Site icon NTV Telugu

Off The Record: బీఆర్‌ఎస్ ఎక్కడ పోగొట్టుకుందో అక్కడే వెతుక్కునే పనిలో పడిందా?

Otr Brs

Otr Brs

Off The Record: బీఆర్‌ఎస్‌ అధిష్టానం ఎక్కడ పోగొట్టుకున్నామో… అక్కడే వెదుక్కునే ప్రయత్నంలో ఉందా? అంటే… ఎక్కడ పోగొట్టుకున్నారో… నిజంగా పార్టీ పెద్దలకు తెలిసి వచ్చిందా? లేక తెలిసిందని అనుకుంటున్నారా? ప్రత్యేకించి ఓ వర్గం ఓటర్లు తమకు ఎందుకు పూర్తిగా దూరం అయ్యారో కనుక్కున్నారా? ఏ విషయంలో బీఆర్‌ఎస్‌ పెద్దలకు జ్ఞానోదయం అయింది? ఇప్పుడు ఏ రూపంలో ప్యాచ్‌ వర్క్‌ మొదలు పెట్టారు?

రాష్ట్రం ఏర్పడ్డాక పదేళ్ల పాటు అధికారంలో ఉండి… ఇక ఇప్పుడప్పుడే తిరుగులేదనుకున్న బీఆర్‌ఎస్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయింది. అది కూడా అలా ఇలా కాదు. గ్రామీణ ప్రాంత ఓటర్లు కారు పార్టీకి వ్యతిరేకంగా కసిగా ఓట్లేశారన్న విశ్లేషణలు గట్టిగానే ఉన్నాయి. దీంతో ముందు దిమ్మ తిరిగిపోయినా… మెల్లిగా కోలుకుంటూ…కారణాలు వెతుక్కునే పనిలో పడింది బీఆర్‌ఎస్‌ అధిష్టానం. అధికారంలో ఉన్నప్పుడు ఏయే వర్గాలు తమకు దూరం అయ్యాయోనని లెక్కలు చూసుకుంటూ… వాటిని సరి చేసుకునే పని మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే గిరిజనుల ఓట్లు తమకు పడలేదని తేలిందట. గిరిజన సామాజికవర్గాల కోసం కొన్ని కార్యక్రమాలు చేసింది బీఆర్‌ఎస్‌ సర్కార్‌. అందులో ముఖ్యమైనది తాండాలకు పంచాయితీలుగా గుర్తింపు. వేరే గ్రామ పంచాయతీల్లో భాగంగా ఉన్న తాండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. ఇది గిరిజనుల దశాబ్దాల కల కాబట్టి ఇక ఆ ఓట్లన్నీ తమకేనని అనుకున్నారట బీఆర్ఎస్‌ పెద్దలు. అలాగే బంజారాభవన్‌లాంటి ప్రత్యేక భవనాలు కట్టించడం, ప్రత్యేక గిరిజన బోర్డ్‌ల ఏర్పాటు, వాటికి ఛైర్మన్స్‌ నియామకం లాంటి కారణాలతో లంబాడా, ఆదివాసీలు కారు గుర్తు మీద నొక్కేస్తారని అనుకున్నారట. కానీ… గులాబీ పెద్దలు అనుకున్నదొక్కటి, వాస్తవంలో జరిగిందొక్కటి. గిరిజనుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కారుకు రివర్స్‌ గేర్‌ పడింది. తెలంగాణలో మొత్తం12 ఎస్టీ రిజర్వ్‌డ్‌ సెగ్మెంట్స్‌ ఉంటే…వాటిలో కేవలం మూడు చోట్ల మాత్రమే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గెలిచారు.

అందుకే పార్టీ పెద్దల్లో అంతర్మధనం మొదలైందట. ఇంత చేసినా గిరిజనులు తమ వైపు ఎందుకు మొగ్గలేదని ఆరా తీస్తున్న క్రమంలో కొన్ని కఠోర వాస్తవాలు బయటపడ్డట్టు సమాచారం. లంబాడీల కోసం తాండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా చేయడం వరకు బాగానే ఉన్నా… వాటి అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని, సొంత డబ్బులు పెట్టి పనులు చేసిన సర్పంచ్‌లకు బిల్స్ క్లియర్ చేయలేదని తేలిందట. ఏదో కంటి తుడుపుగా పంచాయితీలు చేశారు తప్ప… అందులో చిత్తశుద్ధి కనిపించలేదన్న విమర్శలు వచ్చాయి. అదొక అసంతృప్తి కాదా… అంతకు మించిన వ్యవహారం మరోటి ఉందట. దళిత వర్గాల కోసం కేసీఆర్‌ సర్కార్‌ దళిత బంధు పథకం తీసుకువచ్చింది. కానీ… ఎస్టీల కోసం అలాంటి పథకం ఏదీ అమలు చేయలేదని, మేమంటే అంత లెక్కలేనితనమా అన్న అసంతృప్తి సైతం ఆ వర్గాల్లో ఉందట. బీఆర్‌ఎస్‌ మీద గిరిజనుల కోపానికి ఇలాంటి పెద్ద కారణాలే ఉన్నట్టు పార్టీ పోస్ట్‌మార్టంలో తేలిందట. అందుకే… ఇక ఎలాగైనా ఆ వర్గాన్ని దగ్గర చేసుకోవాలన్న టార్గెట్‌తో ప్యాచప్‌ వర్క్‌ మొదలుపెట్టినట్టు తెలిసింది. ఏం చేయాలా అని ఎదురు చూస్తున్న టైంలో లగచర్ల ఘటన జరిగిందని, వెంటనే దాన్ని అందిపుచ్చుకున్నట్టు చెబుతున్నాయి గులాబీ వర్గాలు. లగచర్ల ఎపిసోడ్‌లో గిరిజనుల మీదనే కేస్ లు పెట్టారని, వాటిని వెంటనే ఎత్తి వేయాలంటూ ఆందోళన మొదలుపెట్టింది బీఆర్‌ఎస్‌. నమ్మకం కలిగించేందుకే గిరిజనుల్ని, వారి నాయకుల్ని ఢిల్లీదాకా తీలుకువెళ్ళినట్టు చెప్పుకుంటున్నారు. అటు ఢిల్లీ స్థాయిలో కొట్లాడడమే కాకుండా…ఇటు హైదరాబాద్‌లో కూడా మహా ధర్నాకు ప్లాన్‌ చేస్తోందట బీఆర్‌ఎస్‌. లగచర్ల ఎపిసోడ్‌ని బేస్‌ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో వీలైనంత ఎక్కువగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ఇలా… మొత్తంగా తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కీలక పాత్ర పోషించే ఎస్టీ నియోజకవర్గాల్లో తిరిగి పుంజుకోవాలన్నది గులాబీ అధిష్టానం ప్లాన్‌గా చెబుతున్నారు. వాళ్ల ప్రయత్నం వరకు ఓకేగాని, ఎంతవరకు వర్కౌట్‌ అవుతాయన్నది ఇప్పుడే చెప్పలేమంటున్నాయి రాజకీయ వర్గాలు.

 

 

Exit mobile version