Site icon NTV Telugu

Off The Record : గద్వాల్‌ను BRS గాలికొదిలేసిందా..? ఇంచార్జి ఎక్కడ ?

Brs

Brs

అక్కడ కారు ఫుల్‌ కండిషన్‌లో ఉందట. కానీ…. నడిపేందుకు డ్రైవర్‌ మాత్రం లేడు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారన్న ఎదురు చూపులతోనే సరిపోతోంది కేడర్‌కు. ప్రస్తుతానికి క్రైసిస్‌ టైం అయినా… భవిష్యత్‌ బాగుంటుందని కార్యకర్తలు నమ్మకంతో ఉంటే… వాళ్ళని నడపాల్సిన నాయకులు మాత్రం అడ్రస్‌లేరు. ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎందుకలా జరుగుతుతోంది? నడిగడ్డ ప్రాంతంగా చెప్పుకునే గద్వాల రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటుంది. 2014 ఎన్నికల వరకు కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించి అసెంబ్లీకి పంపగా …. 2018, 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్దికి బాసటగా నిలిచారు గద్వాల ఓటర్లు . మారిన రాజకీయ పరిణామాలతో బీఆర్‌ఎస్‌ గద్వాల జిల్లా అధ్యక్షుడుగా ఉన్న, ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణమోహన్ రెడ్డి హస్తం గూటికి చేరారు. దీంతో ఇప్పుడు గద్వాల కారుకు డ్రైవర్‌ లేని పరిస్థితి. నడిపే నాయకుడు లేక పార్టీ కేడర్‌ కూడా చెల్లాచెదురవుతోందట. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ముందుండి సన్నద్ధం చేయాల్సిన నాయకుడు కరువయ్యాడని, తమకు దిక్కు మొక్కు లేకుండా పోయిందని ఆందోళనగా ఉందట కేడర్‌. మరోవైపు గద్వాల నియోజకవర్గ గులాబీ బాధ్యతలు దక్కించుకునేందుకు పలువురు నాయకులు తెలంగాణ భవన్‌తో పాటు… జిల్లాలోని బీఆర్ఎస్ పెద్దల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే… వాళ్ళలో నియోజక వర్గంపై పూర్తి పట్టుతో పాటు, ఆ స్థాయి ఉన్న లీడర్స్‌ కనిపించడం లేదట. అందుకే పార్టీ పెద్దలు రకరకాల లెక్కలేసుకుంటూ మేటర్‌ని సాగదీస్తున్నట్టు సమాచారం.

నియోజకవర్గ పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న నాగర్ దొడ్డి వెంకట్రాములుతో పాటు హనుమంతు, కుర్వ విజయ్ , ఆంజనేయులు గౌడ్ రేస్‌లో ఉన్నా….పెద్దలు మాత్రం వేచి చూసే ధోరణిలోనే ఉన్నారట. అటు వివిధ సమీకరణలను ముందుకు తెస్తూ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌ కేటీఆర్‌ స్థాయిలో లాబీయింగ్‌ చేస్తున్నట్లు సమాచారం. గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్‌తో పాటు జిల్లా అధ్యక్షుడిని కూడా అన్వేషించే పనిలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు గద్వాల బీఆర్ఎస్ ఆఫీస్‌ తాళాలు తీసే దిక్కు లేకుండా పోయింది. గతంలో సందడిగా ఉండే ఆఫీస్‌… ఇటీవల ఎప్పుడూ చూసినా తాళాలతోనే వెక్కిరిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా హస్తం పార్టీ గాలి వీచినా, గద్వాలలో మాత్రం వరుసగా రెండు సార్లు బీఆర్ఎస్ అభ్యర్దిని గెలిపించిన బలమైన కేడర్‌ మాత్రం ఉంది. కానీ… నడిపే నాయకత్వం మాత్రం కరవైంది. ఇక ఇదేసమయంలో గులాబీ పార్టీ సరితా తిరుపతయ్యకు జడ్పి చైర్ పర్సన్ గా అవకాశం కల్పించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నాయకులు మారినా… క్షేత్ర స్థాయిలో హార్డ్‌కోర్‌ కేడర్‌ అలాగే ఉందని, సరైన నాయకత్వాన్ని ఇస్తే మా సత్తా ఏంటో చూపిస్తామని అంటున్నారట. ఇదిలా ఉంటే మారిన పరిణామాలతో కాంగ్రెస్ కండువా కప్పుకున్నార….. తూచ్ నేను పార్టీ మారలేదు , నియోజక వర్గ అభివృద్ధి ఎజెండాతోనే ముఖ్యమంత్రిని కలిశాను, నేను బి అర్ ఎస్ లోనే గెలిచా… బి అర్ ఎస్ లోనే ఉన్నా అంటున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మళ్ళీ గులాబీ గూటికి చేరతారన్న టాక్ నడుస్తోంది. ఆయన మనసు బి అర్ ఎస్ వైపే లాగుతోందని, త్వరలోనే గులాబీ గూటిలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద దిక్కు మొక్కు లేకుండా పోయిన గద్వాల బీఆర్‌ఎస్‌కు ఓ నాయకుడు కావాలంటోంది అక్కడి క్యాడర్.

Exit mobile version