NTV Telugu Site icon

Off The Record: ఒకప్పుడు మేమే కింగులం.. కానీ ఇప్పుడు..!

Otr

Otr

Off The Record: ఒకప్పుడు మేమే కింగ్‌లమని అన్నారు. మా మాటకు ఎదురే లేదంటూ రీ సౌండ్‌ ఇచ్చారు. తీరా.. ఇప్పుడు బయటికి వస్తే డబ్బులు ఖర్చు అనుకుంటూ.. కామ్‌ సినిమా చూస్తున్నారు. అసలే కష్టాల్లో ఉన్నాం… డీజిల్‌ రేట్లు కూడా బాగా పెరిగిపోయాయ్‌… ఇప్పుడెందుకు రా బుజ్జా అన్ని బళ్ళు… అంతా కలిసి ఒక బండిలో సర్దుకోండన్న పాపులర్‌ మూవీ డైలాగ్‌ని గుర్తు చేసుకుంటూ… జాగ్రత్త పడుతున్నారట. ఎవరా లీడర్స్‌? ఏంటి వాళ్ళకు వచ్చిన కష్టం.

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డే లేదన్నట్టుగా విచ్చలవిడిగా హవా నడిపారా నాయకులు. నాటి సీఎం హోదాలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూడా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ఎక్కడికక్కడ లోకల్‌ సీఎంలుగా తమకు ఎదురే లేదన్నట్టు వ్యవహరించారు. కానీ…అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో సీన్ రివర్స్ అయింది. ఓడిపోయిన బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేల్లో చాలా మంది మ్యూట్‌ మోడ్‌ ఆన్‌ చేసుకుని ఇళ్ళలోనే కూర్చుంటున్నారట. ఇద్దరు, ముగ్గురు తప్ప మాజీ ఎమ్మెల్యేలందరిదీ ఇదే తీరని అంటున్నాయి పార్టీ వర్గాలు. ఏం… అలా ఎందుకు? మాజీలందరికీ ఏమైందని అంటే… అధికార పార్టీతో ఇప్పుడే పెట్టుకుని ఇప్పటి నుంచే ఇబ్బందులు పడటం ఎందుకన్నది వాళ్ల ఆలోచన చెప్పుకుంటున్నారు గులాబీ కార్యకర్తలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బలంగా పోరాటం చేయాలిగానీ… వీళ్ళేంటి అధికారం ఉన్నప్పుడు బాగా ఎంజాయ్‌ చేసి.. తీరా కష్టాల్లో ఉన్నప్పుడు ఇలా హ్యాండ్‌ ఇస్తున్నారంటూ ప్రశ్నించుకుంటున్నాయట పార్టీ శ్రేణులు. అయితే అదే సమయంలో మరో వెర్షన్‌ కూడా వినిపిస్తోందట అటువైపు నుంచి. ఇప్పుడే హంగామా చేసి అధికార పార్టీ దృష్టిలో పడటం ఎందుకన్న వైఖరి ఒక కారణం అయితే… అంతకు మించిన ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయట. ధర్నాలు, రాస్తారోకోలు, లేక ఇతర ఆందోళన కార్యక్రమాలంటూ ఇప్పటి నుంచే మొదలు పెడితే… ఖర్చు ఎవరు పెట్టుకుంటారన్నది వాళ్ళ క్వశ్చన్‌ అట.

ఏమీ లేనిదానికి ఇప్పట్నుంచే జేబులకు చిల్లు పెట్టుకోవడం మొదలుపెడితే… అసలు సినిమా ఇంకా చాలానే ఉందని, ఆ టైం వచ్చేసరికి అంతా గుల్లయిపోయి ఎన్నికల ఖర్చులు ఎవరు పెడతారా అని ఎదురు చూడాల్సి వస్తుందని ఎక్కువ మంది భయపడుతున్నట్టు తెలిసింది. అయితే గత ఎన్నికల్లో చాలా మంది అభ్యర్థుల భారాన్ని పార్టీ మోసినా… ఓడిపోయాక వాళ్ళు సైతం ముఖం చాటేస్తున్నారట. ఇటీవల రైతు రుణమాఫీని అందరికీ వర్తింపచేయాలన్న డిమాండ్‌తో అన్ని మండల, నియోజకవర్గాల్లో రైతు ధర్నాలను నిర్వహించింది బీఆర్‌ఎస్‌. నలుగురైదుగురు మాజీ ఎమ్మెల్యేలు తప్ప మిగతా వారంతా ఆ ధర్నాల్లో పాల్గొనలేదు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ సర్ది చెప్పడంతో కొంతమంది తమ అసెంబ్లీనియోజకవర్గాల్లో ధర్నాలు చేశారట. ఇక నుంచి పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం నిర్వహించాలంటే తమపై ఆర్ధిక భారం పడుతుందని మాజీలు భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటి నుంచే ఖర్చులు పెట్టుకుంటూ పోతే ఆర్ధిక కష్టాలు తప్పవని గులాబీ మాజీ ఎమ్మెల్యేల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నట్టు తెలిసింది. అందుకే అధికార పార్టీపై ఇప్పటి నుండే పోరాటంఎందుకనే భావనలో మాజీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఇప్పట్నుంచే ఎందుకు? ఎన్నికలకు రెండేళ్ళ ముందు రీఛార్జ్‌ అయితే చాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఎంతో కొంత వ్యతిరేకత కూడా పెరుగుతుందని, అది తమకు కలిసి వచ్చి పని తేలిక అవుతుందని కూడా భావిస్తున్నారట. ఇంకొంత మంది మాత్రం తమ వ్యాపారాలకు ఇబ్బందులు రాకూడదన్న ఆలోచనతో సైలెంట్‌గా ఉన్నారన్నది గులాబీ వర్గాల ఇంటర్నల్‌ టాక్‌.. ఇలా కారణాలు ఏవైనా, మొత్తంగా గులాబీ మాజీ ఎమ్మెల్యేల్లో సింహ భాగం ప్రస్తుతం యాక్టివిటీస్‌కు దూరంగా ఉంటున్నారు.