NTV Telugu Site icon

Off The Record : కాంగ్రెస్‌ సర్కారును ఇరుకున పెడుతున్న బీఆర్‌ఎస్‌ పార్టీ.. మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి ?

Otr Brs

Otr Brs

ఫార్మా సిటీ కేంద్రంగా తెలంగాణలో పొలిటికల్‌ సెగలు పెరుగుతున్నాయా? రాజకీయంగా వాడుకునేందుకు గులాబీ స్కెచ్‌ రెడీ అయిందా? ఆ పార్టీ యాక్షన్‌ ప్లాన్‌ ఎలా ఉండబోతోంది? అరెస్ట్‌ల వెనకున్న మైలేజ్‌ లెక్కలేంటి? పార్టీ పెద్దల మధ్య జరుగుతున్న చర్చ ఏంటి? ఒకదాని వెంట ఒకటిగా వివిధ అంశాలను ఎత్తుకుని కాంగ్రెస్‌ సర్కార్‌ని ఇరుకున పెడదామనుకుంటున్న బీఆర్‌ఎస్‌ని అదే స్థాయిలో అరెస్ట్‌ల భయం కూడా వెంటాడుతోందట. తాజాగా వికారాబాద్ కలెక్టర్‌ మీద దాడి కేసులో ఇరుక్కున్నారు ఆ పార్టీ నేతలు. ఏకంగా ఈ జిల్లా పరిధిలోకి వచ్చే సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. కలెక్టర్‌పై దాడి ఘటనలో కీలక వ్యక్తి గా ఉన్న సురేష్‌తో అంతకు ముందే పట్నం నరేందర్ రెడ్డి పలుమార్లు మాట్లాడారన్నది ప్రధాన ఆరోపణ. అలాగే ఈ కేసులో మిగతా కొంత మంది బీఆర్‌ఎస్‌ నాయకుల మీద కూడా కేసులు బుక్‌ అయ్యాయి. ఏకంగా కలెక్టర్ పైనే దాడి చేశారు కాబట్టి ప్రభుత్వం, పోలీసులు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు సమాచారం. అయితే… ఇక్కడే అలర్ట్‌ అయిన గులాబీ అధినాయకత్వం ఈ అరెస్ట్‌లను కూడా రాజకీయ అంశంగా టర్న్‌ చేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. ఏ అంశం దొరికినా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్న క్రమంలో…. అరెస్ట్ల ఎపిసోడ్‌పై సీరియస్‌గానే దృష్టి సారిస్తున్నట్టు సమాచారం. అందుకే అసలు వికారాబాద్ కలెక్టర్ పై దాడి ఎందుకు చేశారో మేము చెబుతాం అంటున్నారట. కొడంగల్ ప్రాంతంలో ఫార్మా సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని, దీన్ని అక్కడి రైతులు వ్యతిరేకిస్తున్నారంటూ మొదలు పెడుతున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. రైతులకు అండగా మా పార్టీ నేతలు నిలబడటం తప్పా అన్నది వాళ్ళ క్వశ్చన్‌.

అలాంటి సందర్భాల్లో ఎన్ని కేసులు పెడితే తమకు అంత సానుభూతి వస్తుందన్నది బీఆర్‌ఎస్‌లో జరుగుతున్న అంతర్గత చర్చగా తెలిసింది. కొడంగల్‌లో ఫార్మాసిటీ ఏర్పాటు గురించి ముందే అందరికీ తెలుసు. కానీ… అది సిఎం సొంత నియోజకవర్గం కాబట్టి… పెద్దగా వ్యతిరేకత ఉండదు, మనం ఎంటరైతే అభాసుపాలవుతామని ముందు అనుకున్నారట బీఆర్ఎస్‌ పెద్దలు. కానీ… తాజా నిరసనలతో అక్కడ కూడా వ్యతిరేకత ఉందని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా… పొలిటికల్‌ మైలేజ్‌ కోసం వాడుకోవాలనుకుంటున్నట్టు సమాచారం. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే కార్యక్రమాల్ని ఎక్కడి నుంచో ఎందుకు…. నేరుగా సీఎం సొంత సెగ్మెంట్‌ నుంచే మొదలుపెడితే ఆ లెక్కే వేరని గులాబీ అధిష్టానం భావిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. మా పార్టీ ఎమ్మెల్యేలంతా కలిసి కొడంగల్‌ వెళ్తామని తాజాగా కేటీఆర్‌ ప్రకటించడం కూడా ఇందులో భాగమేనంటున్నారు. మొత్తంగా కొడంగల్‌ ఎపిసోడ్‌ని వీలైనంత హైలైట్‌ చేస్తూ… జనంలోకి వెళ్ళాలన్నది బీఆర్‌ఎస్‌ ప్లాన్‌గా తెలుస్తోంది. ఈ క్రమంలో జరిగే అరెస్ట్‌లను కూడా అనుకూలంగా మల్చుకునేందుకు స్కెచ్‌ వేస్తున్నట్టు అంతర్గత సమాచారం. దీంతో ప్రభుత్వం ఎలా కౌంటర్‌ చేస్తుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద ఫార్మాసిటీ కేంద్రంగా తెలంగాణలో పొలిటికల్‌ సెగలు పెరుగుతున్నాయి.

Show comments