NTV Telugu Site icon

Off The Record: భువనగిరి బీఆర్‌ఎస్ పార్టీలో కంగారుకు కారణం ఏంటి ? క్యామ మల్లేష్ లెక్కలు కుదరలేదా ?

Otr Brs

Otr Brs

Off The Record: ఆ ఎంపీ నియోజకవర్గంలో కారు పార్టీ లెక్కలు, ఎక్కాలు పూర్తిగా తేడా కొట్టాయా? ఏకంగా జంక్షన్‌లో జామయ్యే పరిస్థితి వచ్చిందా? గోరంత ఆలస్యం కొండంత నష్టాన్ని తెచ్చి పెట్టిందా? వర్కౌట్‌ అవుతాయంటూ ముందే వేసుకున్న అంచనాలు ఎందుకు తప్పాయి? అక్కడ కారు కంగారు కారణాలేంటి? ముందు నమ్మకం ఉండి, తర్వాత తేడా కొడుతున్న ఆ నియోజకవర్గం ఏది? ఎందుకలా జరుగుతోంది?

అనుకున్నదొక్కటి… అవుతున్నదొక్కటి అన్నట్లుగా తయారైందట భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పరిస్థితి. ప్రత్యర్థి పార్టీలు రకరకాల ఈక్వేషన్స్‌తో.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రచారంలో దూసుకుపోతుంటే… ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారైందట గులాబీ పార్టీ పరిస్దితి.. అధినేత కేసీఆర్‌ పర్యటన తర్వాత జోష్ పెరుగుతుందని అనుకున్నా… అలాంటి ఛాయలు కూడా కనిపించకపోవడం ద్వితీయ శ్రేణిని కలవరపెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అన్ని లెక్కలు వేసుకుని ఎంపీ అభ్యర్థిగా క్యామ మల్లేష్ ను రంగంలోకి దింపితే కొన్ని చోట్ల లెక్కలు కుదరక… మరికొన్ని చోట్ల మనసులు కలవక.. తికమక పడుతున్నారట కారు పార్టీ నేతలు.. మొదట్లో క్యాస్ట్ ఈక్వేషన్స్‌తో కాంగ్రెస్, బిజెపి కంటే మెరుగ్గా ఉంటామని గులాబీ పార్టీ నేతలు భావించినట్టు తెలిసింది.. అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి, కేసీఆర్ బస్సు యాత్ర తమకు అదనపు బలం అవుతాయని, గట్టిగానే బరిలో నిలబడి పట్టుబిగిస్తామని గులాబీ నేతలు అని భావిస్తే… ఆ అంచనా తల్లకిందులై… మొత్తం రివర్స్‌ అయిందన్న భావన ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తం అవుతోందట. సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకొని… ఉమ్మడి జిల్లాతో సంబంధం లేకపోయినా… ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన మల్లేష్‌ను బరిలో దింపింది పార్టీ.

ఆయన క్లీన్ ఇమేజ్ కు తోడు…. అదే సామాజిక వర్గ ఓట్లర్లు 3 లక్షల వరకూ ఉండటంతో… విజయావకాశాలను ప్రభావితం చేస్తామని భావించారు. కానీ… గ్రౌండ్‌ రియాలిటీకి వచ్చేసరికి వ్యవహారం నోటి లెక్కలేసుకున్నంత తేలిగ్గా కనిపించడం లేదట. దీంతో మన లెక్కలు ఎక్కాలు ఎక్కడో తప్పాయి అన్నా… అంటూ పార్టీ నేతలే మాట్లాడుకుంటున్న పరిస్థితి. తమకు ఏది బలం అని భావించి అభ్యర్థిని రంగంలోకి దింపారో… ఆ బలాన్ని అనుకూలంగా మలుచుకోలేకపోతున్నట్టు చెబుతున్నారు పరిశీలకులు. ఈ విషయంలో ప్రత్యర్థి పార్టీ…. గాంధీభవన్ వేదికగా వేగంగా, వ్యూహాత్మకంగా పావులు కదపడంతో బీఆర్ఎస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయిందని అంటున్నారు… కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య క్యాస్ట్ ఈక్వేషన్స్ విషయంలో టెక్నిక్‌గా వ్యవహరించడంతో కారు వ్యూహం వికటించిందంటున్నారు ఆ పార్టీకే చెందిన సీనియర్ కార్యకర్తలు. దీనికి తోడు ఉమ్మడి జిల్లా క్యాడర్ తో క్యామ మల్లేష్ కు సత్సంబంధాలు లేకపోవడం, నియోజకవర్గ పరిధిలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలలో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా ప్రచారాన్ని మమ అనిపించడం…మైనస్‌ అవుతున్నాయట. మాజీ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో క్యాడర్ ను ప్రచారానికి సమాయత్తం చేయకపోవడం మరింత ఆందోళన కలిగించే పరిణామంగా చెబుతున్నారు. కీలక ఎన్నిక సమయంలో ప్రధాన పార్టీలు లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా ఉంటే.. బీఆర్ఎస్ పరిస్దితి మాత్రం ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెదొక దారి అన్నట్లుగా ఉందని గులాబీ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. మొత్తంగా కలసిరాని క్యాస్ట్, లోకల్ ఈక్వేషన్స్‌, తోడురాని కొందరు మాజీ ఎమ్మెల్యేల కారణంగా భువనగిరి కారు పార్టీలో కంగారు మొదలైందనే అభిప్రాయం సర్వత్రా పెరుగుతోంది. పోలింగ్‌కు ఇక పెద్దగా టైం లేదు… ప్రచారానికి అసలే లేదు. ఈ పరిస్థితుల్లో జామైపోయిన లోకల్‌ కారు గేర్లను అధిష్టానం సర్వీసింగ్‌ చేసి రిలీజ్‌ చేస్తుందా లేక అలాగే వదిలేస్తుందా అన్నది ఆసక్తిగా మారింది.