అరెస్ట్ ఖాయమని ఆయన భావించారు. పార్టీ నేతలు జైలుకెళ్లడం గ్యారెంటీ అనుకున్నారు. ఆ నేత కూడా అదిగో అరెస్టు…ఇదిగో అరెస్టు అంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఆయన అరెస్టును అధికార పార్టీలో అడ్డుకుంటున్నదెవరు ? ప్రభుత్వం సైలెంట్ అవడానికి కారణాలేంటి ? ఎవరు బ్రేకులు వేస్తున్నారు ? తెర వెనుక జరుగుతున్న తతంగం ఏంటి ? తెలంగాణ రాజకీయాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఫార్ములా-ఈ రేసింగ్ కేసులో ఒకసారి విచారణకు వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..,తనని అరెస్టు చేయడానికి అంతా రంగం సిద్ధం చేసుకున్నారని కామెంట్ చేశారు. అరెస్టయితే జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని…జిమ్ చేసుకుంటానన్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు ముందు కూడా తనను అరెస్టు చేస్తారంటూ ప్రకటించారు. తాజాగా హెచ్‌సీయూ భూముల విషయంలోనూ గట్టిగా మాట్లాడుతున్నందున జైలుకు పంపుతారని కామెంట్ చేశారు. ఇలా ఎప్పటికపుడు అరెస్టు ఖాయమని…కేడీఆర్ కూడా డిసైడ్ అయిపోయారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం కేటీఆర్ అరెస్టుని ఆపుతున్నది ఎవరు..? అని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న విచారణ సంస్థలు ఆపుతున్నాయని అనిపిస్తోంది. కానీ అధికార పార్టీలోనే దీనిపై రకరకాల చర్చ జరుగుతోంది. ఫార్ములా-ఈ కారు రేసు కేసులో ఏసీబీ కేసు నమోదు చేసి విచారణను కొనసాగిస్తోంది. నెలలుగా ఈ వ్యవహారం నడుస్తూనే ఉంది. రేసు నిర్వహణకు సంబంధించిన ఏజెన్సీని కూడా విచారించింది. ప్రభుత్వ సొమ్మును కేటీఆర్..అక్రమంగా విదేశాలకు తరలించారనేది విచారణలో కీలక అంశం.
ఇదే అంశంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా కేసు నమోదు చేసింది. కానీ ఇప్పటి వరకు ఈ కేసులో ఎలాంటి చర్యలు లేవని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ప్రశ్నిస్తున్నారు. భిన్న రకాల వాదనలను ఆయన తెరమీదకి తెస్తున్నారు. తమ ప్రభుత్వం నమోదు చేసిన కేసులో…కేటీఆర్ అరెస్టు ఎందుకు ఆగిందనేది ఆయనకు కూడా స్పష్టత లేదట. వ్యవహారం కేంద్రం మీదకు తోసేసి…మహేష్ గౌడ్ రాజకీయ కామెంట్లు చేస్తున్నారా అనే విమర్శలు వస్తున్నాయి. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్…కేటీఆర్ అరెస్ట్ అవడం పక్క అంటూ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మళ్లీ ఆయనే అరెస్టు ఎందుకు ఎక్కడ ఆగుతుందంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది సొంత పార్టీలోనే కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తోంది. ప్రభుత్వం ఈ ఫార్ములా రేసులో ఎందుకు దూకుడును తగ్గించింది..? కేసు ఎలాగో నమోదు చేశాం…ఇక ఈడీనే చూసుకుంటుందిలే అని వదిలేశారా ? అనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పెద్దలు ఒక రకమైన వాదనను…పీసీసీ చీఫ్ మరో రకమైన వాదనను తెరమీదకి తెచ్చారు. దీంతో కేటీఆర్ అరెస్టు విషయంలో కన్ఫ్యూజన్ నాయకుల మధ్య ఉందా ? లేదంటే ? ఈ ఫార్ములా కేసులో ముందుకు వెళ్లలేకపోతున్నారా..? అని పార్టీలో సీనియర్ నేతలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వానికి పార్టీ నాయకత్వానికి మధ్య సమన్వయ లోపం ఉందా..? కీలకమైన అంశంలో ఇద్దరు వేరు వేరు రకాల ప్రకటనలు చేసి పలచన అవ్వడం తప్పితే మరే వ్యూహం కనపడటం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.