత్రికి లోలోపల థాంక్స్‌ చెప్పుకుంటున్నారట. నీ చేష్టలు, చర్యలే ఇవాళ మమ్మల్ని ఒడ్డున పడేశాయి, ఎంత మంచివాడవు అనుకుంటున్నారట. అదేంటీ… టీడీపీ లీడర్స్‌ వైసీపీకీ నాయకుడికి ధాంక్స్‌ చెప్పడమేంటి? ఆయన వాళ్ళకు చేసిన అంత మేలేంటి అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్‌. లెట్స్‌ వాచ్‌. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో 13 చోట్ల తెలుగుదేశం, రెండు సీట్లలో బీజేపీ, ఒక నియోజకవర్గంలో జనసేన గెలిచాయి. 2019 ఎన్నికల్లో 14 చోట్ల వైసీపీ విజయం సాధించగా రెండు సెగ్మెంట్స్ మాత్రమే టీడీపీకి దక్కాయి.

కానీ… ఐదేళ్ళు గడితేసరికి సీన్‌ మారిపోయి జిల్లాను క్లీన్‌ స్వీప్‌ చేసేసింది కూటమి. ఈ క్రమంలో ఓ ఇద్దరు అదృష్టవంతుల గురించి చర్చ జరుగుతోంది జిల్లా రాజకీయ వర్గాల్లో. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి కొలుసు పార్థసారథి ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి జంపై టిక్కెట్స్‌ దక్కించుకుని గెలిచారు. తాము పార్టీ మారడం వల్లే గెలవగలిగామని, అలా మారడానికి ప్రధాన కారణం మాజీ మంత్రి జోగి రమేషేనన్నది వాళ్ళ అంతరంగంగా తెలిసింది. ఆయన పెట్టిన ఇబ్బందుల కారణంగానే వైసీపీ వీడాల్సి వచ్చిందని, ఆ రూపంలో మా నెత్తిన పాలు పోశావంటూ వెటకారంగా థాంక్యూ జోగీ అంటున్నారన్నది లోకల్‌ టాక్‌. వసంత కృష్ణప్రసాద్ 2019లో వైసీపీ తరపున మైలవరంలో మొదటిసారి గెలిచారు. 2014లో ఇక్కడ నుంచి జోగి రమేష్ పోటీ చేసి ఓడిపోవడంతో… ఆయన్ని పెడనకు పంపి ఆ సీటు వసంతకు కేటాయించింది వైసీపీ అధిష్టానం. జోగి స్వస్థలం ఇబ్రహీంపట్నం కావడం, అది మైలవరం సెగ్మెంట్‌లో ఉండటంతో… ఇక్కడ ఆయనకు వర్గం ఉంది. దాంతో 2019లో పెడన నుంచి గెలిచి మంత్రైన తర్వాత నుంచి జోగి మైలవరం వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకునేవారట.

స్థానికంగా ఉన్న ఆయన వర్గం కార్యకర్తలు వివిధ రూపాల్లో ఎమ్మెల్యే వసంతను టార్గెట్‌ చేసుకుని సోషల్ మీడియా పోస్ట్‌లతో ఇబ్బంది పెట్టారన్నది ఆయన వర్గం ఆరోపణ. ఈసారి అసలు వసంతకు టికెట్ కూడా ఇవ్వరన్న ప్రచారంతోపాటు… నియోజకవర్గంలో జోగి మితిమీరిన జోక్యం సెగలు రేపింది. స్వయంగా జగన్‌ జోక్యం చేసుకున్నా… ఈ వివాదం సెటిల్‌ కాలేదు. దీంతో విసుగెత్తిపోయిన వసంత కృష్ణప్రసాద్‌ వైసీపీని వీడి టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. జోగితో గొడవలు రాకుండా అలాగే వైసీపీతో ఉండి ఉంటే… ఇప్పుడు ఓటమి తప్పేది కాదని, అందుకే మాజీ మంత్రికి థ్యాంక్స్‌ అంటూ సెటైరికల్‌గా అంటున్నారట వసంత అనుచరులు. జోగి తీరు వల్ల ఇబ్బందిపడినా చివరకు వసంతకు మంచే జరిగిందన్నది వాళ్ళ అభిప్రాయంగా తెలిసింది. ఇక పెనమలూరు నుంచి 2019లో గెలిచిన కొలుసు పార్థసారధి ఈసారి నూజివీడు నుంచి టీడీపీ తరపున గెలిచి కేబినెట్‌ మంత్రి అయ్యారు. 2014లో సారధిని వైసీపీ అధిష్టానం బందరు ఎంపీ అభ్యర్ధిగా పంపింది. అప్పట్లో ఓడిపోయారాయన. ఇక 2019లో పెనమలూరు నుంచి గెలిచిన సారధి బీసీ కోటాలో మంత్రి పదవి ఆశించారట. అయితే ఆయనకు ఇవ్వకుండా జోగి రమేష్‌ వైపు మొగ్గింది వైసీపీ అధిష్టానం. సీనియర్‌ని అయిన తనకు ఇవ్వరా…. అంటూ మనస్తాపానికిగురైన సారథి తనకు అవమానం జరిగిందంటూ సామాజిక బస్సు యాత్రలోనే పార్టీకి ఝలక్ ఇచ్చి టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. అలాగే ఈసారి పెనమలూరు నుంచి కాకుండా గన్నవరం నుంచి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం చెప్పటంతో… ఆ వ్యవహారాలతో విసిగిపోయి టీడీపీలో చేరారు పార్థసారధి. చివరికి పెనమలూరు టికెట్ ఇస్తామన్నా వద్దని టీడీపీలో చేరి గెలిచి మంత్రయ్యారు. అటు సారధి వెళ్ళాల్సిన పెనమలూరు నుంచి జోగి రమేష్ పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఇక్కడ కూడా జోగి వల్లే సారధికి మంచి జరిగిందంటూ థాంక్స్‌ జోగీ అంటోందట ఆయన వర్గం. మొత్తంగా పార్టీ మారిన ఇద్దరు నాయకులు నీవల్లే… నీవల్లే అంటూ జోగిని గుర్తు చేసుకుంటున్నారని, ఆయన చెడు చేయాలనుకున్నా…వాళ్ళకు మంచే జరిగిందన్నది లోకల్‌ టాక్‌.