ఆ సీనియర్ నేతలు ఇద్దరి మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. సినిమా హీరోల రేంజ్‌లో పరస్పరం డైలాగ్‌లు పేల్చుకుంటూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు కావాల్సినంత వినోదం పంచుతున్నారు. ఈ మధ్య వాళ్ళు సీరియస్‌గా డైలాగులు చెబుతున్నా… జనానికి మాత్రం కామెడీ సినిమా చూస్తున్నట్టుగా ఉంటోందట. ఎవరా ఇద్దరు నాయకులు? ఏంటా డైలాగ్ వార్?
ఏపీలో కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటైన మైలవరంలో డైలాగ్ డైనమైట్లు పేలుతున్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, టిడిపి నేత దేవినేని ఉమా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గడిచిన నాలుగేళ్ళలో ప్రతి అంశం మీద ఇద్దరి మధ్య పోరు పతాక స్థాయిలోనే జరుగుతోంది. ఇప్పుడది ఇంకా ముదిరి తిట్ల పురాణం సినిమాటిక్ స్టైల్‌లోకి మారి రక్తి కట్టిస్తోంది. ఒకరు ఫైర్ అంటే మరొకరు ఫ్లవర్ అని, ఒకరు పుష్ప అంటే మరొకరు స్మగ్లర్ అంటూ సినిమా నటులకంటే గొప్పగా డైలాగ్‌లు వదులుతున్నారు. దీంతో సీరియస్ టాపిక్ కాస్తా కామెడీ ట్రాక్ ఎక్కినట్టు కనిపిస్తోంది. రాజకీయం సంగతి సర్లేగానీ… వీళ్ళిద్దరిలో ఫైర్ ఎవరు? ఫ్లవర్ ఎవరు అని నియోజకవర్గంలో జోరుగా చర్చించుకుంటున్నారట.
ఎమ్మెల్యే వసంత, మాజీ మంత్రి ఉమా ఇద్దరివీ రాజకీయ కుటుంబాలే. ఇద్దరి స్వస్థలం నందిగామ. పైగా…ఇద్దరూ సొంత నియోజక వర్గాన్ని వదిలి వచ్చి మైలవరంలో రాజకీయాలు చేస్తున్నవారే. కృష్ణప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వర రావు గతంలో మంత్రిగా పని చేశారు. ఉమా అన్న దేవినేని వెంకట రమణ కూడా చనిపోవడానికి ముందు మంత్రిగా చేశారు. ఉమాను ఓడించాలన్న పట్టుదలతో రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణ ప్రసాద్ 1999 ఎన్నికల్లో నందిగామ నుంచి పోటీ చేసి తానే ఓడిపోయారు. 20 ఏళ్ళ తర్వాత మైలవరం వచ్చి ఆ కోరిక నెరవేర్చుకోగలిగారు. ఇక గత ఎన్నికల తర్వాతి నుంచి ఉమా….ప్రతిపక్ష నాయకుడిగా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ…. వసంతను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కొండపల్లి మైనింగ్, వీటీపీఎస్ బూడిద, ఎమ్మెల్యే బావమరిది అవినీతి అంటూ… ఏదో ఒక రూపంలో టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యే వైపు నుంచి కూడా కౌంటర్స్ గట్టిగానే పడుతున్నాయి. నాలుగేళ్ళుగా ఈ మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.
తాజాగా దేవినేని ఉమా విమర్శల వాడి పెంచారు. వసంత కృష్ణప్రసాద్ స్మగ్లర్‌లాగా కొండపల్లి అడవుల్లో మైనింగ్ చేశారంటూ వాయిస్ పెంచారు. ప్రతిపక్ష నేతగా ఆ అంశాన్ని జనంలోకి బలంగా తీసుకువెళ్ళే ప్రయత్నంలో ఉండగానే కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు ఎమ్మెల్యే. దేవినేని ఉమ ఓ ఫ్లవర్ అంటూ కామెంట్స్ చేశారు. నియోజకవర్గంలో తనను తాను ఫైర్ అనుకుంటాడుగానీ…ఆయన ఉత్త ఫ్లవర్ అని వెటకారంగా అన్నారట వసంత. దీంతో ఇద్దరి మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరింది. నియోజకవర్గ ప్రజల్లో ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైందట. ఇద్దరూ రోడ్డెక్కి పరస్పరం గుట్లు బయటపెట్టుకోవడం బాగానే ఉంది, మాకూ ఎంటర్‌టైనింగ్‌గానే ఉందిగానీ… ఇంతకీ మీలో ఫ్లవర్ ఎవరు, ఫైర్ ఎవరిలో ఉందని ఎకసెక్కాలాడుతున్నారట మైలవరం జనం. మీరు ఇలాగే పేలిపోతూ… ఒకరి రంధ్రాలను ఒకరు బయటపెట్టుకోండి. అన్నిటినీ చూశాక ఫ్లవర్ ఎవరో, ఫైర్ ఎవరో పోలింగ్ రోజున మేమే డిసైడ్ చేస్తామని అంటున్నారట నియోజకవర్గ ఓటర్లు. రాబోయే ఏడాది కాలంలో ఎవరివి ఎన్ని లోగుట్లు బయటపడతాయో.. ఏమేం మాటలు వినాల్సి వస్తుందోనని మాట్లాడుకుంటున్నారట జనం.