ఆ పార్లమెంట్ సెగ్మెంట్‌లో బిగ్ ఫైట్ తప్పదా ? నాడు అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రిని ఓడించిన నేత…ఇప్పుడు కుమారుడ్ని ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారా ? తండ్రిపై పైచేయి సాధించిన ఆ సీనియర్ నేత…లోక్‌సభ ఎన్నికల్లో కొడుకుకి ఓటమి రుచి చూపిస్తారా ? ఇంతకీ ఏంటా సెగ్మెంట్.? ఎవరా ప్రత్యర్ధులు ..? ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న వైరం ఏంటి.. ? నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఇప్పుడు హాట్ సీటుగా మారింది. ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యర్ధులుగా తలపడుతున్నారు. ఇద్దరూ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. దీనికి తోడు రెండు కుటుంబాల మధ్య ఏళ్లుగా రాజకీయ వైరం ఉండటంతో…ఈ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో నిరూపించుకోవడానికి సమాయత్తం అయ్యారట. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గం నుంచి మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్, బాజిరెడ్డి గోవర్ధన్ మధ్య బిగ్ పైట్ జరిగింది. ఆ ఎన్నికల్లో ధర్మపురి శ్రీనివాస్ పై 20వేల మెజార్టీతో బాజిరెడ్డి గెలిచారు. అంతకు ముందు వారిద్దరూ…ఒకే పార్టీలో ఉంటూ రాజకీయ ఉద్దండుగులు ఓ వెలుగు వెలిగారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో డి.శ్రీనివాస్‌తో తలపడ్డ బాజిరెడ్డి… ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో…డిఎస్ తనయుడు ఎంపీ అర్వింద్‌తో పోటీకి సై అంటున్నారు. అర్వింద్ బీజేపీ అభ్యర్ధిగా ఉంటే…బీఆర్ఎస్ తరపున బాజిరెడ్డి కయ్యానికి కాలు దువ్వుతున్నారట. రాజకీయాల్లో తలపండిన నేతగా బాజిరెడ్డి గుర్తింపు పొందారు. తనకంటే జూనియర్‌గా ఉన్న అర్వింద్ బరిలోకి దిగడంతో…రాష్ట్ర రాజకీయాలు ఇందూరు వైపు చూసేలా చేస్తున్నాయి.
మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ కుటుంబాల మధ్య ఏళ్లుగా రాజకీయ వైరం ఉంది. ఇద్దరు కాంగ్రెస్‌లో పని చేసినప్పటికీ…ప్రత్యర్ధులుగా మెలిగారట. పీసీసీ హోదాలో ఉండి.. తనను రాజకీయంగా అణగదొక్కేందుకు కుట్రలు చేశారని చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు బాజిరెడ్డి గోవర్దన్. డీఎస్‌తో పొసగక.. పార్టీ మారి ఆయనపైనే పోటీ చేసి మట్టికరిపించారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆయన కుమారునిపై బాజిరెడ్డి పోటీ చేస్తుండటం గెలుపు ఎవరిదన్న చర్చ జరుగుతోంది. తండ్రిని ఓడించిన అదే బాజిరెడ్డిని…ఎంపీ అర్వింద్ ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో వ్యూహాలు రచిస్తున్నారట. అప్పట్లోనే డీఎస్‌ను లైట్ తీసుకున్న బాజిరెడ్డి…ఆయన కుమారున్ని ఓడించడమే తన ధ్యేయమని ప్రచారం చేసుకుంటున్నారట. ఆర్మూర్, బాన్సువాడ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాజిరెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఐతే ఇప్పుడు ఎంపీగా బరిలో నిలిచి డీఎస్ ఫ్యామిలీని మరో సారి ఢీ కొట్టెందుకు రెడీ అయ్యారు.
బీజేపీలో కీలక నేతగా ఉన్న అర్వింద్.. రాజకీయాల్లో బాజిరెడ్డితో పోలిస్తే జూనియరే.. ఈ ఎన్నికల్లో జూనియర్ కు అవకాశం ఇస్తారా.. సీనియర్ కు పట్టం కడతారా ? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇద్దరు మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో…ఆ సామాజిక వర్గం ఓట్లను చీల్చడానికే బాజిరెడ్డిని బీఆర్ఎస్ బరిలోకి దించిందన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ చేస్తున్న ప్రయోగం ఫలిస్తుందా లేదా అన్నది తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సందే.