తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలుగంటున్న కాంగ్రెస్ పార్టీ ఒక్క డీసీసీ అధ్యక్షుడిని నియమించలేకపోతోందా? ఎన్నికలు దగ్గరపడుతున్నా…ముఖ్య నేతల మధ్య సమన్వయం అన్న మాటే లేకుండా పోతోందా? ముగ్గురు సూపర్ సీనియర్ నాయకులు ఒక్క జిల్లా విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపోతే… ఇక రాష్ట్రంలో అధికారంలోకి ఎలా వస్తారన్న ప్రశ్నలకు… గాంధీభవన్ సమాధానం ఏంటి? ఓవైపు తగలబడుతున్నా… టి కాంగ్రెస్ నేతలు మారరా? లెట్స్ వాచ్.
తెలంగాణ కాంగ్రెస్‌లో పదవుల పోటీ ఎక్కువ అవుతోంది. జిల్లా స్థాయిలో మొదలవుతున్న పంచాయతీలు రాష్ట్ర నేతల మధ్య వైరాన్ని పెంచుతున్నాయి. గాంధీభవన్‌లో ఉండే నేతలు కూడా తమ ఆధిపత్యం కోసమో, మరో కారణంతోనో చిన్న వివాదాలను పెంచి పోషిస్తున్నారు. అందుకు తాజా ఉదాహరణే జనగామ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి. తెలంగాణ కాంగ్రెస్‌లో మొత్తం పది జిల్లాల డీసీసీ అధ్యక్షుల పదవులు ఖాళీగా ఉంటే….ఎన్నికలు దగ్గర పడుతున్నందున 9 డీసీసీ పదవుల్ని భర్తీ చేసింది నాయకత్వం. కానీ.. ఒక్క జనగామే కొరకరాని కొయ్యలా మారిందట. అన్నిటినీ భర్తీ చేసి ఆ జిల్లాను ఎందుకు ఆపారన్న అంశాన్ని పరిశీలిస్తే టి కాంగ్రెస్‌లో ఆధిపత్యపోరు ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తోందని అంటున్నారు.
జనగామ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న… జంగా రాఘవరెడ్డి ఆ పదవిలో కొనసాగడానికి సిద్ధంగా లేరు. తాను 2018 ఎన్నికల్లో పోటీ చేసిన పాలకుర్తి నియోజకవర్గం నుంచి తిరిగి బరిలో దిగడానికి కూడా ఆయన సుముఖంగా లేరట. పాలకుర్తిలో తిరిగి గెలవలేనంటూ… తనకు వరంగల్ వెస్ట్ సీటు కావాలని చెప్పడం జిల్లాలో చర్చకు దారితీసింది. అయితే వరంగల్ వెస్ట్‌లో ఇప్పటికే సీనియర్ రాజేందర్ రెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో పొత్తు కారణంగా తనకు సీటు రాలేదన్న బాధలో ఉన్నారాయన. అందుకే ఈసారి గట్టిగా ఆశలు పెట్టుకున్నారు. ఇటు జంగా రాఘవరెడ్డి కూడా… జనగామ డీసీసీ కంటే…వరంగల్ వెస్ట్ మీదే ఆసక్తిగా ఉన్నారు. ఆయనకు మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మద్దతు ఇస్తున్నారన్న ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో ఉంది. అసలు జనగామ డీసీసీ నిమామకం..పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్….జోక్యంతోనే వాయిదా పడిందన్న అభిప్రాయంతో ఉన్నారు మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య. ఎవరి జిల్లాల్లో వారు తమ వారికి పదవులు ఇప్పించుకుని….జనగామ విషయంలో కూడా వేలు పెట్టడం ఏంటన్న ఆవేదనతో ఉన్నారట పొన్నాల. కొమ్మురి ప్రతాప్ రెడ్డిని జనగామ డీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని ప్రయత్నాలు చేస్తున్నారు రేవంత్. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కొమ్మురికే సపోర్ట్‌గా ఉన్నారు. సాధారణంగా చాలా విషయాల్లో విభేదించుకునే రేవంత్, కోమటిరెడ్డి అభిప్రాయాలు ఈ విషయంలో మాత్రం కలిసినట్టు చెబుతున్నారు. ఆయన్ని అంగీకరించే ప్రసక్తే లేదని భీష్మించుకుని కూర్చున్నారు పొన్నాల.
అటు ఇప్పుడున్న జంగా రాఘవరెడ్డిని కొనసాగించాలనుకున్నా.. అందుకు ఆయన సిద్ధంగా లేరు. దీంతో ఈ రోలర్ కోస్టర్‌లో పడి జనగామ డీసీసీ నియామకం తిరుగుతూనే ఉంది తప్ప కొలిక్కి రావడం లేదు.
కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి చిల్లర పంచాయతీలు సహజమైపోయాయి. రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీ …ఒక్క డీసీసీ నియామకం విషయంలో అంత గందరగోళ పడితే ఇక బలమైన ప్రత్యర్థిని ఎలా ఎదుర్కొంటుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి గానీ.. అది శృతి మించితే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని నేతలంతా గమనించాలని అంటున్నారు పార్టీ సానుభూతిపరులు. మరోవైపు కీలక నాయకులంతా కలిసి పొన్నాలకు చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారన్న టాక్ జిల్లా పార్టీలో ఉంది. నాలుగు స్తంభాలాటలో పీటముడి బిగుసుకుపోయిన జనగామ డీసీసీకి ఎప్పటికి మోక్షం కలుగుతుందో చూడాలి. ఈపంచాయతీలో ఉన్న నాయకులంతా రాష్ట్ర స్థాయిలో కీలక పదవుల్లో ఉన్నవారే. ఎవరు తగ్గుతారు? ఎవరు పంతం నెగ్గించుకుంటారన్న సంగతి తేలాల్సి ఉంది.