NTV Telugu Site icon

TDP, Janasena పొత్తు లెక్కలు తప్పుతున్నాయా ?

Tdp Janasena Otr

Tdp Janasena Otr

పురిట్లోనే పొత్తు లెక్కలు తప్పుతున్నాయా? టీడీపీ, జనసేన నాయకుల మధ్య మనస్పర్ధలు, మొహాలు మాడ్చుకోవడాలు మొదలయ్యాయా? గ్లాసు పార్టీ డిమాండ్లకు తమ్ముళ్లు బేజారవుతున్నారా? ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచే ఈ ప్రహసనం మొదలైందా? జిల్లాలోని ఆ మూడు సీట్లు మాకేనని ఢంకా భజాయించి చెబుతున్న జనసైనికులకు టీడీపీ నాయకులు కౌంటర్‌ సిద్ధం చేసుకుంటున్నారా? లెట్స్‌ వాచ్‌.

Also Read : Brahmanandam: ఘనంగా బ్రహ్మానందం రెండో కొడుకు నిశ్చితార్థం

ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు నియోజకవర్గాలపై జనసేన కన్నేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఎప్పటి నుంచో తెనాలి సీటు మాదేనని చెప్పుకొస్తున్న సేన, తాజాగా మరో రెండు కావాలంటోందట. పార్టీలో నంబర్ 2 అయిన నాదెండ్ల మనోహర్ కోసం తెనాలిలో ఇప్పటికే కర్చీఫ్ వేసి ఉంచింది. దాంతో పాటు రిజర్వుడ్ స్థానమైన ప్రత్తిపాడు, పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట సీట్లు కూడా తమకే కావాలని అడుగుతున్నారట జనసేన నాయకులు.గతంలో సత్తెనపల్లి సీటుపై ఆశలు పెట్టుకున్నా… ఇప్పుడు అక్కడ సీనియర్ నాయకుడు, ఇటీవల టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ పాగా వేశారని తెలిశాక ఆశలు వదులుకున్నారు. అందుకే ఇప్పుడు లిస్ట్‌లో నరసరావుపేట చేరిందట.గతంలో నరసరావుపేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన జనసేన నాయకుల కదలికలు ఇటీవల పెరిగాయి. తిరిగి మేమే పోటీచేస్తామని ఆ పార్టీ నాయకులు ప్రకటించడం హాట్‌ టాపిక్‌ అయింది.

ఆయన మాటవరసకన్నారా, లేక పార్టీ జిల్లా నాయకత్వమే ఎక్కువ సీట్లు అడగాలన్న ఉద్దేశ్యంతో అలా మాట్లాడించిందా అన్న చర్చ జరుగుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు సీట్లు ఇవ్వాల్సిందేనని జనసేన నాయకులు ముందస్తు డిమాండ్లు పెట్టడంపై టీడీపీ కేడర్‌ గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. వాళ్ళ దెబ్బకు మా సీట్లు ఎక్కడ గల్లతవుతాయోనని కంగారుగా ఉన్నారట టీడీపీ నాయకులు. నియోజకవర్గాల్లో నాలుగేళ్ళ నుంచి కష్టపడి తిరుగుతున్నామని, ఇప్పుడు జనసేన ఏకంగా మూడు సీట్లు కావాలంటే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారట. పొత్తు వల్ల పార్టీకి జరిగే లాభం ఎంతో తెలియదుగానీ…మేం మాత్రం భారీగా నష్టపోతామని ఆయా నియోజకవర్గాల నాయకులు సన్నిహితుల దగ్గర చెబుతున్నట్టు తెలిసింది. టీడీపీ ఇన్ఛార్జ్‌లను నమ్ముకున్న కేడర్‌ కూడా ఈ పరిణామాలపై అసహనంగా ఉందట.

నియోజకవర్గ స్థాయిలో మాట్లాడుతున్న వారికి జనసేన నాయకులు కూడా గడుసుగానే సమాధానం చెబుతున్నట్టు తెలిసింది. తెనాలి ఇన్చార్జ్‌ ఆలపాటి రాజాకు ప్రత్యామ్నాయ నియోజకవర్గం ఉందనీ… గుంటూరు పశ్చిమగాని ,పెదకూరపాడు నుంచి గాని రాజా పోటీ చేయవచ్చని అంటున్నారు. అలాగే ప్రత్తిపాడుకు ఇప్పటిదాకా ఇన్చార్జి ఎవరూ లేరు కాబట్టి… ఆ సీటు మాకు ఇస్తే మీకొచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నిస్తున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి ఒక్క నరసరావుపేటలో మాత్రమే తేడా ఉంటుందని, అది కూడా సెట్‌ చేసుకుంటే… ఇక అన్నీ మంచి శకునములేనని అంటున్నారట జనసేన నాయకులు. మరి టీడీపీ నిజంగా గుంటూరు జిల్లాలో మూడు సీట్లు ఇస్తుందా? లేకుంటే.. జనసేన ఎలారియాక్ట్‌ అవుతుంది చూడాలి. కానీ…ఇక్కడ గమనించాల్సిన అంశం మాత్రం ఒకటి ఉంది. పూర్తిగా పొత్తు ప్రకటనలు రాకముందే… ఇలా ఎవరికి వారు లెక్కలేసుకుని… మనస్పర్ధలు పెంచుకుంటుంటే… అసలు సినిమా ముందుంది గనుక అప్పటికి అంతా ఎలా రియాక్ట్‌ అవుతారన్నది బిగ్‌ క్వశ్చన్‌.