NTV Telugu Site icon

Off The Record: కేసీఆర్‌ ఎందుకు బయటికి రావడం లేదు..? ఏమైనా మాస్టర్ ప్లాన్ ఉందా..!

Otr Kcr

Otr Kcr

Off The Record: బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఎందుకు బయటికి ఎక్కువగా రావడం లేదు? ఎన్నికల తర్వాత అడపా దడపా మాత్రమే కనిపించడం వెనకున్న అసలు రీజనేంటి? బయట జరుగుతున్న రకరకాల చర్చలకు మించిన మాస్టర్‌ ప్లాన్‌ ఉందా? నన్ను ఓడిస్తే… వెళ్ళి రెస్ట్‌ తీసుకుంటానని గతంలో అన్న మాటల్ని నిజం చేస్తున్నారా? లేక సమయం ఉంది మిత్రమా…. అంత తొందరేల అంటున్నారా? అసలేం జరుగుతోంది?

కేసీఆర్‌…. మాటల మాంత్రికుడు, అంతకు మించి పక్కా పొలిటికల్‌ స్కెచ్‌లు వేయడంలో అపర చాణిక్యుడని ఆయన్ని అభిమానించే వారంతా పిలుచుకుంటారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ మాటల్లో మాయాజాలం తగ్గిందని, ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే… అసలాయన స్వరం వినిపించడమే అరుదైపోయిందని, ఇక ఆయన పొలిటికల్‌ స్కెచ్‌లేవీ పెద్దగా వర్కౌట్‌ అవడం లేదన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ఇదే సమయంలో అసలాయన ఫామ్‌హౌజ్‌లో ఏం చేస్తున్నారంటూ ఆరాలు తీసేవాళ్ళు కూడా పెరిగిపోతున్నారట. అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాదాపుగా ఫామ్‌హౌజ్‌కే పరిమితం అవుతున్నారు కేసీఆర్‌. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా… అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో ఉన్న ఊపు, ఉత్సాహం కనిపించలేదని ఓటమి ఆయన్ని తీవ్రంగా కుంగదీసిందని అంటున్నారు. ఇక ఢిల్లీ లిక్కర్‌ కేసులో కుమార్తె జైలుకు వెళ్ళడం, ఐదున్నర నెలలపాటు ఆమెకు బెయిల్‌ కూడా రాకపోవడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయారన్న మాటలు వినిపిస్తున్నాయి రాజకీయవర్గాల్లో. కవితకు బెయిల్‌ వచ్చాకే కాస్త కుదుటపడ్డట్టు సమాచారం.

ఇక రాజకీయంగా పార్టీ వ్యవహారాల్లో కేటీఆర్‌, హరీష్‌రావు చురుగ్గా తిరుగుతూ అధికార పార్టీని, ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తున్నా… కేసీఆర్‌ మాత్రం స్పందిస్తున్న దాఖలాలు లేవు. దీంతో గతంలో ఆయన అన్న మాటల్ని ఇప్పుడు మరోసారి గుర్తు చేసుకుంటున్నారట కొందరు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2023 అక్టోబర్ 26న అచ్చంపేట బహిరంగ సభలో ఓ కామెంట్‌ చేశారు కేసీఆర్‌. మీరు నన్ను ఓడగొడితే…వెళ్ళి రెస్ట్‌ తీసుకుంటానని అప్పట్లో అన్నారాయన. అన్నట్టుగా ఆ మాటకు కట్టుబడి రెస్ట్‌ మోడ్‌లో ఉన్నారా అని సెటైర్స్‌ వేసే బ్యాచ్‌ కూడా ఉందట. ఇటీవల ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి, వరదలొచ్చి, జనం తీవ్రంగా ఇబ్బందులు పడ్డా కేసీఆర్‌ గడప దాలేదని, బాధితుల్ని పరామర్శించలేదన్న విమర్శలు ఉన్నాయి. అలాగే తమ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆంధ్రా వ్యాఖ్యల మీద కూడా ఆయన బహిరంగంగా స్పందించకపోవడంపై హైదరాబాద్‌లోని సీమాంధ్రుల్లో అసంతృప్తి ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. హైడ్రా కూల్చివేతల విషయమై పార్టీలోని మిగతా నేతలు స్పందిస్తున్నా… అధ్యక్షుడిగా కేసీఆర్‌ ఒక్క స్టేట్‌మెంట్‌ కూడా ఇవ్వకపోవడం ఏంటన్న చర్చ జరుగుతోందట రాజకీయవర్గాల్లో. దీంతో సారు అచ్చంపేటలో అన్న మాటకు కట్టుబడి ఉన్నారా? అన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయట బీఆర్‌ఎస్‌లో. అయితే అదే సమయంలో మరో వాదనా ఉన్నట్టు చెబుతున్నారు.

కేసీఆర్‌ను దగ్గరగా గమనిస్తూ.. ఆయన గురించి తెలిసిన వారు మాత్రం… అంత ఎకసెక్కాలొద్దు… అసలు మేటర్‌ వేరే ఉందని అంటున్నట్టు తెలుస్తోంది. ఆ మధ్య పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఫామ్‌హౌస్‌కు వెళ్ళి కేసిఆర్‌ని కలిసినప్పుడు ఆయన అన్న మాటల్ని గుర్తు చేస్తున్నారు. మనం ఇప్పటికిప్పుడు ఎగేసుకుని పోయి బట్టలు చింపుకోవడం ఎందుకు? ముందు ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరగనీయండని అన్నారట. అదే విషయాన్ని రిపీట్‌ చేస్తూ… కచ్చితంగా కొద్ది రోజుల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుందని కేసీఆర్‌ అంచనా వేస్తున్నారని, ఆ వేడి మీద మనం సుత్తితో కొడితే పదునెక్కుతుందని లెక్కలేస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి కేసీఆర్‌ సన్నిహిత వర్గాలు. దీన్ని బట్టి చూస్తే… బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మరికొంత కాలం ఫామ్‌హౌస్‌లోనే ఉంటారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి రాజకీయ వర్గాలు. అయితే… స్థానిక సంస్థల ఎన్నికల నాటికైనా… బయటికి వస్తారా? లేక పండు పండాలంటూ… లోపలే ఉంటారా అన్న ప్రశ్నకు మాత్రం ఇప్పుడే చెప్పలేమంటున్నాయి బీఆర్‌ఎస్‌ వర్గాలు. మొత్తంగా… కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చేదాకా వేచి ఉండి… అదను చూసి వ్యూహాలకు పదును పెట్టాలన్నది మాజీ సీఎం వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు.