శత్రువులు ఎక్కడో ఉండరు.. మిత్రుల ముసుగులో మన చుట్టూనే తిరుగుతుంటారని తెగ ఫీలై పోతున్నారట ఆ ఎమ్మెల్యే. నమ్మకస్తుల్లా తన చుట్టూ తిరుగుతున్న వాళ్ళే.. ఎప్పటికప్పుడు ప్రత్యర్థులకు సమాచారం చేరవేస్తూ ముందరి కాళ్ళకు బంధాలు వేస్తున్నట్టు బాధపడుతున్నారట. నాకంతా తెలిసిపోయింది.. ఇక మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్ అంటున్న ఆ ఎమ్మెల్యే ఎవరు?, ఆయన ఏం చేయబోతున్నారు?.
తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌కు కొందరు మిత్ర పక్షం నేతలే పక్కలో బల్లెంలా తయారయ్యారట. తాను ఏం మాట్లాడినా, ఏం చేసినా, ఏదన్నా చేయాలని అనుకున్నా…. వాళ్ళు వెంటనే ఆ సమాచారాన్ని ప్రత్యర్థులకు చేరవేసి…. తన మాటలను వక్రీకరించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారంటూ మండిపడుతున్నారు ఎమ్మెల్యే. ఇటీవల ఏ కార్యక్రమం జరిగినా… చేతికి మైకు దొరికితే చాలు ఈ టాపిక్ తప్ప వేరే ఏమీ మాట్లాడ్డం లేదట బొలిశెట్టి. తన చుట్టూ చేరి .. నియోజకవర్గంలో చేస్తున్న పనుల్లో తప్పులు వెతికే పనిలో ఉన్న సొంత నేతలతో పాటు మిత్ర పార్టీ నాయకులకు కూడా ఎమ్మెల్యే మాస్ వార్నింగ్స్ ఇవ్వడం రాజకీయంగా కలకలం రేపుతోంది.ఇటీవల బొలిశెట్టి ఏం మాట్లాడినా అది వివాదంగా మారడం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం వల్ల జనసేన అధిష్టానం నుంచి కూడా ఆయనకు తిప్పలు తప్పడం లేదట..మాట్లాడే సమయంలో కాస్త సంయమనం పాటించాలని పార్టీ పెద్దల నుంచి ఆదేశాలు వస్తున్నాయట.
ముక్కు సూటిగా వెళ్లే ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌కు ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారిందా అనే చర్చ ఆయన అనుచరవర్గంలో మొదలయ్యింది. కావాలని ప్రత్యర్థులు రెచ్చగొడుతుంటే…… వాళ్ళకు సమాధానం చెప్పే క్రమంలో ఎమ్మెల్యే ఇబ్బందుల్లో పడుతున్నారని, ఆయన ముక్కుసూటితనాన్ని కాస్త తప్పుగా అన్వయించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఇమేజ్ డ్యామేజ్ చేసే పనిలో ప్రత్యర్థులు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.దీంతో అసలు విషయం మరుగునపడి కొసరు విషయాల్లో MLA బొలిశెట్టి అలుసు అవుతున్నారన్న టాక్ నడుస్తోంది తాడేపల్లిగూడెంలో. ఆయన మాట్లాడిన మాటలు ముందు వెనుక కట్ చేసి వివాదంగా ఉండేలా ఎడిట్ చేసి మిత్ర పక్షాల నేతలు వైసీపీ వాళ్ళకు పంపుతున్నారట. ఈ విషయంలో టీడీపీ ఇన్ఛార్జ్, ఆయన అనుచరగణం ముందుందని బహిరంగంగానే అంటున్నారు బొలిశెట్టి. సొంత పార్టీ నేతలు కొందరు.. మిత్రపక్షం వాళ్ళు కొందరు కలిసి నా ఇమేజిని డ్యామేజి చేయాలని చూస్తే ఇకపై ఊరుకునేది లేదంటూనే గూడెంలో ఉండబోయేది జనసేన మాత్రమేనని ఎమ్మెల్యే అనడం మరింత కాక పెంచుతోంది. దీంతో కూటమి పార్టీలైన తెలుగుదేశం జనసేన మధ్య తాడేపల్లిగూడెంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది.
Also Read: Off The Record: బీఆర్‌ఎస్‌లో గుద్దులాటలు.. చిచ్చు రేపిన మండల అధ్యక్షుల ఎంపిక!
గతంలో టిడిపి ఇన్చార్జి వలవల బాబ్జి, ఎమ్మెల్యే బొలిశెట్టి మధ్య జరిగిన మాటల యుద్ధంపై పార్టీ అధిష్టానం సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలతో బొలిశెట్టి మాత్రం వెనక్కి తగ్గే ఆలోచనలో లేనట్టుగా కనిపిస్తోంది. గూడెంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలను వేగవంతం చేశారట ఎమ్మెల్యే. ఇందులో భాగంగా వైసిపి నుంచే కాకుండా…. టీడీపీ నుంచి వచ్చేవాళ్ళని కూడా జనసేనలో చేర్చుకోవాలని డిసైడైనట్టు సమాచారం. భవిష్యత్తులో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులు మారవచ్చు తప్ప సీటు మాత్రం ఎక్కడికీ పోదన్న భరోసాతో ఆ పార్టీ వైపు కొత్త నాయకులు అడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలతో ఇక్కడ అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ మధ్య దూరం మరింత పెరుగుతున్నట్టుగా కనిపిస్తోందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తాడేపల్లి గూడెం సీటు టీడీపీదేనని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకోవడాన్ని కూడా ఇదే కోణంలో చూడాలన్నది పరిశీలకుల మాట. ఈ పరిణామాలతో… తన మిత్రులుగా ఉన్న వారిలో కొందరు రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిక్స్ అయ్యారట బొలిశెట్టి. అందుకే…. దేవుడు కరుణిస్తే, ఆరోగ్యం సహకరిస్తే మరోసారి ఎమ్మెల్యే అవుతాను. లేదంటే జనసేన తరఫున మరొకరు వస్తారంటూ… ఇక టీడీపీకి ఇక్కడ అవకాశం ఇవ్వబోమన్నట్టు మాట్లాడ్డం పొలిటికల్‌గా సెగలు పుట్టిస్తోంది. గూడెం కూటమిలో రాజుకున్న ఈ కుంపటి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.