NTV Telugu Site icon

Off The Record : కేటీఆర్ పాదయాత్ర ఫిక్స్ అయ్యారా..? పార్టీని నిలబెట్టడానికి ఇదే కరెక్ట్ మెడిసినా?

Ktr Otr

Ktr Otr

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాదయాత్రకు ఫిక్స్‌ అయ్యారా? పర్సనల్‌ ఇమేజ్‌తో పాటు పార్టీని నిలబెట్టడానికి అదే కరెక్ట్‌ మెడిసిన్‌ అని క్లారిటీకి వచ్చేశారా? కానీ… అంతకు మించి ఆయన ఇంకేదో ఆశిస్తున్నారన్న విశ్లేషణల్లో వాస్తవం ఉందా? పైకి చెప్పేవన్నీ కాదు, అసలు సీక్రెట్‌ అదేనన్న వాదన ఎందుకు బలపడుతోంది? కేటీఆర్‌ పాదయాత్ర సెంట్రిక్‌గా…. సీక్రెట్స్‌ పేరుతో జరుగుతున్న కొత్త చర్చ ఏంటి?

రాజకీయ నాయకుల పాదయాత్రల పరంపరలో మరో కొత్త టూర్‌ మొదలవబోతోందా అంటే… యస్‌ అన్నదే బీఆర్‌ఎస్‌ వర్గాల సమాధానం. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన తాజా వ్యాఖ్యలు ఈ విషయాన్నే చెబుతున్నాయంటున్నారు పార్టీ నాయకులు. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, పార్టీలను బలోపేతం చేసేందుకు దేశంలోని చాలామంది నాయకులు పాదయాత్రలు చేస్తున్నారు…, మీరెప్పుడు చేస్తారన్న ఓ అభిమాని ప్రశ్నకు సమాధానంగా ఖచ్చితంగా తన పాదయాత్ర ఉంటుందని చెప్పారు కేటీఆర్‌. రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు తాను విస్తృతంగా పాదయాత్ర చేస్తానని ప్రకటించారాయన. అంతవరకు ఓకే అనుకున్నా… ఆ స్టేట్‌మెంట్‌ని బేస్‌ చేసుకుని తర్వాత మొదలైన చర్చలే ఆసక్తికరంగా మారుతున్నాయి. కేటీఆర్‌ యాత్ర సమయం, సందర్భంపై కొత్త కొత్త విశ్లేషణలు వినిపిస్తూ… ఆసక్తి రేపుతున్నట్టు చెప్పుకుంటున్నాయి తెలంగాణ రాజకీయ వర్గాలు. అటు బీఆర్‌ఎస్‌లో కూడా అంతర్గతంగా వివిధ కోణాల్లో మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది. పాదయాత్ర లాంటి అంత పెద్ద నిర్ణయాన్ని బహిరంగ సభలోగానీ, లేదా కనీసం చిన్నపాటి మీటింగ్‌లోగానీ ప్రకటించకుండా ఎక్స్‌లో ఎందుకు చెప్పారని మాట్లాడుకుంటున్నాయట బీఆర్ఎస్‌ వర్గాలు. ఎప్పుడు చెప్పినా, ఎలా చెప్పినా ముఖ్య నాయకుడు పాదయాత్ర చేసిన పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందంటూ కేడర్‌ కూల్‌ కూల్‌ అంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో మరో రకం వాయిస్‌ కూడా వినిపిస్తోంది పొలిటికల్‌ సర్కిల్స్‌ నుంచి. పాదయాత్రను ఎప్పుడు మొదలుపెడతానన్న సంగతి చెప్పకుండా కేటీఆర్ వ్యూహాత్మకంగా దానికి సంబంధించి ఒక ఫీలర్‌ వదిలి ఉంటారని, దానికి బ్యాక్‌గ్రౌండ్‌ కూడా పెద్దదే ఉండవచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయట.

బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ అంటూ…. సీరియస్‌గానే ఉంది కాంగ్రెస్‌ సర్కార్‌. గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల అరెస్ట్‌లు ఉంటాయన్న గట్టి సంకేతాలు వెలువడుతున్నాయి. కొందరు మంత్రులు సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తూ పొలిటికల్‌ సెగలు పుట్టిస్తున్నారు. ఈ క్రమంలో ఆ మధ్య ఓ సభలో మాట్లాడుతూ… ఎలాంటి అరెస్ట్‌లకైనా తాను సిద్ధమని ప్రకటించారు కేటీఆర్‌. అందుకే ఇప్పుడు ఈ రెండిటినీ కలిపి చూస్తూ… కొత్త చర్చకు తెర లేపుతున్నారు కొందరు. ఒక వేళ కేటీఆర్‌ మీద ఏదో ఒక కేసు నమోదైతే… అది అరెస్ట్‌ దాకా ఎప్పుడు వెళ్తుందో తెలియదు. అందుకే ముందుగానే పాదయాత్ర మొదలుపెడితే… ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టినట్టు ఉంటుందన్నది బీఆర్‌ఎస్‌ ముఖ్యుల అంచనాగా తెలుస్తోంది. పాదయాత్ర మొదలైతే… ముందు కేటీఆర్‌ ప్రజల్లో ఉంటారు, దాని తాలూకూ ఇమేజ్‌ ఎలాగూ పెరుగుతుందని, ఇక అరెస్ట్‌ విషయానికి వస్తే… పాదయాత్రలో ఉన్నప్పుడు జనం మధ్యలోనే అరెస్ట్‌ అయితే… ఆ వచ్చే ఇమేజ్‌, ఆ లెక్కే వేరుగా ఉంటాయని లెక్కలు వేస్తున్నట్టు సమాచారం. అందుకే అరెస్ట్‌ వార్తలు చక్కర్లు కొడుతున్నప్పుడే… ఉద్దేశ్యపూర్వకంగా, వ్యూహాత్మకంగా పాదయాత్ర ప్రస్తావన చేసి ఉండవచ్చని అంచనా వేస్తున్నాయట తెలంగాణ రాజకీయవర్గాలు. తప్పనిసరి పరిస్థితుల్లో కేటీఆర్‌ అరెస్టయి, అదేదో యాత్రలో ఉన్నప్పుడే జరిగితే… అది పార్టీకి కూడా మంచి చేస్తుందంటూ లెక్కలు చెబుతున్నారట కొందరు బీఆర్‌ఎస్‌ ముఖ్యులు. ఆ సానుభూతి పవనాల్లోనుంచే గులాబీ మళ్లీ వికసిస్తుందని అనుకుంటున్నట్టు సమాచారం. ఈ వ్యూహ ప్రతి వ్యూహాలు, ఎత్తులు, పై ఎత్తులతో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ట్విస్ట్‌లు ఉంటాయో చూడాలంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.

Show comments