NTV Telugu Site icon

Off The Record: కేటీఆర్‌కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ కొత్త వ్యూహం మొదలు పెట్టిందా..!

Otr Siricilla

Otr Siricilla

Off The Record: సిరిసిల్లలో కేటీఆర్‌కి చెక్‌ పెట్టడానికి కాంగ్రెస్‌ కొత్త వ్యూహాన్ని అమలు చేయబోతోందా? దాడి చేసే అవకాశం ఇవ్వకుండా ఆత్మరక్షణలో పడేయాలని భావిస్తోందా? గతంలో బీఆర్‌ఎస్‌ అనుసరించిన ప్లాన్‌నే రివర్స్‌లో ప్రయోగించాలనుకుంటోందా? ఇంతకీ ఏంటా ప్లాన్‌? సిరిసిల్ల కార్‌ స్పీడ్‌కు బ్రేకులేయడానికి కాంగ్రెస్‌ సంధించాలనుకుంటున్న అస్త్రం ఏంటి?

రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు… ఒక్కోసారి ప్రత్యర్ధుల మీద పైచేయి సాధించడమే తప్ప… పూర్తి అధిపత్యం అన్నది ఎవ్వరికీ ఉండదు. పదేళ్లపాటు తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్‌ఎస్‌ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం మీద పోరాటం మొదలుపెట్టింది. ప్రతిపక్షాన్ని డిఫెన్స్ లోకి నెట్టేందుకు హస్తం పార్టీ నేతలూ తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో అంతా తామై పార్టీని నడిపిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావుకు చెక్‌ పెట్టడంపై దృష్టి పెట్టారట కాంగ్రెస్‌ పెద్దలు. ముందుగా కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లను ఎంచుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. సిరిసిల్లలో కేటీఆర్‌కు వార్‌ వన్‌సైడ్‌ ఏం కాదన్న టాక్‌ ఇప్పటికే నడుస్తోంది.ఈ పరిస్థితుల్లో ఆయనకు దీటుగా నాయకుడిని దింపి ఉక్కిరి బిక్కిరి చేయాలన్నది కాంగ్రెస్‌ ప్లాన్‌గా తెలుస్తోంది. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తరచు సిరిసిల్లో పర్యటిస్తున్నప్పటికీ పార్టీ ఆశించిన ఫలితం రావడం లేదట…అందుకే మేటర్‌ని లోకల్‌గానే డీల్‌ చేయాలన్న ప్లాన్‌లో ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం కేటీఆర్ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కాబట్టి ఆ ప్రకారం ఆయనకు ప్రోటోకాల్‌ ఉంటుంది. దీంతో అంతకు మించిన ప్రోటోకాల్‌తో తమ నేతకు పెద్ద పదవి ఇవ్వాల్సి ఉంటుంది. అందుకోసం ఏం చేయాలి… స్థానికంగా ఎవరిని ఎంచుకోవాలి… సామాజికంగా, రాజకీయంగా ఏయే అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్న మేధోమధనంలో భాగంగా…ప్రతి ఎన్నికలో కేటీఆర్‌ని ఢీ కొడుతూ… ఓడిపోతున్న కేకే మహేందర్‌ రెడ్డే సరైన ఆప్షన్ అనుకున్నారట కాంగ్రెస్‌ పెద్దలు.

వృత్తిరీత్యా న్యాయవాది అయిన కేకే కు సిరిసిల్లలో మంచి పేరే ఉంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఆయనని సిరిసిల్ల నుంచి 2009లో అభ్యర్థిగా అనధికారికంగా ప్రకటించిన బీఆర్‌ఎస్‌… చివరి నిమిషంలో కేటీఆర్‌కు టికెట్ ఇవ్వడంతో స్వతంత్రుడిగా బరిలోకి దిగారు… చివరి వరకు పోరాడి కేవలం 171 ఓట్ల స్వల్ప తేడాతో నాడు కేటీఆర్‌ చేతిలో ఓడిపోయారు కేకే మహేందర్‌రెడ్డి. ఆ ఎన్నికల్లోతృటిలో తప్పించుకున్న కేటీఆర్ ఈ పదిహేనేళ్లలో తిరిగి చూసుకోలేదు… అప్పటి నుంచి కేటీఆర్‌తో మహేందర్‌రెడ్డి తలపడుతున్నా… గెలుపు మాత్రం దక్కలేదు. అయినాసరే… అలుపెరగని పోరాటం చేస్తున్న కేకే కి ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కాస్త ఊరట దక్కింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్‌కి గట్టి పోటీ ఇచ్చారు మహేందర్‌రెడ్డి… తాను ఎంతో అభివృద్ది చేసినా తనకు ఓట్లు తగ్గాయంటూ ఫలితాలను చూసి వాపోయారట కేటీఆర్. సిరిసిల్లలో మహేందర్‌రెడ్డి మీద సానుభూతి ఉండటం, రాజకీయ అనుభవం, సామాజిక వర్గం కలిసి రావడానికి తోడు ఆయనకు కాస్త ప్రోటోకాల్‌ ఇస్తే… ఇక దున్నేస్తారని భావిస్తున్నారట కాంగ్రెస్‌ పెద్దలు. అందుకే…కొద్ది రోజుల్లో శాసనసభ్యుల కోటాలో ఖాళీ అవబోయే ఐదు ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి మహేందర్‌రెడ్డికి రిజర్వ్‌ చేయాలనుకుంటున్నారట. ప్రోటోకాల్ పరంగా పెద్ద పదవిని కట్టబెడితే కేటీఆర్‌కు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నట్టు తెలిసింది.

ఇటీవల భర్తీ చేసిన నామినేటేడ్ పోస్టుల్లోనే అవకాశం దక్కుతుందని అనుకున్నప్పటికీ పార్టీ పెద్దల ప్లాన్ వేరే విధంగా ఉండటంతో ఆయనను పరిగణలోకి తీసుకోలేదట…. కేకే మహేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నట్టు ఇటీవల ఆ జిల్లా నేతలకు సమాచారమిచ్చేసారట పార్టీ పెద్దలు. గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బలమైన ప్రతిపక్ష నేతలపై ప్రయోగించిన అస్త్రాన్నే తిరిగి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పై కాంగ్రెస్ ప్రయోగించబోతోందట. తిరుగే లేదనకున్న నియోజకవర్గంలో ప్రజల్లో తిరగపోతే కష్టం అనే భావన కేటీఆర్‌కి కల్పించడంలో కాంగ్రెస్ సక్సెస్ అవుతుందా…? హస్తం పార్టీ అనుసరించే వ్యూహాన్ని కేటీఆర్ ఎలా ఎదుర్కోబోతున్నారనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది సిరిసిల్లలో.