NTV Telugu Site icon

Off The Record : లోక్‌సభ ఎన్నికల్లో దుమ్ము దులిపేస్తామంటున్న BJP కి Medak లో అభ్యర్థులే లేరా..?

Otr Bjp

Otr Bjp

లోక్‌సభ ఎన్నికల్లో దున్నేస్తాం…. దుమ్ము దులిపేస్తాం…. తెలంగాణలో డబుల్‌ డిజిట్‌ కొట్టేస్తామని సవాళ్ళు చేస్తున్న కాషాయ దళానికి ఆ జిల్లాలో నడిపే నాయకుడు లేడట. ప్రతి సీటు ముఖ్యమని భావిస్తున్న టైంలో రెండు నియోజకవర్గాలున్న జిల్లాను పార్టీ నాయకత్వం ఎందుకు లైట్‌ తీసుకుంది? మాకో నాయకుడు కావాలి మొర్రో….. అని కేడర్‌ మొత్తుకుంటున్నా పెద్దలు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఏదా జిల్లా? ఏవా రెండు నియోజకవర్గాలు? లోక్‌ సభ ఎన్నికల్లో ఈ సారి టార్గెట్‌ 400 అంటోంది బీజేపీ. తెలంగాణ పర్యటనలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు ప్రధాని మోడీ. తెలంగాణలో అందరికంటే ముందుగానే 9మంది అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. ఇప్పటికే విజయ సంకల్ప యాత్రల పేరుతో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అంతవరకు బాగానే ఉన్నా… ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయట. మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ సీట్ల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో చాలా చోట్ల సరైన నాయకత్వం లేక పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటోంది కేడర్‌. అసెంబ్లీ ఎన్నికల సమయంలో లీడర్లు ఫుల్లుగా ఉన్నా ఎమ్మెల్యే టికెట్లు రాక కొంతమంది పార్టీ మారితే… మరికొందరు ఎన్నికల ఫలితాల తర్వాత కాషాయ కండువా పక్కన పెట్టేశారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లు ఉంటే… గజ్వేల్, పటాన్ చెరు, మెదక్, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లో పార్టీకి చెప్పుకోదగ్గనేతలు లేరు. గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేసి ఓడిపోయారు.

 

ఇప్పుడాయన మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థిగా ఖరారయ్యారు. అందుకే గజ్వేల్‌ని పూర్తిగా పక్కకు నెట్టేశారన్నది పార్టీ టాక్‌. ఇక పటాన్‌చెరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నందీశ్వర్ గౌడ్ ఎన్నికల తర్వాత సైలెంట్‌గా ఉన్నారు. ఆ తర్వాత పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమానికి హాజరవలేదు గానీ… ప్రధాని పర్యటనలో మాత్రం తళుక్కుమన్నారు. దీంతో మళ్లీ ఆయన యాక్టివ్‌ అవుతారా? కారా అన్న డౌట్ ఉంది. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో పేరుకు లీడర్స్‌ ఉన్నా.. అంతగా ప్రభావం చూపగలిగే వారు అవకపోవడం మైనస్‌ అంటున్నారు. ఇక జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని సంగారెడ్డి జిల్లాలో మూడు నియోజకవర్గాలుండగా అందులో ఆందోల్, జహీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌లలో పార్టీని ముందుండి నడిపించే దిక్కే లేదట. అందోల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి బాబూ మోహన్ పార్టీ, నాయకులపై తీవ్ర విమర్శలు చేసి రాజీనామా వెళ్ళిపోయారు. ఇక జహీరాబాద్ నుంచి పోటీ చేసిన దామోదర రామచందర్ ఎన్నికల సమయంలో పార్టీలో వచ్చి పోటీ చేసి ఓడిపోగానే… పార్టీ కండువా పక్కన పెట్టేస్తున్నానంటూ ఏకంగా లేఖ రాసేశారు. ఇలా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న పదికి ఆరు నియోజకవర్గాల్లో పార్టీని నడిపించే నాయకుడి కోసం ఎదురు చూస్తోంది బీజేపీ కేడర్‌. అసలే లోక్‌సభ ఎన్నికల టైం కాబట్టి వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని, లేదంటే ఇబ్బందులు తప్పవంటున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు. ప్రస్తుతానికి అసెంబ్లీ కన్వీనర్స్‌తో నెట్టుకొస్తున్నా… ఎలక్షన్ టైంలో అలర్ట్‌ అవకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నది కేడర్ భయం. మరి పార్టీ అగ్రనాయకత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటుంటో లేదో చూడాలి.