NTV Telugu Site icon

Off The Record: ధర్మవరంలో మ్యూట్ మోడ్‌లో బీజేపీ వరదాపురం సూరి

Otr Dharmavaram

Otr Dharmavaram

Off The Record: ఏపీలోని ఆ అసెంబ్లీ నియోజకవర్గం మీద అమిత్‌ షా నుంచి గల్లీ లీడర్‌ దాకా బీజేపీ నేతలంతా ఫోకస్‌ పెట్టారు. ఫ్యాన్‌ మీద పైచేయి కోసం బీజేపీ బెటాలియన్‌ మొత్తం దిగిపోతోంది. కానీ…. అదే పార్టీకి చెందిన ఒక్క ముఖ్య నేత మాత్రం ఆ వైపే చూడ్డం లేదట. పైగా సెగ్మెంట్‌లో గట్టి పట్టున్న నాయకుడు ఆయన. జాతీయ నేతలు వస్తున్నా పట్టించుకోని ఆ నియోజకవర్గ నేత ఎవరు? ఎందుకలా చేస్తున్నారు?

టీడీపీ- బీజేపీ పొత్తు తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కొన్ని చోట్ల ఆసక్తికరంగాను, మరికొన్ని చోట్ల తీవ్ర వివాదాస్పదంగాను మారుతున్నాయి. అలాంటి నియోజకవర్గాల్లో ఒకటి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ సెగ్మెంట్‌. ఇక్కడ దశాబ్దాల పాటు టీడీపీ వర్సెస్‌ కాంగ్రెస్‌గా పోరు నడిచింది. ఆ తర్వాత కాంగ్రెస్‌ ప్లేస్‌లోకి వైసీపీ వచ్చేసింది. కానీ… ఈ విడత ఎన్నికల్లో తొలిసారి బీజేపీ, వైసీపీ మధ్య పోరు యమా ఇంట్రస్టింగ్‌గా జరుగుతోంది. కానీ…అందులో స్థానిక బీజేపీ నేత మిస్‌ అవడం ఇంకా ఆసక్తిరేపుతోంది. ఇన్నాళ్ళు ఢిల్లీ రాజకీయాల్లో మాత్రమే కనిపించే బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో దిగి ధర్మవరం బరిలో నిలిచారు. కానీ… సత్య కుమార్ స్థానంలో ఇక్కడ ఆ పార్టీ తరపున పోటీ చేయాలనుకున్న మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండటం చర్చనీయాంశం అయింది. ధర్మవరంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా పరిటాల శ్రీరామ్ బాధ్యతలు తీసుకున్నారు. దాదాపు నాలుగున్నరేళ్ళ నుంచి ఇక్కడే ఉండి పార్టీ బాధ్యతలు చూస్తున్నారాయన. అటు బీజేపీలో ఉన్న సూర్యనారాయణ చివరి వరకు తమ పార్టీ తరపున తనకు టిక్కెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. పొత్తుల్లో భాగంగా ఆయనకు దాదాపు టికెట్ ఖరారైందన్న ప్రచారం కూడా జరిగింది.

ఇదే సమయంలో మాక్కావాలంటూ…టీడీపీ, జనసేన నుంచి డిమాండ్స్‌ వచ్చాయి. ఆందోళనలు సైతం జరిగాయి. కానీ.. ఒక్కరోజులోనే సీన్ మొత్తం తారుమారైంది. మొత్తం పరిస్థితులన్నీ గమనించిన తర్వాత బిజెపి అధిష్టానం గోనుగుంట్ల సూర్యనారాయణకు కాకుండా ఆ స్థానంలో సత్యకుమార్‌ను దింపింది. వాస్తవానికి హిందూపురం ఎంపీగా పోటీ చేయాలనుకున్నారట సత్యకుమార్. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని ఫిక్సయి బీజేపీకి ఇచ్చేందుకు ససేమిరా అనంతో చివరికి ధర్మవరంను వదులుకోవాల్సి వచ్చిందంటున్నారు. ఫైనల్‌గా లెక్కలు తేలిపోవడంతో…కూటమి ధర్మం ప్రకారం టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ సత్య కుమార్ వెంట తిరుగుతూ మొత్తం నియోజకవర్గంలో అందరికీ పరిచయం చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. కానీ… సొంత పార్టీ నేత అయిన సూరి మాత్రం పత్తా లేకుండా పోవడం చర్చనీయాంశం అయింది. సూర్యనారాయణ ధర్మవరం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది.
కానీ ఆయన నామినేషన్ వేయలేదు. అలాగని ఎవరి తరపున ప్రచారం కూడా చేయడం లేదు. కొన్ని రోజుల నుంచి కంప్లీట్‌ మ్యూట్‌ మోడ్‌లోనే ఉన్నారాయన. మరో వ్తెపు సత్య కుమార్ గెలుపు కోసం బిజెపిలో గల్లీ నుంచి ఢిల్లీ లీడర్ వరకు నేతలు వచ్చి ప్రచారం చేస్తున్నారు. అంత మంది వస్తున్నా… స్థానికంగా పట్టున్న సూరి మాత్రం కూటమి ప్రచారానికి దూరంగా ఉండటం హాట్‌ టాపిక్‌ అయింది. పోలింగ్‌ టైం దగ్గర పడుతోంది. ప్రచారానికి కూడా పెద్దగా టైం లేదు. ఈ పరిస్థితుల్లో వరదాపురం సూరి అలియాస్‌ సూర్య నారాయణ ఏం చేస్తారోనని ఆసక్తిగా గమనిస్తున్నారు పరిశీలకులు. ఆయన కేడర్‌, ముఖ్య అనుచరులు ఎటువైపు ఉంటారన్నది కూడా ఇంట్రస్టింగ్‌ పాయింట్‌ అయింది.