మూసీ సుందరీకరణ రాజకీయం ఎటు పోతోంది? పొలిటికల్ వార్‌లో పైచేయి కోసం అధికార, ప్రతిపక్షాలు అనుసరించబోతున్న వ్యూహాలేంటి? వేస్తున్న కొత్త ఎత్తులేంటి? కాంగ్రెస్ రివర్స్ అటాక్‌తో ముందు డిఫెన్స్‌లో పడ్డట్టు కనిపించిన బీఆర్‌ఎస్ ఇప్పుడు వేస్తున్న కొత్త ఎత్తు ఏంటి? ఏ రూపంలో జనంలోకి వెళ్ళాలనుకుంటోంది? మూసీ సుందరీకరణ అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. హైదరాబాద్ నగరం నడి బొడ్డున పారుతున్న ఒకప్పటి మంచి నీటి నది ఇప్పుడు మురికి కూపంగా మారిపోయింది. సిటీ డ్రైనేజీ కలిసిపోయి…దుర్గంధ భరితంగా మారింది. దీన్ని మార్చే ప్రయత్నం దశాబ్దాల క్రితమే మొదలైనా… ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెక్కు అన్నట్టుగా మారిపోయి… ఎప్పటికప్పుడు పొలిటికల్ అజెండా అవుతోంది మూసీ. ఈ క్రమంలోనే మరోసారి మూసీ సుందరీకరణ నినాదం అందుకున్న రేవంత్‌రెడ్డి సర్కార్…. ఆ దిశగా సీరియస్‌గా అడుగులేస్తోంది. పరీవాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలు కొన్నిటిని కూల్చేసింది హైడ్రా. ఆ కార్యక్రమం నడుస్తున్న క్రమంలోనే తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కావాల్సినంత పొలిటికల్ కలర్ పులుముకుంటోంది వ్యవహారం. ప్రతిపక్షం బీఆర్‌ఎస్ ఈ ఎపిసోడ్‌లోకి ఎంటరై…బాధితులకు బాసటగా నిలుస్తామంటోంది. అలాగే తెలంగాణ భవన్ బాట పట్టారు కొందరు బాధితులు. ఇదే సమయంలో రివర్స్ అటాక్ మొదలుపెట్టిన కాంగ్రెస్… అసలు ఈ ప్రతిపాదనలన్నీ గతంలో బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో ఉన్నవేనని, ఇది దానికి కొనసాగింపు తప్ప మరోది కాదని చెబుతోంది. మీరు పవర్‌లో ఉంటే ఒకలాగా, ప్రతిపక్షంలో ఉంటే మరోలాగా మాట్లాడతారా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది కాంగ్రెస్. దీంతో ముందు డిఫెన్స్‌లో పడ్డట్టు కనిపించిన బీఆర్‌ఎస్ వెంటనే తేరుకుని… అధికారపక్షం ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతోందట.
మూసీ ప్రక్షాళన కోసం తాము అధికారంలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నది వాస్తవమేనని, కానీ… అప్పుడు తీసుకున్న నిర్ణయాలేంటి? ఇప్పుడు జరుగుతున్నదేంటి అన్న విషయాలను జనంలోనే చర్చకు పెట్టాలనుకుంటున్నట్టు తెలిసింది. ఇందుకోసం ఒకటి రెండు రోజుల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తోందట ప్రతిపక్షం. తాము 16 వేల కోట్లతో మూసీ ప్రాజెక్టుని చేపట్టాలనుకున్నామని, ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు దానికి అస్సలు పొంతనే లేదన్నది బీఆర్‌ఎస్ వాదన. తాము మొదటి దశలో భాగంగా నాలుగు వేల కోట్లతో ఎస్టీపీల నిర్మాణం మొదలు పెట్టామంటోంది గులాబీ పార్టీ. మొత్తం 30 ఎస్టీపీలతో డ్రైనేజి వాటర్ మొత్తం శుద్ధి అవుతుందని, అవన్నీ పూర్తయితే…మూసీలోకి అస్సలు మురికి నీళ్లు వచ్చే అవకాశం లేదన్నది గులాబీ వాదన. ఓవైపు మురికి నీళ్లను ఎలా శుభ్రం చేయాలనుకున్నామో చెబుతూనే…మరోవైపు ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలనుకుంటున్నారట బీఆర్ఎస్ లీడర్స్. తాము అనుకున్న 16వేల కోట్ల ప్రాజెక్ట్ ఎక్కడ? కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న లక్షన్నర కోట్ల ప్రాజెక్ట్ ఎక్కడ అన్నది బీఆర్‌ఎస్ క్వశ్చన్. మూసీ ప్రక్షాళనకు అసలు అంత బడ్జెట్ అవసరమేలేదని అంటున్నారు ప్రతిపక్ష నేతలు. నమామి గంగ ప్రాజెక్టులో భాగంగా గంగా నది పునరుజ్జీవం, సుందరీకరణ కోసం కిలోమీటర్‌కు 17 కోట్లు ఖర్చు చేస్తే.. ఇక్కడ మూసీ ప్రాజెక్టులో కిలోమీటర్‌కు 2వేల 700 కోట్లు ఎందుకని అడుగుతున్నారు ప్రతిపక్ష నేతలు. అసలు పేదలకు నష్టం జరక్కుండా మూసీని ఎలా ప్రక్షాళన చేయవచ్చో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ మేం వివరిస్తామన్నది గులాబీ పార్టీ పెద్దల మాట. ఒకటి రెండు రోజుల్లో మూసీ నిర్వాసితుల దగ్గరకు తాము వెళ్లాడమా, లేక వారినే తెలంగాణ భవన్‌కు పిలిపించి ప్రెజెంటేషన్ ఇవ్వడమా అన్నది తేలిపోతుందంటున్నాయి పార్టీ వర్గాలు. గతంలో కాళేశ్వరం దగ్గర ఇచ్చినట్లు గానే మూసీ నదిపై ప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నంలో ఉందట బీఆర్‌ఎస్. మూసీ వార్‌లోఎవరిది పైచేయి అవుతుందో చూడాలి మరి.